సోదరి నివేదిత : ఒక అగ్నిశిఖ


స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు తెలిసినవారు, స్నేహితులు ఎవరు లేరు. చేతిలో తగినంత డబ్బు కూడా లేదు. ఇక ఆయన ఎవరో కూడా అక్కడి వారికి తెలియదు. హిందూధర్మ జ్ఞానం, అనుభవం మాత్రమే ఆయనకు ఉన్నాయి. 1893లో చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూ ధర్మాన్ని గురించి చేసిన ఉపన్యాసం తరువాత ఆయకు గుర్తింపు వచ్చింది. అనేకమంది శిష్యులు, అనుచరులు ఏర్పడ్డారు. ఆ తరువాత ఆయన భారత్‌కు విశ్వవిఖ్యాతి పొందిన స్వామిగా తిరిగివచ్చారు. ఆయనతో పాటు అనేకమంది విదేశీ శిష్యులు కూడా వచ్చారు. ఈ విదేశీ అనుచరులు, పేరుప్రతిష్టలు భారతీయులపై మానసికమైన ఎంతో ప్రభావాన్ని చూపాయి. హిందూ ధర్మపు ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని వాళ్ళు తిరిగి గుర్తించడమేకాక వారిలో స్వాభిమానం కలిగింది. ఇలా స్వామి వివేకానంద హిందూ ధర్మపు గొప్పదనం తెలియజేస్తూ సాగించిన జైత్రయాత్ర సారాంశమే సోదరి నివేదిత. ఒక బ్రిటిష్‌ మహిళ భారతీయ జీవనపు సౌందర్యాన్ని, ప్రత్యేకతను ఎలా చూడగలిగింది? అందుకు ఆమె తనను తాను ఎంతో మార్చుకోవలసి వచ్చింది. వేదాంత సత్యం, సర్వత్ర నిండిఉన్న పరమాత్మను గురించి తెలుసుకున్న తరువాత భారత్‌కు రావాలని, అక్కడ ప్రజలకు సేవ చేయాలని ఆమె నిశ్చయించుకుంది. సన్యాస దీక్ష తీసుకుని 'నివేదిత' (సమర్పింపబడినది)గా మారింది. పేరు మార్చుకున్నంత మాత్రాన అప్పటి వరకు మార్గరేట్‌ నోబుల్‌గా ఏర్పరచుకున్న అభిప్రాయాలూ, భావాలు ఒక్కసారిగా మాయమైపోవు కదా. ఆమెకు ఉన్న ఈ అభిప్రాయాలూ, భావాలను స్వామి వివేకానంద తన మాటల్లో తీవ్రంగా ఖండించేవారు. కొత్త దేశంలో, ఇతరులెవరు తెలియనిచోట స్వామీజీ మాత్రమే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా తన అభిప్రాయాలను తీవ్రంగా తప్పుపడుతుంటే ఆమెకు ఎలా ఉండి ఉంటుంది? అప్పుడు ఆమె ఎంతో తీవ్రమైన భావోద్వేగాలకు గురయ్యేది. అయినా ఒక్కసారి కూడా తాను గురువుగా అంగీకరించిన స్వామి వివేకానందపైన కానీ, తాను నమ్మిన తత్వంపైన కానీ నివేదితకు సందేహం రాలేదు. తిరిగి వెళ్లిపోదామనే ఆలోచన రాలేదు. ''నేను ఎప్పటికైనా నా గురువు చెపుతున్న దానిని అర్ధం చేసుకోగలనా'' అన్నదే ఆమె ఆలోచన. లక్ష్యశుద్ది, అవిశ్రాంతమైన కషి ఆమెను పూర్తిగా మార్చివేశాయి. ఆమె భారతీయ జీవనంలో కలిసిపోయింది. పూర్తి సమర్పణ భావంతో భారతిని సేవించింది. ఎన్ని దోషాలున్నా భారతీయులను ప్రేమించింది. 

సంపూర్ణమైన మార్పు 

భారతీయ ఆత్మ, తత్వాన్ని ఆకళింపు చేసు కునేందుకు నివేదిత తనను తాను మార్చుకున్న తీరు మెకాలే మానస పుత్రులైన భారతీయులకు పెద్ద పాఠం. బ్రిటిష్‌ వారసత్వం పట్ల ఎంతో గర్వాన్ని కలిగి ఉన్న ఒక మహిళ (భారత్‌ గురించి) తన దురభిప్రాయాలను, అపోహలను, పాశ్చాత్య ధోరణిని పూర్తిగా పక్కనపెట్టి భారతీయ సంస్కతి, సమాజాన్ని అర్ధంచేసుకుని, భారత దేశపు భక్తురాలిగా, నిజమైన భారతీయురాలిగా మార గలిగిందంటే, అలా మనం ఎందుకు చేయలేము? 

వివేకానందుని సందేశాన్ని సోదరి నివేదిత ఎంతగా జీర్ణించుకున్నదంటే స్వతంత్య్ర సమర యోధుడు బిపిన్‌ చంద్ర పాల్‌ ఒకసారి ''నివేదిత ఇక్కడకు బోధకురాలిగా రాలేదు, ఒక శిష్యురాలిగా, అన్వేషకురాలిగా వచ్చింది. ఈ భారత దేశాన్ని మనం ప్రేమించినదానికంటే అధికంగా ఆమె ఇష్టపడింది'' అని అన్నారు. 

