భీష్మ ఏకాదశి

(జనవరి 28 భీష్మ ఏకాదశి సందర్భంగా)
మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే మాఘ శుద్ధ ఏకాదశి సనాతన భారతీయ జీవన పరంపరలో ''భీష్మ ఏకదశి''గా ప్రాచుర్యం పొందింది. అష్ట వసువులలో ఎనిమిదవ వాడైన ''ప్రభాసుడు'' గంగాదేవి, శంతన మహారాజుకు జన్మించి ''దేవ వ్రతుడు''గా నామకరణం చేయబడ్డాడు. తండ్రి కోసం వివాహాన్ని పరిత్యజించి మూడు తరాలపాటు కురు వంశాన్ని రక్షించిన త్యాగధనుడు తండ్రి కోసం త్యాగం చేసిన శ్రీరాముడు, పరశురాముడు, పురూరవుడు మొదలగు వారితో భీష్ముడు నిలుస్తాడు. భీష్ముడి జననం, జీవితం, దేహత్యాగం మానవ జన్మలో ఉన్న వివిధ కోణాలను ఆవిష్కరిస్తుంది.
భీష్ముడు దైవాన్ని, ధర్మాన్ని గమ్యాంగా కలిగినవాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మహాసైన్యాన్ని కౌరవ పక్షంలో నడిపినవాడు. ధర్మసూత్ర అనుష్టానంలో జీవితాన్ని త్యాగం చేసి, ఒక చిన్న పొరపాటు, మమకార బందం వలన జీవితము యొక్క ముగింపు ఎలా ఉంటుందో భావి తరాలకు ప్రబోధించినవాడు.

యుద్ధరంగంలో పదకొండవ రోజు నేల కూలిన తర్వాత స్వచ్చంద మరణం వరంగా కలిగిన వాడు కనుక భీష్మపితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు దేహం త్యజించలేదు. 58 రోజులు అంపశయ్యపై శయనించాడు. యుద్ధం ముగిసిన తర్వాత వ్యాకులతతో ఉన్న ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మపితామహుని వద్దకు తోడ్కొని వెళ్ళాడు. ధర్మరాజు వెంట రెండు వేల మంది పరివారం ఉన్నారు. శ్రీకృష్ణుని ఆదేశంపై పితామహుడు ధర్మరాజుకి రాజధర్మం, సామాన్య ధర్మం, విశేషధర్మం, మోక్ష ధర్మం, అపద్ధర్మం బోధించి అనేక సందేహాలను నివృత్తి చేసాడు. పరమ పావనమైన విష్ణు సహస్ర నామాన్ని కూడా ధర్మరాజుకి బోధించి లోకానికి అందించాడు. భీష్మ పితామహుడు భీష్మాచార్యుడుగా ప్రసిద్ధి గాంచాడు. మహోన్నతమైన విషయాలు ధర్మరాజు ద్వారా లోకానికి భీష్ముడు అందించిన ఈ ఏకాదశి భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. తన యోగశక్తితో ఉశ్వాస, నిశ్వాసాలను ఆపి శ్వాసను బందించి, దృష్టి వాసుదేవుని యందు కేంద్రీకరించి భీష్ముడు దేహాన్ని త్యజించాడు. భారతీయ ఋషి పరంపర ఉన్నంత వరకు భీష్మ పితామహుడి పేరు చిరస్థాయిగా నిలుస్తుంది.