చైనా ఎత్తులు చిత్తు చేద్దాం

ప్రస్తుతం ఒక దేశాన్ని మరో దేశం భౌగోళికంగా, సైనికంగా ఆక్రమించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అన్ని దేశాలూ సైనికంగా బలపడుతున్నాయి. దీనితో 'దురాక్రమణ' ఆగలేదుకానీ, దాని స్వరూపం మారింది. ఆర్థిక దాడి, చొరబాట్ల ద్వారా ఇతర దేశాల్ని బలహీనపరచి, స్వాధీనం చేసుకోవాలనే వ్యూహం అనుసరిస్తున్నాయి అనేక దేశాలు. వాటిలో ముఖ్యమైనది చైనా. చైనా వ్యూహాన్ని వమ్ముచేసి మన దేశ ఆర్థిక, భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైంది. 
ఆర్థిక దురాక్రమణ
భారత్‌కు 190 దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. వీటన్నింటిలో చైనాయే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయి కూర్చుంది. భారత్‌ నుండి చైనాకు కేవలం 9 బిలియన్‌ డాలర్ల వస్తువులు ఎగుమతి అయితే అక్కడ నుండి మాత్రం 61.7 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి అవుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం 52.7 బిలియన్‌ డాలర్ల నష్టమన్నమాట. చైనా వస్తువుల దిగుమతుల వల్ల మన దేశంలో ఉత్పత్తి, ఉపాధి రంగాల్లో 1/4 వంతు నష్టపోతున్నాం. భారీ సబ్సిడీతో, వ్యవసాయదారులు, కార్మికుల దోపిడీ, పర్యావరణ కాలుష్యం చేస్తూ చైనా నాసిరకమైన వస్తువుల్ని పెద్ద సంఖ్యలో తయారుచేసి మన మార్కెట్లలో కుమ్మరిస్తోంది. దీనివల్ల మన పరిశ్రమలు మూత పడుతున్నాయి. నేడు అమెరికాలో 'అమెరికా వస్తువు లే కొనండి, అమెరికన్లకే ఉద్యోగాలు' అనే నినాదం జోరుగా వినిపిస్తోంది. బ్రిక్స్‌ కూటమి నుండి వైదొలగిన తరువాత బ్రిటన్‌ ఉద్యోగాలు తమ దేశస్థులకే దక్కేట్లుగా విదేశస్థులను బయటకు పంపుతోంది. ఆస్ట్రేలియా కూడా అలాంటి చర్యలే చేపట్టింది. ఇతర దేశాల మార్కెట్లను తన వస్తువు లతో ముంచెత్తే చైనా కూడా తన దేశీయ మార్కెట్‌ ను రక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి మనం కూడా దేశీయ మార్కెట్‌ను పరిరక్షించుకునేందుకు స్వదేశీ విధానాన్ని అవలంబించాలి.
సైనిక దురాక్రమణ
1962నుండి మనకు చెందిన 43,000 చ.కి.మీల భూభాగాన్ని ఆక్రమించుకుని, కూర్చుంది చైనా. అప్పటి యుద్ధంలో 3080 మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అరుణాచల్‌తో పాటు 90,000 చ.కి.మీ భూభాగం తనదేనంటోంది.
దురాక్రమణ వ్యూహాన్ని అనుసరించే చైనా ఏడాదికి కనీసం 300 నుండి 400 సార్లు భారత భూభాగంలో కి చొచ్చుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల జూన్‌, 2017లో సిక్కింలోని డోక్లా ప్రాంతంలో చైనా సైనికుల చొరబాటును అడ్డుకునేందుకు భారత సైనికు లు 'మానవ కుడ్యం'గా నిలబడాల్సివచ్చింది. సిక్కం వద్ద భారత్‌, భూటాన్‌, టిబెట్‌ కూడలిలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని చైనా ప్రయత్నించింది. ఆ విధంగా భారత భూభాగంలోకి చొచ్చుకురావాలన్నది డ్రాగన్‌ దేశపు వ్యూహం.
తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్‌కు చైనా అన్ని అంతర్జాతీయ వేదికలపై మద్దతునిస్తోంది. పాకిస్థాన్‌తో ఉన్న సింధునది జలాల ఒప్పందాన్ని భారత్‌ సవరించుకోగానే చైనా బ్రహ్మపుత్ర నదీ జలాలను అడ్డుకుంది. పాకిస్థాన్‌ను ముందు ఉంచి ఆఫ్గనిస్థాన్‌ (మన మిత్రదేశం)లో తిరిగి తాలీబన్‌ల బలం పుంజుకునేట్లు చేస్తోంది చైనా. జైష్‌ - ఎ- మహమ్మద్‌, దాని నాయకుడు మౌలానా మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదులుగా ప్రకటించ నివ్వకుండా అడ్డుపడుతోంది.
అష్టదిగ్బంధనం
చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (ఎకనమిక్‌ కారిడార్‌) కొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లతో కూడుకున్నది. పాకిస్థాన్‌లో ఈ ప్రాజెక్ట్‌లు నిర్మాణం లో ఉన్నాయి. ఈ కారిడార్‌ పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసి తద్వారా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చడం కోసమేనని చైనా అంటోంది. ఈ కారిడార్‌వల్ల పాకిస్థాన్‌కు అదనంగా 62బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నది చైనా వాదన. పాకిస్థాన్‌ ఆర్థికంగా బలపడితే ఏం చేస్తుందో ఊహించడం అంత కష్టమేమీకాదు.
ఇదే కాకుండా చైనా 'వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌' పేరు మీద పాకిస్థాన్‌, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లకు వాణిజ్యమార్గాలను ఏర్పరు చుకునేందుకు ఈ దేశాలతో ఒప్పందాలు కుదు ర్చుకుంది. ఒక్క భూటాన్‌తో తప్ప మిగిలిన అన్ని దక్షిణాసియా దేశాలన్నింటితో ఇలాంటి ఒప్పందాలు చైనా చేసు కుంది. రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యమని, దీనివల్ల ఆయా దేశాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని చైనా అంటున్నా ఆసియా ప్రాంతంలో భారత్‌ను ఏకాకిని చేయడమే ఈ వ్యూహపు ఉద్దేశ్యం.
మన కర్తవ్యం
అణ్వస్త్ర దేశాలు కావడంవల్ల భారత, చైనాల మధ్య ప్రత్యక్ష యుద్ధం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతం సాగుతున్నది వాణిజ్య, ఆర్థిక యుద్ధం. ఇందులో సైన్యం పాత్ర ఏమీ ఉండదు. సామాన్య ప్రజానీకమే ఈ యుద్ధంలో సైనికులు. వారి ఆయుధం విదేశీ వస్తు బహిష్కరణ.ఇతర బ్రాండ్‌లు లభించినా, లభించకపోయినా చైనా బ్రాండ్‌ వస్తువులను మాత్రం కొనుగోలు చేయమని నేడు మనమంతా ప్రతిజ్ఞ తీసుకోవాలి. చైనా వస్తు వులు వేటినీ కొనరాదని ఇతరులకు కూడా నచ్చ చెప్పాలి. నేడు చైనా కొన్ని వస్తువుల్ని మన దేశంలోనే ఉత్పత్తి చేస్తోంది. అందువల్ల నిజానికి అవి చైనా వస్తువులైనా వాటిపై మాత్రం 'మేడ్‌ ఇన్‌ ఇండియా' (భారత్‌లో తయారైనది) అనే ఉంటుంది. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌ల విషయంలో ఇలా జరుగుతుంది. కాబట్టి చైనా బ్రాండ్‌లను గుర్తించడం కోసం వాటి పేర్లు - లెనోవా, ఓపో, హువాయీ, క్జోమీ, ఎంఐఇ4, ఎక్లాటెల్‌, అమోయీ, బిబికె, కూల్‌ప్యాడ్‌, కబోట్‌, జీ5, జియోనీ, హేయర్‌, హిసెన్స్‌, కోన్కా, మోటా, జడ్‌టిఈ, లియీకో, మైజూ, వనల్పస్‌, క్హు 360 మొదలైనవి. ఈ బ్రాండ్‌లే కాక ఇతర చైనా వస్తువులన్నింటినీ బహిష్కరించాలి. చైనా మన సరిహద్దుల్లోకి చొచ్చుకురాకుండా సైన్యం చూస్తుంది! మన దేశపు మార్కెట్‌లోకి చైనా వస్తువులు రాకుండా మనమంతా చూడాలి!