పిడికిలి బిగిసింది.. తలాఖ్‌ కథ ముగిసింది..

ఐదుగురు మహిళలు ఛాందసవాదానికి ఎదురొడ్డి నిలిచారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పైన తమ గళాన్ని విప్పారు. తలాఖ్‌ను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిం చారు. కోర్టులో రుజువులతో సహా వాదించేలా చేశారు. చివరకు మానవత్వానికి మచ్చ తెచ్చే తలాఖ్‌ విధానాన్ని రద్దు చేసేలా కోర్టు తీర్పును సాధించారు. 
ఇలా ఎందరో ముస్లిం మహిళల జీవితాల్లో వారు వెలుగును నింపారు. 2015 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌కు చెందిన 36ఏళ్ళ షాయరా భానో తన భర్త 15 సంవత్సరాల కాపురం తరువాత కేవలం ఒక ఉత్తరం ద్వారా తలాఖ్‌ను చెప్పి విడాకులు తీసుకున్నాడని కోర్టుకు ఎక్కింది. ఇస్లాంలో మూడుస్లారు తలాఖ్‌ చెప్పే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. బహుభార్యత్వం, 'నిఖా హలాలా'లను నిషేధించాలంటూ పిటిషన్‌ను దాఖలు చేసింది. తనను అత్తింటి వారు ఎంత వేధింపులకు గురి చేశారో కోర్టుకు వివరించింది. అవి చట్ట, రాజ్యాంగ వ్యతిరేకమని తన పిటిషన్‌లో ఆమె పేర్కొంది. ఆమె భర్త రిజ్వాన్‌ అహ్మద్‌ అది ముస్లిం పర్సనల్‌ లాకు సంబంధించిన విషయమని వాదించారు. ఇలా గత రెండు సంవత్సరాల క్రితం త్రిపుల్‌ తలాఖ్‌కు వ్యతిరేకంగా షాయరా భానో పోరాటం మొదలైంది. ఆమెకు తోడుగా మరో నలుగురు ముస్లిం మహిళలు పిటిషన్‌లో తమ పేర్లను చేర్చుకున్నారు. తలాఖ్‌కు వ్యతిరేకంగా తమ గొంతును పెంచారు.
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన ఇష్రత్‌ జహాన్‌ది 15సంవత్సరాల వైవాహిక జీవితం. ఏప్రిల్‌ 2015 సంవత్సరంలో ఆమె భర్త దుబాయ్‌ నుండి ఫోన్‌లో మాట్లాడి మూడుసార్లు తలాఖ్‌ చెప్పి కాల్‌ను కట్‌ చేశాడు. తరువాత మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ ఇష్రత్‌ జహాన్‌ పిల్లలను తీసుకువెళ్ళిపోయింది. దీంతో తనకు తన పిల్లలు కావాలంటూ, తనకు భర్త నుండి భరణం ఇప్పించాలని కోర్టు మెట్లెక్కింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రామ్‌పూర్‌కు చెందిన గుల్షన్‌ పర్వీన్‌కు 2013లో వివాహం అయ్యింది. తరువాత వరకట్న వేధింపులు పెరిగిపోయాయి. వరకట్న వేధింపుల కేసులో భర్త అరెస్ట్‌ అవ్వడంతో 2015 సంవత్సరంలో పుట్టింటికి వెళ్ళింది. ఓ రోజు అనుకోకుండా ఆమె భర్త నుండి 10 రూపాయల స్టాంప్‌ పేపర్‌ పై తలాక్‌నామా వచ్చింది. దీంతో పర్వీన్‌, ఆమె రెండేళ్ళ కుమారుడు నిరాశ్రయులయ్యారు. ఆమె భర్త విడాకుల కోసం రామ్‌పూర్‌ ఫ్యామిలీ కోర్టును, త్రిపుల్‌ తలాఖ్‌ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా పరిచయమైన వ్యక్తిని 2014లో ఆఫ్రిన్‌ రహ్మన్‌ వివాహం చేసుకుంది. ఆ తరువాత నుండి అత్తగారి ఇంట్లో వేధింపులు ఎక్కువ అయ్యాయి. 2015 సంవత్సరంలో ఆమెను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ఆమె పుట్టింటికి చేరింది. ఓ రోజు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా విడాకుల పత్రం వచ్చింది. దీంతో ఆమె న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2012లో వివాహమైన అతియా సబ్రికి ఆమె భర్త కేవలం ఒక చిత్తు కాగితం పైన తలాఖ్‌ అని రాసిచ్చి విడాకులిచ్చాడు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన కూతుర్లను పెంచడానికి తనకు స్థోమత లేదని. న్యాయం కావాలంటూ సుప్రీం కోర్టును ఆమె ఆశ్రయించింది.
ఈ ఐదుగురికి మద్ధతుగా మరో భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ వ్యవస్థాపకురాలు జకియా సోమన్‌ రంగంలోకి దిగింది. తమ సంస్థ ద్వారా చేపట్టిన సర్వేలో 90శాతం మంది ముస్లిం మహిళలు తలాఖ్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపింది. ఖురాన్‌లో స్త్రీ, పురుషులు ఇరువురికి సమాన హక్కులు ఉన్నాయంటూ తన వాదనలను వినిపించింది. ''సమానత్వం కోసం శోధన'' అనే పేరిట పిటిషన్‌ను దాఖలు చేసింది. రాజ్యాంగ బద్ధంగా అందరికీ సమానత్వాన్ని అందించాలని డిమాండ్‌ చేసింది. ఐకమత్యంతో ముందుకు సాగడంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో త్రిపుల్‌ తలాఖ్‌ను వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. రెండు సంవత్సరాల వాదోపవాదాల తరువాత తలాఖ్‌ను నిషేధిస్తూ తీర్పు వచ్చింది. వచ్చే ఆరు నెలలోగా పార్లమెంటు ద్వారా చట్టం చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జెఎస్‌.ఖెహర్‌, కురియన్‌ జోసెఫ్‌, రోహిన్‌ టన్‌ ఫాలి నారిమన్‌, ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, అబ్దుల్‌ నజీర్‌లు ఈ చారిత్మ్రాక తీర్పును ఇచ్చి ముస్లిం మహిళలకు న్యాయాన్ని చేశారు.