స్వామి వివేకానందలోని జాజ్వల్యమానమైన ఆదర్శం సోదరి నివేదితకు లభించింది. భారత దేశం పట్ల ఆమెకు గల ప్రేమాభిమానాలు ఎంత తీవ్రమైనవంటే యోగి అరవిందులు ఆమెను 'అగ్నిశిఖ' అని అభివర్ణించారు. జాతీయ జీవనంలో ఆ అగ్ని స్పశించని రంగం లేదు. భారత దేశపు అభ్యున్నతి, భారతీయ ఆత్మను జాగ తం చేయడం అనే రెండు లక్ష్యాలతోనే ఆమె పనిచేసింది. 

భారతీయ మహిళ

భారతీయ మహిళ గుణగణాలు సోదరి నివేదితను ముగ్ధురాలిని చేశాయి. కలకత్తా వీధుల్లో తిరుగుతూ, పనిచేస్తున్నప్పుడు ఆమెకు ఎన్నో విషయాలు తెలిసాయి. వాటి గురించి ఆమె ఇలా అంటారు - ''భారతీయ మహిళకు లభిస్తున్న శిక్షణ ఎలాంటిది? ఎంత ప్రత్యేకమైనది? ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పద్దతి కనిపించదు. భారతీయ జీవనపు గొప్పదనం ఎందులోనైనా ఉన్నదంటే అది ప్రధానంగా సామాజిక వ్యవస్థలో మహిళలకు ఇచ్చిన గొప్ప స్థానంలో ఉంది. భారతీయ మహిళలు అజ్ఞానులు, అణచివేయబడినవారని కొందరు అంటూ ఉంటారు. అలాంటివారందరికి ఒకటే సమాధానం - భారతీయ మహిళ ఎప్పుడు అణచివేతకు గురికాలేదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఘోరాలు ఇక్కడ కంటే మిగతా దేశాలలో చాలా తీవ్రంగా, పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇక మహిళలకు ఇక్కడ లభిస్తున్న సామాజిక గుర్తింపు, సంతోషం, వారి ఉన్నతమైన వ్యక్తిత్వం భారతీయ జీవనపు అత్యంత విలువైన అంశాలు. ఇక ఇక్కడ మహిళలు అజ్ఞానులనే వాదన మరింత అర్ధరహితమైనది. ఆధునికుల దష్టిలో వాళ్ళు అజ్ఞానులు కావచ్చును. ఎందుకంటే వారిలో కొద్దిమందే రాయగలరు, చదవగలరు. అంత మాత్రాన వారిని నిరక్షరకుక్షులు, అజ్ఞానులు అనగలమా? నిజంగానే వాళ్ళు అలాంటివారైతే మన తల్లులు, బామ్మలు తమ పిల్లలకు చెప్పే రామాయణ భారతాలు, పురాణ కధలు సాహిత్యం కాదా? కేవలం యూరోపియన్‌ నవలలు, స్ట్రాండ్‌ పత్రిక మాత్రమే సాహిత్యమా? అలాగని ఎవరైనా అనగలరా? వ్రాయగలగడమే సంస్కతి కాదు. అది సంస్కతిలో ఒక భాగం మాత్రమే. ఈ 'అక్షరాస్యత' యుగం ప్రారంభం కావడానికి చాలాకాలం ముందే గొప్ప సాహిత్యం వచ్చింది. భారతీయ జీవనంలో మహిళల పాత్ర గురించి తెలిసిన ఎవరైనా వారికి ఇళ్ళలో లభించే విద్య, గౌరవం, వారి సున్నితత్వం, శుభ్రత, పొదు పరితనం, మత శిక్షణ, సాంస్కతిక సంస్కారాలు తప్పక గుర్తిస్తారు. ఆ మహిళలు ఒక్క ముక్క చదవలేకపోయిన, రాయలేకపోయినా వారిపై అజ్ఞానులు, అవిద్యావతులు అని విమర్శలు చేస్తున్న వారికంటే చాలా విద్యావంతులే.''

జాతి పునర్‌ నిర్మాణానికి మార్గదర్శి 

సోదరి నివేదిత రచనల్లో భారతీయ వివేకం, సంప్రదాయం కనిపిస్తాయి. భారత్‌ పట్ల ప్రగాఢమైన ప్రేమ, గౌరవం కనిపిస్తాయి. ఇతర జాతులతో పోలుస్తూ హిందూ జాతి సాగించిన యాత్ర, ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని గురించి ఇలా రాసింది-''నిజమైన జాతీయ భావం నింపుకున్న వారు, ఈ జాతి ఎదుర్కొంటున్న సమస్యల గురించి చింతించేవారికి ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేమిటంటే, ఈ జాతి గతంలో ఎప్పుడైనా ఇంత గొప్ప కలలు కన్నదా? ఇంత గొప్ప ఆలోచనలు చేసిందా? ఇంత సౌమ్యంగా, పవిత్రంగా ఉన్నదా? ఎలాంటి తప్పటడుగులు వేయకుండా కొత్త మార్గాలను అన్వేషించిందా? మొదలైన ఇలాంటి ప్రశ్నలన్నిటికి హిందువులు మాత్రమే 'అవును' అని గట్టిగా సమాధానం చెప్పగలరు.'' 

సోదరి నివేదిత 150వ జయంతి సందర్భంగా ఆమె జీవితాన్ని, జీవన కార్యాన్ని అర్ధంచేసుకుందాం. ఆమెలాగానే మనమూ ఈ దేశాన్ని, ప్రజానీకాన్ని ప్రేమిద్దాం. భారతమాత కార్యం చేయడంలో ఆమె జీవితం మనకు స్ఫూర్తిని కలిగించుగాక. 
    - డా. నివేదితా రఘునాథ్‌ భిడే,  వివేకానంద కేంద్ర ఉపాధ్యక్షులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత