అందరిని కలుపుకొని పోయే శక్తే సంఘం


ప్రపంచంలో ఏ దేశంలోనైన ఆ దేశంలోని సామాన్య వ్యక్తులు దేశం కోసం వ్యక్తం చేసే సంసిద్ధత ఆ దేశం యొక్క శక్తి. సామాన్య వ్యక్తులలోని వ్యక్తిత్వ వికాసం దేశ భక్తిని నిర్మాణం చేయాలి. అట్లా శిక్షణ పొందిన వ్యక్తుల భాగస్వామ్యం ఆ దేశ వికాసంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంటుంది.
 ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలలో అక్కడి విద్యార్థులకు సైనిక శిక్షణ ఇస్తూ ఉంటారు. మన దేశంలో కూడా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ శిక్షణ ఉన్నది. బ్రిటిష్‌ వాళ్ళు పాలిస్తున్న కాలంలో కూడా స్వదేశి పాఠశాలలు ఉండేవి. అటువంటి ప్రయత్నాలే మన దేశంలో వేలాది సంవత్సరాలుగా నడుస్తున్నది. అలాంటి వాటిలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చేసే ప్రయత్నం విలక్షణమైనది. దేశం, ధర్మం సంస్కృతి సమాజం గురించి ఆలోచించడం వాటిని కాపాడేందుకు పని చేయడం సంఘం యొక్క ప్రత్యేకత. సంఘం ఏమి చేస్తున్నది? అని ఎవరైన ప్రశ్నిస్తే సంఘం చేయలేనిది ఏముంది? సమాజ హితం గురించి ఏ పనులు అవసరం ఉన్నాయే అన్నీ సంఘం చేస్తున్నది. అట్లా చేయడమే కాదు దేశంలో పని చేస్తున్న మంచి వ్యక్తులు, సంస్థలు అందరిని కలుపుకుని దేశం గురించి పని చేయిస్తున్నది,ఆ దిశలో చేస్తున్న వారికి సహకరిస్తున్నది. ఈ మధ్య ''ర్యాలీ ఫర్‌ రివర్స్‌'' పేరుతో ఇశా ఫౌండేషన్‌ వారు జల సంరక్షణ కోరకు దేశ ప్రజలందరితో ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. దానికి సంఘ సహకారం కావాలని ఆ సంస్థ పెద్ద శ్రీ జగ్గి వాసుదేవ్‌ గారు సంఘ పెద్దలను అడిగితే వారికి పూర్తి సహకారం అందించడానికి అంగీకరించారు. ఇట్లా అనేక పనులలో పరస్పర సహకారంతో పని చేస్తున్నాం. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం 1925 విజయదశమి పండుగ రోజున ప్రారంభమైనది.
వచ్చే విజయదశమికి సంఘం ప్రారంభించబడి 92 సంవత్సరాలు పూర్తి చేసుకుని 93సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నది. ఈ 92సం|| కాలఖండంలో సంఘం ఏమి చేసింది? సంఘం సమాజానికి ఒక శక్తివంతమైన నేతృత్వం అందించింది. దేవ దుర్లభÛమైన కార్యకర్తల గణాన్ని నిర్మాణం చేసింది. సంఘం అంటే ఏమిటి? అని ఏవరైనా అడిగితే సంఘం అంటే శాఖ; శాఖ అంటే కార్యక్రమం అని చెప్పేవారము. శాఖ అంటే ప్రతిరోజు వ్యక్తుల కలయిక; శాఖ ద్వారా ఒక జాతీయ వ్యక్తిత్వం నిర్మాణం చేయడం చేస్తున్నాం. సంఘ శాఖ అంటే భవిష్యత్తులో భారతదేశంలో ప్రజలు దేశం గురించి ఎట్లా కలిసి ఆలోచిస్తారు; కలిసి పని చేస్తారు అనే దానికి ఒక నమునా. ఈ రోజున దేశంలో యాభైవేలకు పైగా శాఖలు నడుస్తున్నాయి. అంతేకాకుండా గ్రామం నుంచి అఖిల భారత స్థాయి వరకు ఒక వ్యవస్థను నిర్మాణం చేసింది. దానితో పాటు అన్ని సామాజిక రంగాలలో పనిచేస్తూ అక్కడ కూడా ఒక వ్యవస్థను నిర్మాణం చేస్తున్నది. మొత్తంమీద సంఘం ఒక తిరుగులేని సామాజిక శక్తిని నిర్మాణం చేసింది.
