స్ఫూర్తి

1890 కాలంలో దేశ ప్రజలకు, ముఖ్యంగా విద్యావంతులకు ఆంగ్ల ప్రభుత్వ మత్తు బాగా తలకెక్కింది. ఇంగ్లీషువారు రైళ్ళు వేశారు, స్కూళ్ళు పెట్టారు, ఆసుపత్రులు కట్టారు. మాకు దొరలపాలనే బాగుంది. స్వరాజ్యం కోసం లాఠీదెబ్బలు తిని జైళ్ళకు పోవడం అనవసరమనే వాదం ప్రబలంగా ఉండేది. అందుకే 'స్వరాజ్యం నా జన్మహక్కు' అన్న లోకమాన్య తిలక్‌కు ఎక్కడకు వెళ్ళినా 'అసలు స్వరాజ్యం ఎందుకు?' అనే ప్రశ్న ఎదురయ్యేది.
 సృష్టిలో సకల జీవరాసులకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అలాంటప్పుడు మనకు కూడా అది ఉండాలి కదా అని చెపితే చాలామందికి ఆ సమాధానం సంతృప్తిగా ఉండేదికాదు. అప్పుడు ఆయన ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి ధరించిన గ్లాస్కో ధోవతిని చూపించి ''ఇది ఎంతకు కొన్నావు'' అని అడిగేవారు. ''పది రూపాయలకు కొన్నాను'' అని అతను సమాధానం చెప్పేవాడు. ''మరి నీవు చెల్లించిన పదిరూపాయలు ఎక్కడకి పోతున్నాయో తెలుసా?'' అని తిరిగి ప్రశ్నించేవారు. ''తెలీదు'' అని అతని సమాధానం. ''అయితే విను. నువ్వు చెల్లించిన పదిరూపాయలలో అర్థరూపాయి ఈ ఊళ్ళో బట్టల వ్యాపారికి పోతుంది. మరొక అర్థరూపాయి బొంబాయిలో బట్టలు దిగుమతి చేసుకున్న వ్యాపారికి పోతుంది. మిగతా తొమ్మిది రూపాయలు ఇంగ్లండులో బట్టలమిల్లు యజమానికి లాభంరూపంలోనూ, మిల్లు ఉద్యోగులకు వేతనం రూపంలోనూ పోతుంది. నేను స్వరాజ్యం ఎందుకు కోరుతున్నానంటే ఆ తొమ్మిది రూపాయలు కూడా మన దేశంలో ఉండడానికి. మన దేశపు డబ్బు మన దేశంలోనే వినియోగపడాలంటే స్వరాజ్యం కావాలి'' అని తిలక్‌ చెప్పేవారు. స్వరాజ్యం లేకుండా దేశీయుల శక్తిసామర్థ్యాలు సద్వినియోగపడవు.