మన ఊరు కడిపికొండ

వరంగల్‌జిల్లా హన్మకొండ మండలంలో కడిపికొండ గ్రామానికి పురాతనమైన చరిత్ర ఉంది. కాకతీయ రాజుల సుపరిపాలనతోపాటు మొగలాయి రాజుల దుశ్చర్యలు, దుర్మార్గాలను కూడా చూసింది ఆ గ్రామం.
ఇప్పటి కడిపికొండను ఒకప్పుడు కడపటికొండగా పిలిచేవారు. 
కాకతీయ సామ్రాజ్యానికి చివర ఉన్న కొండగా గుర్తించడంవల్ల దీనిని కడపటిికొండగా పిలిచేవారు. కాని ఆ పేరే రాను రాను కడిపికొండగా మారింది. ఈ కడిపికొండలోనే ప్రతాపరుద్రుడి కాలంలో ఒక శివాలయము నిర్మించారు. కానీ ఆ తరువాత ముస్లిం సామ్రాజ్యంలో ఔరంగజేబు పరిపాలనలో ఈ శివాలయాన్ని కూల్చివేయడం జరిగిందని చరిత్రలో ఆధారాలున్నాయి. శివాలయంలోని శిల్పాలు శిథిలమైపోయి శివలింగంతో సహా నేలలో కూరుకుపోయి అక్కడ ప్రదేశమంతా చెట్లు పుట్టలకు నిలయమైంది. తరువాత కొద్ది రోజుల సమయంలోనే అదే గ్రామానికి చెందిన సాధినేని చంద్రమోగిలి స్వామికి కలలో భగవంతుడు కనిపించాడు. దానితో గ్రామపెద్దల సహాయసహకారాలు తీసుకుని చంద్రమోగిలి స్వామి ఆ శివాలయాన్ని తిరిగి కట్టారు. ఈ విషయాన్ని కడిపికొండ గ్రామస్తులు ఇప్పటికీ చెపుతారు. అప్పటి నుండి స్వామి దైవచింతనతో సన్యాసిగా మారి శివభక్తుడైౖ, 'శివానందస్వామి' అనే దీక్షానామంతో జీవితం అంతా ఆ శివాలయంలోనే ఉన్నారు. అప్పుడే గీత జ్ఞానబోధ ఆశ్రమాన్ని 11మంది శిష్యులతో ఏర్పరిచారు. ఇదే కాకుండా ఆయన కొన్ని రచనలు కూడా చేశారు. 'బతుకమ్మ పాటలు', 'భూలోక సుఖాలు- యమలోక దు:ఖాలు' అనే కథలను బుర్ర కథలుగా గ్రామగ్రామాన చెపుతూ, వచ్చిన ఆదాయం మొత్తాన్ని దేవాలయానికి ఖర్చు చేశారు. ఈ రచనలు ద్వారా ప్రజలను సన్మార్గంలో నడిపిస్తూ తన జీవితాన్ని లోక కళ్యాణం కోసం అంకితం చేశారు. చివరకు తనకు ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా దేవాలయానికే అంకితం చేశారు. అవసానదశలో ఆయన ఆలయ బాధ్యతను కమిటీకి అప్పగించి శివాలయం ప్రాంగణంలోనే సమాధి ఏర్పరుచుకుని కైవల్యం పొందారు.
- సేకరణ
నాతి సరిత, కడిపికొండ, వరంగల్‌జిల్లా