పథకాల గురించి ప్రజలకు వివరించాలి

స్వతంత్రం వచ్చినదగ్గర నుంచి ఎన్నికలలో ప్రలజకు డబ్బులిచ్చి ఓటు వేయించుకోవటం పార్టీలు అలవాటు చేసాయి. ఈ మధ్య సింగరేణి గనుల ఎన్నికలలో సామాన్య ఓటరు నుండి నాయకుల వరకు పుష్కలంగా డబ్బులు పంచినట్లు అందరూ చెప్పుకోగా విన్నాం. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవటానికి డబ్బులు; బహుమతులు విరివిగా పంచిపెట్టారు. అవి  అపార్ట్‌మెంటులో ఉండే వాళ్ళ నుంచి గుడిసెలలో ఉండే వారి వరకు అన్ని తరగతుల వారికి అందినట్లు అర్థమవుతూ ఉండేది. ఎన్నికలలో పంపకాలు మాత్రమే కాదు ప్రభుత్వాల
జనాకర్షక పథకాలు కూడా అనేకం ఉండేవి. మన ప్రాంతంలో తెలుగుదేశం పాలన సమయంలో 2 రూపాయలకు కిలో బియ్యం పథకం చాలా పాపులర్‌. ఆ పథకం ఈ రోజుకీ వేరువేరు రూపాలలో అమలవుతూనే ఉన్నది. అంతేకాదు పాలకులు ప్రజలను వ్యసనాలకు బానిసలను చేసి ప్రభుత్వ ఖజానా నింపుకోవటం కూడా అందరికి తెలిసిన విషయమే. అంటే ప్రజాసామ్య వ్యవస్థలో పాలకులు దేశాన్ని అభివృద్ధి చేసి ప్రజలు స్వాభిమానంతో తమ బ్రతుకు గౌరవంగా బ్రతికేవిధంగా ప్రోత్సహించకుండా ఆకర్షక పథకాలు; డబ్బులు ఇవ్వటం, ఎన్నికల సమయంలో పెద్దపెద్ద ఉద్యోగస్తులు కూడ ఎన్ని పార్టీలు డబ్బులు ఇస్తే అన్నీ తీసుకోవడం చూశాం. ఇలాంటి పరిస్థితి మార్చడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నా , ప్రజల అభిప్రాయాలలో మార్పురావటం లేదు అనేదానికి  తాజా ఉదాహరణ జనధన్‌ యోజన గురించి ప్రపంచ బ్యాంకు సర్వేలలో వెల్లడైన అంశాలు.


జనధన్‌ యోజన ప్రారంభించి ఒక సంవత్సరం  తరువాత 2016 జనవరి - మార్చి మధ్యలో ప్రపంచ బ్యాంక్‌ బృందం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా దేశంలో 12 రాష్ట్రాలో 12 వేల మందిని సర్వే చేశారు. ఆ సర్వేలో అనేక ఆసక్తికర విశేషాలు తెలిశాయి. ప్రభుత్వం నల్లధనానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించింది. విదేశాలలో దాచుకొన్న డబ్బు వివరాలు బయటకు లాగి; ఆ ధనాన్ని వెనక్కి తీసుకొని వస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దానిపైన పత్రికలలో అనేక కథనాలు వచ్చాయి. ఒకవేళ ఆ డబ్బు వెనక్కితెస్తే దేశంలో ప్రజలందరికి పంచిపెడితే ప్రతి వ్యక్తికి కొన్ని లక్షలు వస్తాయని చెప్పారు. ఇటువంటి విషయాలు వినీ వినీ ప్రజలు ఆ డబ్బులు వస్తాయని ఆశగా చూడటం ప్రారంభించారు. చూస్తూ చూస్తూ ఉంటే జనధన్‌యోజన పథకం వచ్చింది. దేశం మొత్తంలో కొన్ని కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఖాతాలలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందని భావించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల లోని 31 % ప్రజలు, బీహారులో 41% ప్రజలు నిధులను ఆశిస్తున్నట్లుగా తేలింది; మహారాష్ట్రలో 25% ప్రజలు భావిస్తున్నారు. 5 వేల రూపాయలు ఓవర్‌డ్రాప్ట్‌ ఇస్తారనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిసింది. జనధన్‌ యోజన కారణంగా ప్రజలకు వివిధ పథకాలలో కేటాయించిన డబ్బు బ్యాంకు ఖాతాలకు వెళ్ళేట్లు చేయాలని భావించారు. కాని జనధన్‌ యోజన ఎందుకు ప్రారంభించారో విషయాలు ప్రక్కకు వెళ్ళి తప్పుడు అంచనాలు ప్రబలినట్లుగా ఈ సర్వే ద్వారా తెలుస్తున్నది; ప్రజలు ఊహించి నట్లు జరగకపోతే ఖాతాలు అట్లాగే ఏ ఉపయోగం లేకుండా ఉండే ప్రమాదం కూడ ఉంది; పైగా ఖాతాలు మూసేసే ప్రమాదం కూడా ఉంది. ఇంకోప్రక్క ఇటువంటి పథకాల కారణంగా కొన్ని రాష్ట్రాలలో తాగుడు తగ్గినట్లు ఈ మధ్య ప్రతికలలో ఒక నివేదిక వచ్చింది. 

మొత్తం మీద ప్రభుత్వం ప్రజలకు మంచిచేయాలని, వారు వ్యసన విముక్తులు కావాలని;  కనీస అవసరాలు తీరే వ్యవస్థ చేయాలని అనేక పథకాలు ప్రారంభించింది. ప్రారంభించటం సులభం కాని ఆ పథకాల ఉపయోగాలు; ఆ పథకాల ఆలోచనలు ప్రజలకు సరియైన అవగాహన కలిగించటం చాలా పెద్ద పని; ఆ పని చేయకుండా అవి అమలు జరుగుతూ ఉంటే అపోహలు; ప్రజలలో అవగాహనారాహిత్యం దోచుకొనే వారికి పెద్దపండుగే. ఈ విషయాలను గమనించి ప్రభుత్వం ప్రజలకు అన్ని విషయాలపై అవగాహన కలిగించే ప్రయత్నం వేగవంతం చేయాలి.