ఆయుష్మాన్‌ బడ్జెట్‌


స్వాతంత్య్రానంతరం మన దేశంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ లన్నింటిలో ఈ సంవత్సర కాలానికి 2018, ఫిబ్రవరి 1న  ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంద నటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒక్క సంవత్సరకాలం గడిస్తే సాధారణ ఎన్నికలను ముందుంచుకుని కూడా ప్రజాకర్షక విధానానికి బదులు దేశపు  దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజలకు వాస్తవ అభివృద్ధిపై ఆశలు రేపుతూ ఈ సంవత్సర పద్దుల ప్రణాళికను ప్రజల ముందుంచింది మోడీ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు తరతరాలుగా పాటిస్తూ వచ్చిన జనాకర్షక బడ్జెట్‌కు స్వస్తి చెబుతూ ఆకర్షణకు బదులు ఆచరణకు ప్రాధాన్యతనిచ్చిన ఆర్ధిక పద్దు అని చెప్పుకోవాలి.
దేశపు తక్షణ మరియు దీర్ఘకాల అవసరాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, పరిశ్రమలు మరియు గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట వేస్తూ దేశంలో  పేదరికాన్ని కూకటివేళ్ళతో తీసిపారేసే ప్రయత్నం చేస్తున్నామని ఈ బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సుదీర్ఘకాలంగా దేశ వ్యవసాయం కుంటుపడి అన్న దాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఈ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు ఆత్మహత్యలను  నివారించేందుకు  'రైతుల రెట్టింపు ఆదాయం' పై దృష్టిసారించి ఇప్పటివరకు తమ పని విధానం ద్వార (ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, ఫసల్‌ భీమా యోజన, భూ ఆరోగ్య కార్డులు, మరియు ఇతర ఎన్నో పథకాల అమలు) చెప్పుకోతగ్గ పలితాలను సాధించింది. అయినప్పటికీ రైతుల పరిస్థితి నేటికి ఆందోళన కలిగించేవిధంగానే ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏకంగా పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు తోడు 50 శాతం అదనంగా రైతుకు లాభం చేకూర్చే విధంగా ప్రతి ప్రధాన పంటకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తామని బడ్జెట్లో స్పష్టం చేసింది.  అంతేకాదు ఈ ప్రక్రియ వేగంగానూ, సమర్థవంతంగా జరిగేందుకు నీతి ఆయోగ్‌ నిపుణులు బాధ్యత తీసుకుంటారని పేర్కొంది. రైతులకు సకాలంలో పంట ఋణ సదుపాయం లభించేందుకుగాను ఈ ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయల వితరణను లక్ష్యంగా నిర్దేశించింది. పశువుల పెంపకం, చేపల పెంపకానికిగాను మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిందిగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.

ప్రపంచంలో అత్యధిక యువకులు గల దేశం మనది.  వారికి నాణ్యమైన విద్య, శిక్షణ అవసరం. దీనిని ఉద్దేశించి ఈ బడ్జెట్లో ఉన్నత విద్య మౌళిక వసతుల కోసం 1 లక్ష కోట్ల రూపాయలను కేటాయించి యువకులకు ఉద్యోగ తర్పీదు పొందే అవకాశం కల్పించింది. 

ప్రతి పేద కుటుంబం తమ సంపాదనలో సింహభాగం ఖర్చు చేసేది ఆరోగ్యం పైనే.  ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యంగా భావించి మోడీ ప్రభుత్వం ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల భీమాసౌకర్యం కల్పిస్తూ బడ్జెట్లో పొందు పరచింది. దేశంలో 50 కోట్ల మంది పేదప్రజలకు దీన్ని విస్తృత పరచడంవల్ల ప్రపంచంలో ఎక్కువమందికి  ఆరోగ్య రక్షణ కల్పించిన ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం నిలిచిపోతుంది.

విదేశీ వస్తువులపై దిగుమతి సుంకాన్ని 20 శాతానికి పెంచడంతో దేశ పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించినట్లయింది. దీనితో స్వదేశీ వస్తువుల వాడకం పెరుగుతుంది. ఎప్పుడైతే స్వదేశీ వస్తువుల వాడకం పెరుగుతుందో  అప్పుడు స్వదేశీ వస్తువులకు మంచి గిరాకీ లభించి దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది.  అదేవిధంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహ పరిశ్రమలకు కార్పొరేటు పన్ను తగ్గించి పరిశ్రమలను లాభాల బాట పట్టించే ప్రయత్నం చేసింది బడ్జెట్‌. 

ఈ బడ్జెట్‌ నిక్కచ్చిగా 'సబ్‌ కా సాత్‌ - సబ్‌ కా వికాస్‌' గానే చెప్పుకోవాలి.

- సత్తులింగమూర్తి, JNU, న్యూ ఢిల్లీ