మనం అనే భావనే - రాజ్యాంగ స్ఫూర్తి కావాలి

మన దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనదైన రాజ్యాంగాన్ని 1950 జనవరి నుండి అమలు చేసుకొన్నాము. 1947కి పూర్వం వేల సంవత్సరాల నుండి భారతదేశంలోని రాజ్యవ్యవస్థ కనుమరుగై పాశ్చాత్య దేశాల, ప్రధానంగా ఇంగ్లాండు దేశ ప్రజాసామ్య వ్యవస్థ భారతదేశంలో చోటు చేసుకొన్నది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 
జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు ఎందుకు చేసుకొన్నాము? ఆరోజు విశిష్టత ఏమిటి? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ప్రజాస్వామ్య వ్యవస్థలోనే పాలన సాగిస్తామని, భారత రిపబ్లిక్‌గా అంటే భారత్‌ గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తామని, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని 1930 జనవరి 26న కాంగ్రెస్‌ తీర్మానం చేసింది. 20 సంవత్సరాలు ఆలస్యమైనా ఆరోజునే అంటే జనవరి 26న గణతంత్ర దినోత్సవము ప్రారంభం చేసుకొన్నాము. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఆలోచిద్దాము.

1) వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న రాజ్యవ్యవస్థ దేశంలోని సామాజిక; సాంస్కృతిక; ఆధ్యాత్మిక; ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా ఉండేది. రాజ్యవ్యవస్థ ఎప్పుడైన అదుపుతప్పి వ్యవహరిస్తే సామాజిక వ్యవస్థకు దానిని నియంత్రించే శక్తి      ఉండేది. ఈ వ్యవస్థలకు అన్ని పరిపాలనల్లో ఏదో రూపాలలో భాగస్వామ్యం ఉండేది. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా ఏవైతే మార్పులు రావాలో ఆ మార్పులు రాకపోగా సామాజిక వ్యవస్థ రాజకీయాలతో కలుషితమై పోయింది. ఈ దిశలో మార్పులు రావలసిన అవసరం ఉంది.

2) ఈ దేశంలోని గ్రామాలు వేల సంవత్సరాల నుండి సర్వతంత్ర స్వతంత్రంగా ఉండేవి. గ్రామ పంచాయితీ; న్యాయ పంచాయతీ వ్యవస్థలు ఉండేవి. బ్రిటీష్‌ వాళ్ళు ఆ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసారు. గ్రామం స్వతంత్య్రం కోల్పోయింది. అందుకే మహాత్మగాంధీజీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఇక రావలసినది గ్రామ స్వరాజ్‌ అని చెప్పారు. స్వతంత్ర భారతంలో గ్రామ స్వరాజ్‌ ఒక ఎండమావిగా మారిపోయింది. స్వపరిపాలన వ్యవస్థ వచ్చి 68 సంవత్సరాలు గడిచిపోయినా గ్రామ స్వరాజ్‌ దిశలో జరగవలసిన ప్రయత్నాలు జరగడం లేదు. రాజకీయ కాలుష్యం లేని గ్రామీణ క్షేత్రాన్ని పునరుద్ధరణ చేసేందుకు ఇప్పటి ప్రభుత్వమైనా పూనుకోవాలి.

3) భారత రాజ్యాంగ పీఠికలో వేల సంవత్స రాల మన దేశ చరిత్ర గుర్తుచేసే విధంగా ఉన్నది. రామాయణ కాలం నుండి ఆధునిక కాలం వరకు ఉన్న చారిత్రక సంఘటనలు అందులో జ్ఞాపకం చేశారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని జ్ఞాపకం చేస్తూనే రాజ్యాంగ కమిటి ఈ దేశానికి ఏమి పేరు ఉండాలని తీవ్రంగా చర్చించింది. చివరకు ''ఇండియా''గా ఈ దేశం పేరు పెట్టాలని ప్రయత్నిం చారు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చినతరువాత ఇండియా దట్‌ఈజ్‌ భారత్‌గా మార్చారు. అట్లాగే ఈ దేశపు జాతీయ పతాకం గురించి ఏర్పాటు చేసిన కమిటీ ఈ దేశానికి కాషాయవర్ణం కలిగిన పతాకం, అందులో క్రింది భాగాన నీలి రంగుతో రాట్నం గుర్తు ఉండాలని ప్రతిపాదించింది. కాని దానిని తిరస్కరించి త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా ప్రకటించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఈ దేశానికి జాతీయ భాషగా సంస్కృతం ఉండాలని సూచించారు. అది కూడా అంగీకరించబడలేదు. ఇదంతా జరగటానికి కారణం ఏమై ఉంటుంది. మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా నిర్మాణ మవుతున్నాం అనేదే మౌలిక ప్రేరణగా కనబడుతోంది. బ్రిటీష్‌ వాళ్ళు తమ వలసవాదాన్ని సమర్థించుకొనేందుకు అర్యద్రావిడ సిద్ధాంతం ప్రవేశపెట్టారు. ఆ వలసవాద భేద తంత్రం ఇంకా నడుస్తున్నది. అందుకే ఇది వలసల దేశం; ఇప్పుడిప్పుడే ఒక జాతిగా నిర్మాణ మవుతున్నాము అనే ఆలోచన కనబడుతోంది. దేశ ప్రజలలో విభేదాలు నిర్మాణం కావటానికి అదే దోహదం చేస్తున్నది. వేల సంవత్సరాల నుండి ఇది ఒకే దేశం; ఒకే ప్రజ; ఒకే సంస్కృతి; ఒకే జాతి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఈ దేశం స్థిరత్వం వస్తుంది. ఈ దిశలో ప్రయత్నాలు జరగాలి.

మన రాజ్యాంగంలో 8 మౌలిక అంశాలు మనకు కనబడతాయి. 1) స్వార్వభౌమత్వము 2) ప్రాథమిక హక్కులు 3)ఆదేశిక సూత్రాలు (డైరెక్ట్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ స్టేట్‌ పాలసీ) 4) సోషలిజం 5) సెక్యులరిజం 6) స్వతంత్ర న్యాయవస్థ 7) సమాఖ్యా విధానము అంటే సంయుక్త రాజ్య పద్ధతి 8) క్యాబినెట్‌గవర్నమెంట్‌.

వేల సంవత్సరాల నుండి మనం ఒకే జాతి అనే విషయం అందరికి గుర్తింపుకు వచ్చినప్పుడే మనం అవే భావన బలపడుతుంది. ఈ దిశలో ప్రయాణం సాగినప్పుడు ఈ దేశానికి తిరుగు ఉండదు.