మన ఊరు


బైరాన్‌పల్లి
ప్రతి గ్రామానికి చరిత్ర ఉంటుంది. ఆధ్యాత్మిక, పురాతన లేదా ప్రకతి సంబంధమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. కాని బైరానపల్లి పేరు చెపితే మాత్రం నిరంకుశ నిజాం రాజు సైన్యం, ముస్లిం మతోన్మాద రజాకర్ల దుర్మార్గాలు, దురాగతాలు, వాటిని ఎదురించి నిలిచిన వీరత్వం గుర్తుకు వస్తాయి. రజాకారుల ఆగడాలు, దుశ్చర్యలకు పల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్న సమయంలో ఊరంతా ఒక్క తాటిపై నిలబడి ప్రత్యక్షంగా తిరుగుబాటు ప్రకటించి యుద్ధం చేసిన గ్రామం అది.
 ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలోని మద్దూరు మండలంలో ఉంది.
యువకులు ఒక్కటై ముఖ్యంగా పిల్లల, మహిళలు, పండిన పంటను కాపుడుకోవడానికి, రజాకర్ల దోపిడీకి గురి కాకుండా ఉండడానికి గ్రామరక్షణ దళాన్ని' ఏర్పాటు చేసుకొని చుట్ట పక్కల గ్రామాలను సైతం ఆదుకు న్నారు. పక్కనే ఉన్న లింగాపూర్‌పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతున్న క్రమంలో బైరాన్‌పల్లి గ్రామరక్షక దళం యువకులు ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురు దాడికి దిగారు. అప్పటినుండి చుట్ట పక్కల గ్రామాలు దూల్మిట్ట, కూటిగల్‌, లింగాపూర్‌ ప్రజలు బైరాన్‌పల్లిలోని గ్రామ రక్షక దళాలు బైరాన్‌పల్లిని ముఖ్య కేంద్రంగా చేసుకొని రజాకార్ల ఆగడాలను తిప్పికొట్టసాగారు. కొన్నిసార్లు రజాకార్లు గ్రామాలపై దాడులు చేసి దోచుకున్న సంపదను బైరాన్‌పల్లి గ్రామ రక్షణ, గెరిల్లా దళాలు తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజలకే పంచిపెట్టాయి. ఇలాంటి ఘటనల వలన కక్షగట్టిన రజాకార్లు బైరాన్‌పల్లిని విధ్వంసం చేయాలనే నిర్ణయానికొచ్చారు.
మొదటిసారి 1948లో 60మంది రజాకార్లు తుపాకులతో బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150మంది రజాకార్లు దాడికి పాల్పడి ఓటమి చెందారు. గ్రామరక్షక దళాలు తిప్పికొట్టడంతో 40మంది రజాకార్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఘోరంగా విఫలమై న రజాకార్లు బైరాన్‌పల్లిపై పగ పెంచు కున్నారు. దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్‌ హసీం బైరాన్‌పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించి, నేల కూలుస్తానని సవాలు చేశాడు. రజాకార్లు ఎదో ఒక రోజు గ్రామంపై దాడి చేసే అవకాశం ఉందని భావించి గ్రామస్తులు గ్రామం చుట్టూ గస్తీ చేపట్టి మధ్యలో ఎతైన బురుజును నిర్మించుకొని దానిని రక్షణ కేంద్రంగా మలుచుకు న్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే బురుజు పైన ఉన్న గ్రామ రక్షక దళ సభ్యులు నగారాను మోగించేవారు. కాని 1948 ఆగస్టు 27 ఆ గ్రామా నికి కాళరాత్రి అయింది. ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ఊరు మధ్యలోని బురుజు. రజాకార్లు, పోలీసులు, నిజాం సైన్యం సాయంతో 12వందల మంది దాడికి దిగారు. ఉదయం నాలుగు గంటలకు ఈ వార్తను అందుకున్న గ్రామస్తులు బురుజుపైన ఉన్న నగారా మోగించారు. రజాకార్ల నాయకుడు ఖాసీం నాయకత్వంలోని సైన్యాన్ని గ్రామానికి రక్షణ దళం కాల్పులు జరుపుతూనే తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఈ పోరాటం ఉదయం 4నుండి 8వరకు జరిగింది. కొంత ప్రతిఘటన జరిగిన తరువాత గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికిన వాళ్లను దొరికి నట్లుగా పైశాచికంగా కాల్చి చంపారు. ఒక్కసారి కాల్పుల మోత ఆగిపోయిన తరువాత రజాకార్లు గ్రామంలోకి ప్రవేశించి ఇంటింటికీ తిరిగి 92మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మలను ఆడించారు. ఆ ఒక్క రోజే 118మంది అమాయకులు బలికాగా 25మంది రజాకార్లు చనిపోయినట్లు రికార్డులలో ఉంది. బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్‌ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధతంగా సాగింది. దీంతో నిజాం ప్రభువు దిగివచ్చి భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది.