కదన రంగంలో కాళిమహిళలు అబలలే కాదు.. సబలలని నిరూపించిన సంఘటనలు చరిత్ర మన కళ్ళకు కడుతుంది. తెల్ల తోలు ఆంగ్లేయుల అహంకారానికి తలవంచక దాడికి దిగిన ఝాన్సీరాణి మనకు గుర్తొస్తుంది. దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి తెగించినవీర నారీమణుల చరితలు మనకు గర్వకారణంగా నిలుస్తాయి. కిత్తూరు రాణి చెన్నమ్మ.. రాణి గైడునీలు.. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమ దేవి ఇలా ఎందరో వీర వనితలు మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. సామాజిక బాధ్యతలోనే కాదు.. కదన రంగంలో కూడా తామేమి తీసిపోమని భారతీయ మహిళలు నిరూపించుకున్న సంఘటనల్లెన్నో. గణక స్త్రీలుగానే కాదు.. ఆయుధం పట్టి యుద్ధం చేయడంలో కూడా తాము తిరుగులేని వారమని చాటి చెప్పుకున్న చరితలెన్నో. ఆధునిక సమాజంలో కిరణ్‌ బేడి వంటి ఎందరో ఐపీఎస్‌లు సమాజానికి రక్షణ కల్పిస్తున్న విషయం మనకు మహిళా శక్తిని చెప్పకనే చెబుతుంది. పురాణాలైనా.. ప్రస్తుతమైనా.. కన్నతల్లి వలే కాచుకునే సహనం కేవలం స్త్రీకే చెల్లుతుంది.ప్రస్తుతం మన దేశ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది కూడా ఒక మహిళే. ఆమె నిర్మలా సీతారామన్‌. ఇంటి బాధ్యతలను ఎంత ఓర్పుతో చక్కబెట్టగలరో.. అదే నేర్పును దేశ భద్రతలో కనబరచగలమని నిరూపించుకుంటున్నా రామే. అదే బాటలో ఎందరో యువతులు.. మహిళలు దేశ రక్షణకు సైన్యంలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. కేవలం పురుషులే బలవంతులు అనే అభిప్రాయాలకు కళ్ళెం వేస్తున్నారు. శివుడిలో పార్వతి దేవి శక్తి రూపం అయినట్లే.. దేశ భద్రతలో పురుషులతో సమానంగా పోరాడగలమని తమ సత్తాను చాటుకుంటున్నారు. తమకు ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

చెన్నైలో సెప్టెంబర్లో తమ శిక్షణను పూర్తి చేసుకున్న 332 మంది ఆర్మీ మహిళా అధికారులు తమ బాధ్యతలను చేపట్టారు. వారిలో అందరికీ సూార్తిేని కలిగించే విధంగా ఇద్దరు ధీరవనితలు నిలిచారు. దేశం కోసం తమ జీవిత భాగస్వామి తనువు చాలిస్తే.. వారి బాధ్యతలను తమ భుజానా మోసుకున్నారు. బార్డర్లో సైతం శత్రువును చీల్చి చెండాడి.. మాత భూమి రుణం తీర్చకునేందుకు ముందుకు వచ్చారు. వారే స్వాతి మహదీక్‌, నిధి మిశ్రాలు. 2015 సంవత్సరంలో జమ్మూ కశ్మిర్లోని కుప్వారా సెక్టార్లో తీవ్రవాదుల చొరబాటును అడ్డుకునే సమయంలో స్వామి భర్త కల్నల్‌ సంతోష్‌ మహదీక్‌ అమరులయ్యారు. నిధి భర్త 2009లో గుండె పోటుతో మరణించారు. అయితే తమ జీవిత భాగస్వాముల కర్తవ్యలను నెరవేర్చేందుకు ఈ ఇరువురు రక్షణా రంగంలోకి పట్టుదలతో అడుగిడారు.

అంతేకాకుండా భారత ఆర్మీ మహిళా పోలీసులను నియమించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 800ల మందిని ఆర్మీలో నియమించాలని నిర్ణయించింది. నావీ, ఏయిర్‌ ఫోర్స్‌లో ఇప్పటికే అధికారిణి స్థాయిలలో మహిళలు దేశానికి సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు జవాన్లుగా అవకాశం కల్పించేందుకు భారత సైన్యం ముందుకు రావడం భారత నారీ సత్తాను చెప్పకనే చెబుతోంది. మరోసారి శక్తి స్వరూపిణులు దేశ సేవకు అంకితమై.. భరత మాత బిడ్డలను రక్షించేందుకు కదన రంగంలోకి దిగు తుండడం సర్వత్రా హర్షణీయం. ప్రతి స్త్రీ సమాజం పట్ల బాధ్యతగా.. ఆత్మ రక్షణతో పాటు ఇతరుల పరిరక్షణకు ముందుకు వచ్చిన రోజే మహిళలకు నిజమైన స్వాతంత్య్రం లభించనట్లవుతుంది.

- లతా కమలం