కార్తీక పౌర్ణమి


ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనది కార్తీక మాసం. కార్తీక మాసంలో దీపారాధన ప్రధానమైన విషయం కావటానికి శాస్త్రీయమైన ఆధారం ఉంది. కార్తీకంలో చలి పెరుగుతుంది. పగలు కన్నా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని ఈ మార్పులవలన మానవ శరీరంలో 'సెరటోనిక్‌ మరియు మెలనోనిన్‌' ఉత్పత్తి తగ్గుతుంది. దీనివలన భావోద్వేగాల నియంత్రణ వ్యవస్థ మందగిస్తుంది. అందువలన ఆరోగ్యరీత్యా దీపారాధన శ్రేయస్కరమని చెబుతారు. 

కార్తీకమాసంలో పదిహేనవ రోజు చంద్రుడు నిండుగా ఉన్న రోజును సనాతన భారతీయ సంప్రదాయంలో కార్తీక పౌర్ణమిగా జరుపుకొంటారు. కొన్ని ప్రాంతాలలో ''త్రిపురారి పూర్ణిమ'' అని కూడా వ్యవహరిస్తారు. శివుడు త్రిపురాసురులనే రాక్షసులను  సంహరించిన రోజు. కార్తీక మాసం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంగా ఉద్భవించినది కార్తీక పౌర్ణమినాడేనని ప్రతీతి. దేవసేనలకు అధిపతి కార్తికేయుడు (కుమారస్వామి) జన్మించినది కార్తీక పౌర్ణమినాడే. జైనులు వారి మొదటి తీర్దంకురుడైన ''అధినాధుడు'' గుర్తుగా కార్తీక పౌర్ణమి చాలా భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారు. కార్తీక పౌర్ణమినాడు నదీ స్నానం చేసి, దగ్గరలోని ఆలయం లేదా తులసి మొక్క వద్ద దీపం వెలిగించటం ఆనవాయితీ. ఈ రోజు సత్యనారాయణ వ్రతం జరుపుకోవటం చాలా శుభప్రదంగా భావిస్తారు. 

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో పౌర్ణమి రోజు రాత్రి ''కోజాగిర'' ఉత్సవం నిర్వహించుకొంటారు. కార్తీక పౌర్ణమి రాత్రి చంద్రుడు నుండి వచ్చే కిరణాలు పడిన పాలు అమృతంతో సమానమని ప్రతీతి. ఆటలాడిన తరువాత అందరూ ఈ పాలు సేవించి ఆనందం పొందుతారు.