జాతీయ శక్తులను బలహీనపరచే లక్ష్యంగా ఎన్నికల పోరాటం

భారత రాజ్యాంగ స్ఫూర్తి తూట్లు పొడుస్తు తమ పబ్బంగడుపుకొనటానికి ఈ దేశంలో రాజకీయ పార్టీలు; అనేక ఇతర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని సవాలు చేయటానికి కూడా వాళ్ళు వెనుకాడరు.  రిజర్వేషనులు ఎవరికి; ఎందుకోసం; ఎంత కాలం అని భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడింది. 
దేశంలో వందల సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి; సామాజిక గౌరవానికి నోచుకోని వర్గాలను ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదిగింపచేయటానికి చేసిన ఒక ప్రత్యేక ప్రయత్నమే రిజర్వేషన్లు. రిజర్వేషన్ల సౌకర్యం మాకు కూడా కావాలని కోరనివారు ఎవరైన ఉన్నారా అంటే బహుశ ఎవరు ఉండరేమో! దేశ రాజకీయాలలో కులము; మతము; రిజర్వేషన్లు,  సెక్యులరిజం మొద లైనవన్ని ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. రిజర్వేషన్ల అంశం రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నదో గుజరాత్‌లోని ఎన్నికల ప్రచారం చూస్తే స్పష్టంగా అర్థవవుతుంది. మెరుగైన జీవన స్థితిగతులున్న పాటీదారులు తమకు రిజర్వేషన్లు కావాలని గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన శాంతి భద్రతలకు కూడా భంగం కలిగించేవరకు సాగింది. ఆ రిజర్వేషన్లు సాధనకు ఏకంగా ఒక రాజకీయక పార్టీనే ఏర్పాటు చేసి ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం అందరికి తెలుసు. తాము ప్రత్యక్షంగా గెలువలేమని తెలుసు కాబట్టి కాంగ్రెసుతో పొత్తుపెట్టుకొని ఎన్నికల రణరంగంలో నిలబడ్డారు. రిజర్వేషన్లు 50% మించకూడదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికి పోటీపడి వాగ్దానాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు చివరకు రాజకీయరంగు పులుముకోవడమేకాక; దోపిడీ చేసే వర్గాలను తయారు చేసేవిగా మారిపోయతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో సొంతకులస్థుల సంఖ్య మరింతగా పెంచుకొని తద్వారా ప్రజలను దోపిడీ చేయాలనేది వారి లక్ష్యం. దోపిడిలో పెద్ద వాటాను సాధించుకొనుటకు రిజర్వేషన్లు డిమాండ్‌ చేస్తున్నారు. దేశ రాజయకీయాలు దేశాభివృద్ధి కంటే దోపిడి కేంద్రీకృత రాజకీయాలుగా నడుస్తున్నాయని అనటంలో అతిశయోక్తిలేదు. ఇంకోపక్క మైనార్టిలు రాజకీయాలను చాలా ప్రభావితంచేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి మైనార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి. మైనార్టీల సంరక్షణకు మేము హామీ ఇస్తామని రాజకీయ నాయకులు పోటీపడీ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. మైనార్టీలు కూడా తెలివితో రాజకీయ పార్టీలకు ప్రభావితం చేస్తారు గాని ఎన్నికలలో ఎక్కువగా పోటీ చేయరు. ఓటు బ్యాంకులుగా పార్టీలకు ఉపయోగపడి పనులు సాధించుకొనడానికి ప్రయత్నిస్తుంటారు. భారతదేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడిందని ప్రచారంచేస్తుంటారు. ఈ మధ్య ఒక కాంగ్రెసు నాయకుడు ఎమర్జెన్సీ సమయంలో దేశంలో ఉన్న పరిస్థితులు ఈ రోజున ఉన్నాయని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించటం సరియైన నిర్ణయమని ఒక వ్యాసం వ్రాసేశారు. మైనార్టీలుగా పిలువబడుతున్న క్రైస్తవులు తమపైన వత్తిడి వస్తున్నదని దేశ విదేశాలలో ప్రచారం చేస్తున్నారు. కేంద్రలో ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన దగ్గరనుండి తమపై దాడులు పెరిగాయని నమ్మించేందుకు వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. మొన్నటికిమొన్న నవంబరు 21వ తేదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఆర్చిబిషప్‌ ఆ రాష్ట్రంలోని క్యాథలిక్‌ చర్చీలన్నింటికి ఒక ఉత్తరం అధికారపూర్వకంగా సొంత సంతకంతో పంపించాడు.ఈసారి గుజరాత్‌ ఎన్నికలలో జాతీయవాద పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నది ఆ ఉత్తరం సారంశం. రాష్ట్రంలో మైనార్టీలు, ఒబిసి, బిసిలు, బీద ప్రజలు అభద్రతతో ఉన్నారు దానికి కారణం జాతీయ శక్తులే కాబట్టి రాష్ట్రంలో అందరిని సమన్వయం చేయగల, రాజ్యంగం పట్ల విశ్వాసం ఉన్న వారిని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. దానిపై ఎన్నికల కమిషన్‌ నోటీస్‌ జారీచేసింది. దేశంలో జాతీయవాద శక్తులు శక్తివంతం కాకూడదన్నది వీరి వ్యూహం. ఈ వ్యూహం గుజరాత్‌ ఎన్నికలకే కాదు. రాబోయే 2019 పార్లమెంటు ఎన్నికలకు కూడ వర్తిస్తుంది. ఏ పరిస్థితిల్లోనూ జాతీయ వాద శక్తులు అధికారంలో ఉండకూడదనే లక్ష్యం సాధించడానికి జాతి వ్యతిరేక శక్తులను ఏకం చేయటానికి కూడా వెనుకాడరు. అదే ఎన్నికల ఎజెండా అయినా ఆశ్చర్యపోయేది ఏమి ఉండదు. దేశ సమగ్రతను కాపాడుకొనుటకు అందరూ ఈ వ్యూహాల గురించి ఆలోచించాలి.