సంఘం ప్రార్థనలో 'పరమవైభవ స్థితి' ఈ దేశంలో సాధిస్తాము అని చెప్పుకున్నాము. అది సాధించాలంటే స్వయం సమృద్ధి అవసరం. అందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలకు కీలకం గ్రామం. గ్రామం యొక్క స్వయం సమృద్ధికి ఏ పనులు ఉపయోగపడుతాయి? పాత, కొత్తల మేలు కలయిక ఎట్లా అని ఆలోచించి అనేక పనులు ప్రారంభించింది. గ్రామ వికాసం, గో సంరక్షణ, గోఆదారిత వ్యవసాయం, వైద్యం మొదలైన అనేక పనులు దేశ వ్యాప్తంగా ఈ రోజు నడుస్తున్నాయి. చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ వస్తున్నది. దేశంలో సామాజిక శక్తిని నిర్మాణం చేయాడానికి కూడా విశేషంగా పనిచేస్తున్నది. సద్భావన, సమరసత, సమాలోచన సాధించడానికి కృషి చేస్తున్నది. పూజ్యనీయ శ్రీ గురుజీ (రెండవ సర సంఘచాలక్‌) శతజయంతి ఉత్సవాల సందర్భంగా దేశంలోని సామాజిక ధార్మిక నాయకత్వాన్ని దేశంలో అన్ని జిల్లాలతో కలిసి ఎట్లా పని చేయాలో ఆలోచించడం జరిగింది. ఈ రోజున దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలో తాలుకా కేంద్రాలలో కుల సంఘాల పెద్దలతో కలిసి కూర్చుని సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నది. ఇది ఒక సఫల ప్రయోగమని పని చేస్తుంటే అందరికీ విశ్వాసం కలుగుతోంది. అట్లాగే హిందూ సమాజంలో అంతర్గతంగా ఉన్న సామాజిక సమస్యలు పరిష్కరించుకోని సమాజంలో ఒక సామరస్య వాతావరణం నిర్మాణం చేయాటానికి ''సమరసత'' వేదిక ఏర్పాటు చేసి దేశం వ్యాప్తంగా పని చేస్తున్నది. ఈ ప్రయత్నం అందరిని ఒక దగ్గరికి చేరుస్తున్నది. సమసరత దేశంలో నిర్మాణం అవుతున్నది. స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి దేశంలో నిర్మాణమైన ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తెరదించేందుకు విశేష కృషి చేస్తున్నాము.ఒకే దేశం; ఒకే ప్రజ, ఒకే ధర్మం భావన నిర్మాణం చేస్తున్నది. ఇటువంటి అనేక ప్రయత్నాల కారణంగా దేశం
జాగృతం అవుతున్నది. అట్లాగే సామాన్య వ్యక్తుల జీవితాలలో వెలుగులు నింపేందుకు కూడా విశేష కృషి చేస్తున్నది. దాని కోసం సేవా భారతి పని చేస్తున్నది. ఈ రోజున దేశ వ్యాప్తంగా ఒకలక్షా యాభై వేలకు పైన సేవా కార్యక్రమాలు నడుస్తున్నా యి.'సేవా భారతి' కాకుండా అనేక సంస్థలు కూడా పని చేస్తున్నాయి. ఉదా. మన ప్రాంతంలో 'పెన్నిధి' సంస్థ గ్రామ యువతకు ఉపాధి కల్పించే పనులలో శిక్షణ ఇస్తూ వాళ్ళ జీవితాలకు ఒక దిశను చూపించే పని చేస్తున్నది, వారు స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. 