హిందుత్వ విలువలను కాపాడుకుందాం - మా.శ్రీ భయ్యాజీ జోషి

హిందుత్వ విలువల ఆధారంగా సంఘ కార్యం సాగుతుంది. హిందూ విలువలు, హిందుత్వ జీవన దృక్పథం ఎవరికి వ్యతిరేకం కావు. అది సమైక్యతను పొంపొందించే శక్తి అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ కార్యవాహ్‌ శ్రీ భయ్యాజీ జోషి అన్నారు. తెలంగాణ ప్రాంత కార్యకర్తల శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిబిరంలో మొత్తం తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన 167 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 
హిందూత్వం వివిధ ఆరాధనా పద్ధతులు కలిగిన వారిని కూడా కలుపుతుంది. దేవాలయానికి వెళ్ళే వారు, వెళ్లనివారు, ఆచారాలను విశ్వసించేవారు, పాటించనివారిని అది సమైక్య పరుస్తుంది. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు మనం ఇది చూడ వచ్చును. మనం హిందువులం అని అంటే సింధు నదికి ఆవల విలసిల్లిన గొప్ప, భావ్యమైన సంస్కతికి వారసులమని అర్ధం. హిందూ విలువలు శాశ్వత మైనవి, విశ్వజనీనమైనవి. మనం ఎప్పుడు 'సర్వేభవంతు సుఖినః' అనే కోరుకున్నాము. ఇలా కోరుకోవడం సంకుచితత్వం ఎలా అవుతుంది?

ఒకే పరమాత్మ వివిధ స్వరూపాలలో మనకు కనిపిస్తున్నాడని మనం భావిస్తాం. ఆయన ఇతర దేశాలలో కనిపించే అవకాశమే లేదని మనం ఎప్పుడు చెప్పాం. 

మన దేశం నుండి ఋషులు, పండితులు ఇతర దేశాలకు వెళ్లారు. కానీ ఏ ఆయుధాలు, సైన్యం తీసుకుని వెళ్లలేదు. జ్ఞానాన్ని పంచడానికి వెళ్లారు. వాళ్ళు మానవతా విలువలను చాటి చెప్పారు తప్ప దురాక్రమణను ప్రోత్సహించలేదు. కానీ సంకుచితమైన ధోరణి కలిగిన శక్తులు, కొన్ని సెమిటిక్‌ మతాలు భారతదేశంపై నిరంతర దాడి చేశాయి. మన శరీరం పంచభూతాల ద్వారా ఏర్పడిందని విశ్వసిస్తాము. కనుక ఆ పంచ భూతాలను మనం ఎంతో గౌరవభావంతో చూస్తాము. ఆ పంచభూతాలతో నిండిన ప్రకతిని ఆరాధిస్తాము. అందుకనే ఇక్కడ మహిళలు తులసి, అశ్వత్థ, రావి మొదలైన చెట్లను పూజిస్తారు. 

మనం నదులను కూడా పూజిస్తాము. హారతులు ఇస్తాము. ఈ పద్ధతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. నేను డర్బన్‌ (దక్షిణాఫ్రికా) లోని డివైన్‌ లైఫ్‌ సొసైటీకి వెళ్ళాను. అక్కడ పెద్ద కొలను చూశాను. అక్కడ వాళ్ళు ఆ కొలనును గంగ అని పిలుస్తారు. పూజిస్తారు, హారతులిస్తారు. నేడు విలువల పతనం కనిపి స్తోందంటే దానికి కారణం స్వార్ధభావన పెరిగిపోవ డమే. దీనివల్లనే చెరువులు, నదులు కలుషితమవు తున్నాయి. అడవులు మటుమాయమవుతున్నాయి. 

ఈ భూమిపై మనిషి బతికి బట్టకట్టలంటే కనీసం 30 శాతం అడవులు ఉండాలి. కానీ ఇప్పుడు 11శాతం మాత్రమే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రాల్లో ప్రభుత్వం, ప్రజలు తీసుకున్న చొరవ మూలంగా అతికొద్ది రోజుల్లోనే 11 కోట్ల మొక్కలను నాటగలిగారు. నదుల సంరక్షణ కోసం జగ్గి వాసుదేవ్‌జీ ఉద్యమం సాగిస్తున్నారు. కనుక మనం కేవలం పూజలకే పరిమితం కాకుండా మన పూర్వజుల విలువలను గౌరవించాలి, అనుసరించాలి. మనది పుణ్యభూమి, మోక్షభూమి అని స్వామి వివేకానంద అన్నారు. ఈ భూమిని రక్షించుకోవాలి. సరిహద్దుల్లో మన సైనికులు ఆ పనే చేస్తున్నారు. వారిని మనం గౌరవించాలి. వారిపట్ల శ్రద్ధ చూపాలి. కానీ కొద్దిమంది సైన్యం గురించి, సైనికుల బలిదానం గురించి తక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని పక్కకు పెట్టి సైన్యం పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి. 

