కాలిఫోర్నియాలో హిందువులకు విజయం

గ్రేడ్‌ కే-6, గ్రేడ్‌ 6-8 స్కూల్‌ పాఠ్య పుస్తకాలలో హిందువులు, భారత దేశం గురించి ముద్రించిన అవాస్తవాలను కొట్టివేయడానికి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాశాఖ అంగీకరించింది. అదే విదంగా అమెరికన్‌ హిందూ సమాజం ఎత్తిచూపిన అన్ని తప్పులను సవరించడానికి సైతం సంసిద్ధత వ్యక్తపరచింది. హాటన్‌ మిప్ల్ఫిన్‌ హర్కోర్ట్‌ పబ్లిషేర్స్‌ ఈ పాఠ్య పుస్తకాలను ముద్రించింది.

అమెరికన్‌ హిందూ సమాజం కలసికట్టుగా ఒక దశాబ్ద కాలం పైగా సాగించిన పోరాటంలో ఇది కీలక విజయంగా భావిస్తున్నారు. ఈ పోరాటం కాలిఫోర్నియా పాఠ్య పుస్తకాలలో భారత దేశం, హిందూత్వం గురించిన దోషాలను చూపి వాస్తవికతను, సాంస్కతిక దృష్టిని తెలియచేయడానికి చేసిన ప్రయత్నమని హిందూ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ పేర్కొంది.


హిందూ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ సంస్థ కు చెందిన శాంతారాం నెక్కర్‌ మాట్లాడుతూ ''ఇది నిజంగా చరిత్రాత్మకమైనది. చాల సంవత్సరాలుగా పౌర సమాజంతో నిరంతరం నిర్ణయాత్మకంగా చర్చలు జరపడం ద్వారా హిందూ అమెరికన్‌ సమాజం తమ వాదనను అందరి ముందు వినిపించగలిగింది.'' అని అన్నారు. హిందూ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ భారతదేశ నాగరకత పట్ల అమెరికాలో వాస్తవిక దృష్టిని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న సంస్థ.

చాలా పుస్తకాల్లో కొంత సానుకూల మార్పు వచ్చినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల అవాస్తవాలు గూడు కట్టుకొని ఉన్నాయి అని అన్నారు. భారత దేశం, హిందూత్వం పట్ల పక్షపాత ధోరణి, ఏక పక్షంగా ఉన్న అవాస్తవాల పట్ల తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

కొన్ని వేల సంఖ్యలోని హిందూ అమెరికన్‌ తల్లితండ్రులు, విద్యార్థులు, స్థానికులే కాకుండా ఫిజి, కరేబియన్‌ దేశాలలో వారు, 75 వివిధ మత సంస్థలు, 17 రాష్ట్రాలలోని ఎన్నుకోబడిన అధికారులు, 38 విద్యావేత్తలు నుండి వచ్చిన లేఖలు, సాక్ష్యాలను పరిశీలించిన తరువాత పాఠ్య పుస్తకాలను సవరించాలని కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాశాఖ స్టేట్‌ బోర్డు అఫ్‌ ఎడ్యుకేషన్‌ నిర్ణయం తీసుకుంది.