ఈ 'గోవ్యధ' ఈనాటిది కాదు

గోసంరక్షణ అంటే చాలా ప్రమాదకరమైన, అవాంఛనీయ విషయమనే రీతిలో దేశంలో ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ ఏ సమస్య గురించీ మాట్లాడనివారు కూడా గోసంరక్షులవల్లనే దేశంలో హింస, అరాచకత్వం ప్రబలిపోతున్నాయని గగ్గోలు పెట్టేస్తున్నారు. గోరక్షకుల నుండి 'అమాయకులను' (కేంద్ర)ప్రభుత్వం కాపాడలేక పోతోందంటూ విమర్శిస్తున్నారు. అసలు గోవులను రక్షించాల్సిన అవసరం లేనేలేదని, ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని మరికొందరు నిలదీస్తున్నారు. అయితే ఇలాంటి 'గోవధ' ధోరణి ఈనాటిది కాదు. దీనికి చాలా చరిత్రే ఉంది.
 ఇలాంటి ప్రచారానికి మూలం మార్క్సిస్టులు, మెకాలేయిస్టులు. ఈ భూమి నుండి హిందూ ధర్మ విలువల్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు వీళ్ళు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అందుకనే ఈ ధర్మానికి మూలమైన వేదాల్ని కూడా వక్రీకరించడానికి సాహసించారు. వేదకాలంలోనే గోవధ ఉండేదని, గోవధ తప్పుకాదని వేదాలే ఘోషిస్తున్నాయనే అబద్ధపు ప్రచారం చేశారు మార్కిస్టు మేధావులు. అందుకు వేద మంత్రాలకు తప్పు అర్ధాలు చెప్పారు.
వేదకాలంలో గోమాంసాన్ని నిరభ్యంతరంగా భక్షించేవారని, యజ్ఞయాగాది క్రతువుల్లో గోమాంసాన్ని సమర్పించేవారని ప్రచారం చేశారు. కానీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, వేదమంత్రాలు వైదిక సంస్కృతంలో ఉన్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే నిరుక్తం, నిఘంటువు, మహాభాష్యం, వ్యాకరణం మొదలైనవాటి జ్ఞానం కావాలి. అది ఉన్నప్పుడే వేదమంత్రాల అర్థం తెలుస్తుంది. వేద శబ్దాలకు లౌకిక అర్థాలు చెప్పుకుంటే సరిపోదు. పారలౌకిక, అధిభౌతిక అర్థాన్ని చెప్పుకోవాలి. కానీ లౌకికమైన సంస్కృతం కూడా రాని మార్క్సిస్టులు, మెకాలే మానసపుత్రులు వేదమంత్రాలకు తమకు తోచిన, కావలసిన అర్థాలు చెప్పేస్తుంటారు.
ఆంథొని మెక్‌డొనాల్డ్‌, ఆర్థర్‌ కీత్‌లు తయారు చేసిన ఋగ్వేద పారిభాషికపదకోశం ఇలాంటిదే. ఇందులో ఋగ్వేదంలోని 10-85-12 మంత్రం ప్రకారం 'ఆనాటి పెళ్ళిళ్ళలో గోమాంసాన్ని వడ్డించేవారు' అని వ్రాశారు. కానీ వాళ్ళు మంత్రంలోని 'హన్‌' అనే ఏ పదానికి 'చంపడం', 'వధించడం' అని అర్థం చెప్పారో ఆ పదానికి నిజానికి 'గతి', 'జ్ఞానం', 'ప్రాప్తి' అని అర్థమని పాణిని వ్యాకరణం చెపుతోంది. ఆ ప్రకారం వివాహాది శుభకార్యాల్లో గోదానం ఇచ్చేవారని, గోవును ఇతరులకు తరలించే(గతి)వారని తెలుస్తుంది. గోదానం గురించి మన దేశంలో అందరికీ తెలుసు.
ఆంగ్లేయులు ఎంతో ప్రజాధనాన్ని ఖర్చుచేసి కలకత్తా విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్‌ తారానాధ్‌తో తయారుచేయించిన 'వాచస్పత్యం' అనే సంస్కృత శబ్దకోశం ఇలాంటిదే. ఇందులో 'గోఘ్న' అనే పదానికి 'గోవధ చేసేవాడు' అనే అర్థం చెప్పారు. కానీ పాణినీయ అష్టాధ్యాయిలోని 'దాస గోఘ్నీ సంప్రదానే' అనే సూత్రం (3-4-73) ప్రకారం 'గోఘ్న' అనే పదం 'సంప్రదాన' సందర్భంలో ఉపయోగించారు. సంప్రదానం అంటే సంహరించడం కాదు దానం చేయడం. గోవులను దానం చేయడం గోఘ్న. బహుమతి రూపంలో గోవులను స్వీకరించే అతిధిని గోఘ్న అంటారు అని స్వామి ప్రకాశానంద సరస్వతి తన 'ది ట్రూ హిస్టరీ ఆఫ్‌ రిలిజియన్స్‌ అఫ్‌ ఇండియా' అనే పుస్తకంలో వివరించారు. కానీ వాచస్పత్యంలోని వక్రీకరణలను ఆధారం చేసుకుని 1872లో బారిస్టర్‌ రాజేంద్రలాల్‌ మిత్ర 'బీఫ్‌ ఇన్‌ ఏన్షియన్ట్‌ ఇండియా' అనే పుస్తకాన్ని, ఇటీవల మార్క్సిస్టు రచయిత డిఎన్‌ ఝా 'పారడాక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ కౌ' అనే పుస్తకాన్ని రాశారు. గోవధ, గోమాంస భక్షణ తప్పుకాదంటూ మిత్ర రాస్తే, ఋగ్వేదమంత్రం (10-85-13)లో పేర్కొన్న గోఘ్న అంటే ఎవరికోసం ఆవును వధించారో వారు అంటూ డిఎన్‌ ఝా రాశారు. ఇలా గోవధ గురించిన దుష్ప్రచారానికి ఆద్యులు ఆంగ్లేయులని తెలుస్తోంది.