హజ్‌ సబ్సిడీ రద్దుపై అనవసర రాద్ధాంతం


హజ్‌ సబ్సిడీని రద్దుచేస్తున్నట్లుగా NDA ప్రభుత్వం ప్రకటించగానే 'మరి మానససరోవర యాత్ర కోసం హిందూ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీ మాటేమిటి' అని సెక్యులర్‌ మీడియా అడగడం ప్రారంభించింది. కుంభమేళా కోసం 'కుమ్మరిస్తున్న' కోట్ల రూపాయల సొమ్ము సంగతి ఏమిటని అడిగింది. 


ఇక మజ్లిస్‌ ఎ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ నాయకుడు, 'చిన్న జిన్నా'గా పేరుతెచ్చుకోవాలని తాపత్రయపడుతున్న అసదుద్దీన్‌ ఒవైసీ మరో అడుగు ముందుకు వేసి ట్రావన్‌ కోర్‌ దేవస్వోమ్‌ బోర్డ్‌ కు 46.5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కారణమైన అధికరణం 290A మాటేమిటని అడిగాడు.

ఈ మేధావులంతా మొట్టమొదటగా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే వ్యక్తులకు ఇచ్చే సబ్సిడీకి, మతపరమైన కార్యక్రమాలకు ఇచ్చే సబ్సిడీకి తేడా ఉంది. మొదటి రకం సబ్సిడీల వల్ల వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. మరొకటి మొత్తం ఒక వర్గానికి లాభం కలిగిస్తుంది. 

హజ్‌ సబ్సిడీ మొదటిరకానికి చెందినది. ఇస్లాం మతపు పవిత్ర స్థలాలను దర్శించడానికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న ముస్లింలకు ఇచ్చే వ్యక్తిగత సబ్సిడీ ఇది. కనుక చార్ధామ్‌ యాత్ర, మానససరోవర యాత్రలకు కూడా ఇచ్చే ఇలాంటి సబ్సిడీ గురించి ప్రశ్నిస్తే ఫరవాలేదనుకోవచ్చు. అయితే జాగ్రత్తగా  పరిశీలిస్తే చార్ధామ్‌ యాత్ర సబ్సిడీకి, హజ్‌ సబ్సిడీకి తేడా ఉందని కూడా తెలుస్తుంది. అదేమిటో తరువాత చూద్దాం.

ముందు పాలను, నీళ్ళను వేరుచేద్దాం

కుంభమేళా, ఆజ్మీర్‌ షరీఫ్‌ ఉర్స్‌, వెలాంకని ఉత్సవం మొదలైనవాటిలో యాత్రికులకు సబ్సిడీ ఏది ఇవ్వరు. కేవలం ఆయా ఉత్సవాల్లో సదుపాయాలు కలిగించడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు ఖర్చు చేస్తారు. సామాజిక సంస్థలు కూడా భక్తులకు ఉచితంగా ఆహారం, నీళ్ళు అందిస్తాయి. ఇలా కుంభమేళా, ఉర్స్‌లలో ప్రజలందరి కోసం ఏర్పాట్లు చేస్తారు, దానికోసం ఖర్చు చేస్తారు.

అలాగే ఈ రెండు మత ఉత్సవాలు సాంస్కృతి, వ్యాపారపరమైనవి కూడా. ప్రయాగలో 2013లో జరిగిన కుంభమేళా కోసం ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకుంది. ఆలాగే మేళాలో 12,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. స్థానికంగా వసతి సదుపాయాలను మెరుగుపరచడం కోసమే ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. దీనివల్ల పర్యాటక రంగంలో అభివృద్ది సాధ్యపడుతుంది. ఇది మొత్తం రాష్ట్రానికి మేలు చేస్తుంది. అలాగే 2016 మధ్యప్రదేశ్‌లో జరిగిన సింహస్త కుంభలో వ్యాపార సంస్థలు ఊహించని విధంగా వ్యాపారం జరిగింది. ఇక ఇతర మతస్థుల తీర్థయాత్రలకు ఇచ్చే సబ్సిడీల వల్ల నష్టం ఉంది. మనదేశంలో జరిగే తీర్థయాత్రల వల్ల దేశపు ఆర్ధిక వ్యవస్థకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే అక్కడ జరిగే వ్యాపారం, వాటికోసం ప్రభుత్వం చేసే ఖర్చు ఈ దేశంలోనే ఉంటుంది.