న్యాయ వ్యవస్థలను మార్చుకోవాలి, అందరికీ న్యాయం అందించాలి - డా. మోహన్‌ భాగవత్‌


మన ఋషులు చూపిన నీతిశాస్త్ర మార్గం నుండి ఆధునిక చట్ట నిర్మాతలు ఎంతో నేర్చుకోవలసి ఉంది' అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా.మోహన్‌ భాగవత్‌ అన్నారు. భాగ్యనగర్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన అఖిల భారతీయ అధివక్త పరిషత్‌ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
సమాజంలో చట్టాలు చాలా అవసరమే కానీ దానితో పాటు నైతికతను కూడా పెంపొందించు కోవాలని, చట్టం, నైతికత పరస్పర విరుద్ధం కాదని ఆయన అన్నారు.1992లో మొదటసారి శ్రీ దత్తోపంత్‌ తెంగ్డే మార్గదర్శనంలో అధివక్త పరిషద్‌ ఏర్పడిందని, అప్పుడు షాబాను, రామజన్మభూమి అంశాలపై జోరుగా చర్చ సాగుతోందని ఆయన గుర్తుచేశారు. నైతిక విలువలు, భారతీయ తత్వం ఆధారంగా ఏర్పడిన న్యాయవ్యవస్థ అవసరం ఎంతో ఉందని, సాధారణ ప్రజానీకానికి న్యాయవ్యవస్థ పట్ల అవగాహనతో పాటు ఆదర్శవంత మైన ఆచరణ కూడా అవసరమని డా.మోహన్‌ భాగవత్‌ అన్నారు. కార్యక్రమంలో స్వాగత కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, అధివక్త పరిషద్‌ అఖిలభారత కార్యదర్శి భరత్‌ కుమార్‌, జస్టిస్‌ రామాజోయిస్‌, జస్టిస్‌ పర్వత రావు, వినాయక్‌ దీక్షిత్‌, జైదీప్‌, డా.మన్మోహన్‌ వైద్య, చూన్నిలాల్‌ అరోరా, లాల్‌ బహదూర్‌ సింగ్‌, కె.మోహన్‌, డా.లక్ష్మణ్‌, గౌరీష్‌, కిశోర్‌ భాయి కొటక్‌ తదితరులు పాల్గొన్నారు.