గత కొన్ని నెలల్లో 100 మందికి పైగా తీవ్రవాదులను మన సైన్యం మట్టుపెట్టింది. ఆ తీవ్రవాదులేకనుక దేశంలో ప్రవేశించి ఉంటే ఎంతటి మారనకాండకు పాల్పడేవారో ఊహించవచ్చును. 

మన సరిహద్దు గ్రామాలలో ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రక్షణ కల్పించాలి. 

కొన్ని నెలలుగా మయన్మార్‌ ముస్లిములు జమ్మూకాశ్మీర్‌, హైదారాబాద్‌లలో ప్రవేశించినట్లు తెలుస్తుంది. వారిని మయన్మార్‌ నుండి ఎందుకు తరిమివేశారు? వాళ్ళు అక్కడ బౌద్ధులు, హిందువు లపై దాడిచేసి చంపేశారు. మానవతా దక్పథంతో అలాంటి వారికి కూడా ఆశ్రయం ఇవ్వాలని కొందరు అంటున్నారు. కానీ దేశ భద్రత ప్రధానమైనది. ఆ తరువాతనే ఇక ఏవైనా. నిర్ధారిత, పరిమిత కాలపరిధికి మించి ఏ దేశం విదేశీయులను తమవద్ద ఉంచుకోదు. కానీ మన దేశంలో మాత్రం ఇంతకు ముందు బంగ్లా దేశీయులు, ఇప్పుడు మయన్మార్‌ ముస్లిములు తిష్ట వేసుకుంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్తవహించాలి. 

మనదేశంలో కేరళ, బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో హిందూ విలువలపై దాడులు జరుగు తున్నాయి. కేరళలో గత రెండేళ్లలో 25 మంది సంఘ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. కమ్యూనిస్టులతో సైద్ధాంతికంగా విభేదించేవారికి ఇక జీవించే హక్కు కూడా లేదా? నేడు కేరళలో కనిపిస్తున్న సమస్యలే రేపు తెలంగాణాకు కూడా రావచ్చును. 

బెంగాల్‌లో దేవాలయాలపై దాడులు జరుగు తున్నా, పోలీస్‌ స్టేషన్‌ల నుండి ఆయుధాలు సైతం దోపిడి జరుగుతున్నా ప్రభుత్వంమాత్రం మౌనం వహిస్తోంది. అద్వైష్టా సర్వ భూతానాం, ఈశావాస్య ఇదం సర్వం... అని హిందువు విశ్వసిస్తాడు. అందు వల్ల ఒక కులంలో పుట్టినందుకు కొందరిని అంటరాని వారిగా మనం ఎలా చూడగలం? ఈ తరహా తేడాలను తొలగించడానికి మనం కషి చేయాలి. 

వివిధ కులాల మధ్య అంతరాన్ని పెంచడానికి కొద్దిమంది ప్రయత్నిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా ఆ పని చేస్తున్నారు. ఇలా కుల విభేదాలు, విద్వేషాలను రెచ్చగొట్టే వారిని గుర్తించి ఏకాకులను చేయాలి. 

బలమైన హిందూ సమాజాన్ని నిర్మించడం ద్వారా దేశాన్ని బలోపేతం చేయాలని సంఘ కషిచేస్తోంది. నేడు ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరైనవారంతా ఈ దైవ కార్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాను.

ముగింపు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పురప్రముఖులు, ప్రజలు హాజరయ్యారు. సర్‌ కార్యవాహ మా. శ్రీ భయ్యాజితోపాటు, దక్షిణ మధ్య క్షేత్ర సంఘచాలక్‌ మా. శ్రీ నాగరాజు, ప్రాంత సంఘచాలక్‌ మా. శ్రీ ప్యాటా వేంకటేశ్వర రావు, కరీంనగర్‌ సంఘచాలక్‌ మా.డా.రమణాచార్య వేదికను అలంకరించారు.