నా తెలివితేటలు, నైపుణ్యం దేశం కోసమే


1900 సంవత్సరం సెప్టెంబర్‌లో లండన్‌లో విద్యుత్‌ తరంగాలు, వాటికి సంబంధిం చిన పరికరాల గురించి జగదీష్‌ చంద్ర బోస్‌ ఉపన్యాసం నిపుణుల ప్రశంస పొందింది. ఆయన ఉపన్యాసానికి ముగ్థులైన విలియం బ్యారెట్‌, ఆలివర్‌ లార్జ్‌ అనే ఇద్దరు బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు లండన్‌ విశ్వవిద్యాలయంలో ఒక అధ్యాపక స్థానం ఖాళీగా ఉందని, అందులో చేరమని బోస్‌ ను ఆహ్వానించారు. కానీ బోస్‌ అందుకు అంగీకరించలేదు. దీని గురించి రవీంద్రనాథ్‌ టాగోర్‌ కు రాసిన ఉత్తరంలో బోస్‌ తాను ఆ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించినది ఇలా వివరించారు - ''నా మనస్సు, జీవితం నా మాతభూమి ఒడి నుండి దూరంకావడం ఇష్టం లేదు. నాదేశ ప్రజల ప్రేమతోనే నాకు స్ఫూర్తి కలుగుతుంది. ఈ బంధనాన్ని కోల్పోతే ఇక నాకు మిగిలేదేముంటుంది ?'' 

అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఒక పరిశోధనశాల ఉండాలని జగదీష్‌ చంద్ర బోస్‌ కలలు కనేవారు. అందుకు తగినట్టుగా 30 నవంబర్‌, 1917లో బోస్‌ పరిశోధనా సంస్థ ప్రారంభించారు. తాను దాచుకున్న డబ్బు మొత్తాన్ని బోస్‌ ఆ పరిశోధనశాలకు ఇచ్చేశారు. తనకు ఎంతగానో సహాయపడిన సోదరి నివేదితకు గుర్తుగా జ్యోతి పట్టుకున్న ఒక స్త్రీ మూర్తి చిత్రాన్ని ప్రయోగశాలలో ఉంచారు.