గుజరాత్‌ ఎన్నికలు ఏం చెపుతున్నాయి?

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే జీవనాధారం. వాటిలోసంఖ్యాపరమైన విజయమే రాజ్యాధి కారానికి మార్గం. నైతిక, అనైతిక విజయం అంటూ ఏమి ఉండదు. గెలుపుకు ప్రజాదరణ గల నాయకుడు అతిపెద్ద సభ్యత్వం గల పార్టీ కన్నా సామాన్య ఓటరే కర్త, కర్మ, క్రియ. అతని తుది తీర్పే శిరోధార్యం.
గత నెల (డిసెంబర్‌)లో ముగిసిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు దేశ రాజకీయాలలో 1977, 2014 తరువాత పరిపాలన ఏ దిశలో నడవాలో సూచించినట్టు ఉన్నది. తప్పులను పునరావృతం కాకుండా సజ్జన శక్తిని బలోపేతం చేసి ఆదర్శవంతమైన, వైభవోపేతమైన సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఈ ఎన్నికలను విశ్లేషించుకోవడం అవసరం.

కుల రాజకీయాలు - రిజర్వేషన్లు

స్వాతంత్య్రం నాటి నుండి మొన్నటి గుజరాత్‌ ఎన్నికల వరకు ఏ వర్గమైనా, సమూహమైనా  రిజర్వేషన్‌లు కావాలంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వాటిని సమర్థించడమో లేదా అంగీకరిస్తూనే కాలం దాటవేయడమో జరిగేది. కాని మొదటిసారి ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థానంలో ఉన్న పటేల్‌ వర్గం రిజర్వేషన్‌లు కావాలనే వాదనను, దాన్ని సమర్థిస్తున్న పార్టీని ఓటరు తిరస్కరించడం గత 70 సంవత్సరాల దేశ రాజయకీయ చరిత్రలో పెను సంచలనం. ఇలాంటి పస లేని వాదనలకు కాలం చెల్లింది అని నిరూపించాయి ఈ ఎన్నికల ఫలితాలు.

మత రాజకీయాలు

ఒక ప్రధానపార్టీ అధ్యక్షుడు ఎన్నడూ లేని విధంగా గుజరాత్‌లోని 25 దేవాలయాలను దర్శించడం, ముఖ్యంగా ముస్లిం ఆక్రమణదారుల చేతిలో ద్వంసమై, దోచుకోబడ్డ సోమనాథ దేవాలయానికి వెళ్ళడం అందరినీ ఆశ్చర్యపరచింది. సోమనాధ దేవాలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన నెహ్రూ వారసుడే ఆలయాన్ని దర్శించడం అంటే రాజకీయ పవనాలు ఎటు వీస్తున్నాయో తెలుస్తుంది. లౌకికవాదం నాశనమైపోయిందంటూ 2002 గుజరాత్‌ అల్లర్లను ప్రతీ సందర్భంలో గుర్తుచేసే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఎలక్షన్‌లో ఆమాటే ఎత్తలేదు. ఎందుకు? మసీదులలో టోపి పెట్టుకొని నమాజ్‌ కూడా చేయలేదు. ''ముస్లింలు ప్రమాదంలో ఉన్నారు'' అనే నినాదాలు, ప్రచారం కనిపించలేదు.  జాతీయవాదపార్టీలను ఎన్నుకోవద్దు అని ఒక చర్చ్‌కు చెందిన పాస్టర్‌ విడుదల చేసిన అధికారిక సర్క్యులర్‌ కూడా ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది.

వ్యక్తిగత దూషణలు - పాకిస్తాన్‌ ప్రమేయం

ఒక జాతీయపార్టీ, దానికి చెందిన మాజీ ప్రధాని, సీనియర్‌ కార్యకర్త గుజరాత్‌ ఎలక్షన్‌ల సందర్భంగా పాకిస్తాన్‌ దౌత్య బృందంతో చర్చలు జరపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సీనియర్‌ కార్యకర్త  ప్రధాన మంత్రిని 'అత్యంత నీచమైన వ్యక్తి' అని వ్యక్తిగత దూషణలు చేయడం కూడా ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసింది. సోషల్‌ మీడియాలో పాకిస్తాన్‌ మిలిటరీ అధికారి ఫలానా పార్టీకి చెందిన నాయకుడే గుజరాత్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి అని బాహాటంగా కోరుకోవడం కూడా అనేక సందేహాలకు తావిచ్చింది.

నైతిక విజయం

 ఓడిపాయిన పార్టీదే నైతిక విజయమని, ఆ పార్టీ కొత్త అధ్యక్షుడి  ప్రణాళిక అత్యద్భుతమని  పేపర్‌లలో, టీవిలలో రాగాలు తీయడం  గుజరాత్‌ ఓటర్లను; ఎన్నికలను గమనించిన దేశ ప్రజలను, వారి ఆలోచనలో విధానాన్ని అవమానపరచడమే.

అంతిమంగా ప్రతి ఒక్కరు ఈ ఎన్నికలలో గుర్తించవలసిన అంశం ఏమిటంటే పేదరికం, కూడు, గూడు, గుడ్డ, రోడ్లు, విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు రాజకీయ అంశాలుగా ప్రచారంలోకి రాలేదు. వీటిని సాధించుకున్న  గుజరాతీయులు సామాజిక, ఆర్థిక అంశాలపై దృష్టిపెట్టడం రాజకీయాల్లో పెనుమార్పు. ఇది కచ్చితంగా రాబోయే పరిణామాలకు కీలకం.

నిరుద్యోగం, జిడిపిలో మార్పు, పెద్ద నోట్ల రద్దు ప్రభుత్వ వ్యతిరేకత లాంటివి పాలనాపరమైన అంశాలు మాత్రమేకానీ రాజకీయాలను  దిశా నిర్దేశం చేసేవి సామాన్య ప్రజల సంస్కృతి పట్ల గౌరవం, వారి వ్యక్తిగత సమాజం పట్ల రాజకీయ నాయకుల పార్టీల దృక్పథమేనని తేల్చాయి గుజరాత్‌ ఎన్నికలు.                 
- కుంటి సురేంద్ర