'ఏకలవ్య పౌండేషన్‌' పేరుతో గిరిజన గ్రామాలలో యువకు లకు ఉపాధి; వ్యవసాయం; జల సంరక్షణ మొదలైన పనులలో శిక్షణ ఇస్తూ వాళ్ళను సమాజంలో కలుపుతూ పనిచేసుకుంటూ వస్తున్నది. ఆ సంస్థ ఆధ్వర్యంలో గో ఆధారిత వ్యవసాయం జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించిది. అందుకు ప్రయోగత్మకంగా కల్వకుర్తిలో పనిని ప్రారంభించి, తాండురులో వంద ఎకరాల భూమిలో ఈ ప్రయోగం చేస్తున్నది. అక్కడే ఒక శిక్షణ కేంద్రం కూడా మొదలు పెట్టారు. విద్యార్థి దశ నుండి ఆరోగ్యవంత మైన జీవితాన్ని అలవాటు చేసేందుకు ''ఆరోగ్య భారతి'' అనే సంస్థ కృషి చేస్తున్నది. విద్యార్థుల కేంద్రంగా మన ప్రాంతంలో జరుగుతున్న ప్రయోగం మంచి ఫలితా లను ఇస్తున్నది. వైద్య విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య భారతి కార్యకర్తలు, విద్యార్థులు కలిసి ఎట్లా పని చేయాలో వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనేక చోట్ల కనబడుతున్నది. సమాజంలో అంగవైకల్యం, మనోవైకల్యం, అంధత్వ నివారణ మొదలైన పనులు కోసం 'సక్షమ్‌' అనే సంస్థ దేశ వ్యాప్తంగా పని చేస్తున్నది. మన దగ్గర కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని పనులు చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ప్రవేశించని రంగం లేదు. సరిహద్దు రక్షణ నుంచి దేశీయ సస్య విధానం రక్షణ వరకు విద్యార్థుల నుండి కుటుంబాల సంరక్షణ వరకు కృషి చేస్తున్నది. ఎవరు ఎన్ని పనులు చేసిన ఎక్కడ ఉన్న సంఘదక్ష అంటే కాళ్లు కలిపి నిలబడటం కూడా నేర్పుతున్నది. ఈ పనులు అన్ని చేసేందుకు కావలసిన వ్యక్తుల నిర్మాణానికి, కార్యకర్తల నిర్మాణానికి మూలం శాఖ. ఆ శాఖలను లక్ష గ్రామాలకు వరకు తీసుకుని పోవాలనే లక్ష్యంగా పని చేసుకుంటూ వస్తున్నది. లక్ష గ్రామలతో పాటు ఆ గ్రామంలోని అన్ని వయస్సుల వాళ్లకు అవసరమైన శిక్షణ ఇచ్చి మంచి కార్యకర్తలుగా నిర్మాణం చేయ టం దేశ హితం కోసం వాళ్లతో పని చేయించడానికి కృషి చేస్తున్నది. ఎక్కడ శాఖ ఉంటే అక్కడ అన్ని పనులు ఉంటాయి. సంఘం చేస్తున్న పనులను కార్యపద్దతిని అధ్యయనం చేయడానికి అనేక దేశాల నుంచి వస్తున్నారు. ఈ మధ్య చైనా బృందం వచ్చి అధ్యయనం చేసింది. దేశంలోని అనేకమంది పెద్దలు సంఘాన్ని అర్థం చేసుకుంటూనే కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. అట్లా సంఘం అందరిని కలుపుకుని వేగంగా ముందుకు పోతున్నది. ఈ పనిని ఇంకా వేగవంతం చేసేందుకు కృషి చేయాలి. సమీప భవిష్యత్తులో దేశం అన్ని రంగాలలో శక్తివంతమై ప్రపంచానికి ఆదర్శ దేశంగా నిలబడాలి.
'సర్వ వ్యాప్తి - సర్వ స్పర్శి' సంఘ లక్ష్యం.