గణతంత్ర వేడుకలలో గట్టిపడ్డ దౌత్యసంబంధాలు


69వ గణతంత్ర దినోత్సవం విశేషంగా జరిగింది. భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ప్రజలను ఉద్దేశించి రామనాథ్‌కోవింద్‌ ప్రసంగించారు. ఈసారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏకంగా పది దేశాల అధినేతలను పిలిచారు. అట్లాగే వేడుకలు వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 61 మంది గిరిజన నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. 
ఈసారి కవాతులో తొలిసారిగా పాల్గొన్న బి.ఎస్‌.ఎఫ్‌ మహిళా విభాగం 'సీమా భవానీ' బృందం మోటారు సైకిళ్ళపై ప్రదర్శించిన విన్యాసాలు వీక్షకులను ఆశ్చర్య చకితులను చేసాయి. ఆసియాన్‌ దేశాల పతాకాలనుకూడా ప్రదర్శించారు. ఆసియాన్‌ దేశాధినేతలు గణతంత్రదినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడమేకాక భారత ప్రధాని; రాష్ట్రపతులతో కలిసి మాట్లాడటం, ఒకప్రక్క మన సైనికసహకారం; మరోప్రక్క  దౌత్యసంబంధాలు పటిష్టం చేసుకోవటం జరిగింది. భారత్‌కు ఆగ్నేయ ఆసియా దేశాలతో సంబంధాలు వ్యూహాత్మకంగా ఒక పెద్ద అడుగు అని పాశ్చాత్య దేశాల నిపుణులు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ చేసిన ప్రసంగంలో సమకాలీన పరిస్థితులను దానికి  దారితీస్తున్న కారణాలను స్పష్టంగా చెప్పారు.  1)ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ అభిప్రయాలు; నిరసనలు వ్యక్తం చేయవచ్చు కాని అవి శృతిమించరాదు; ఎదుటివారి మనోభావాలను గాయపరిచేట్లుగా ఉండకూడదు. పండుగలు; నిరసనలు పొరుగువారికి అసౌకర్యం కలిగించరాదు. 2)అట్లాగే క్రమశిక్షణ నీతి నియమాలతో కూడిన జాతి నిర్మాణము ఆలాంటి లక్షణాలున్న వ్యవస్థలోనే సాధ్యమవుతుంది. ఆ వ్యవస్థ ప్రక్క వ్యవస్థను గౌరవించాలి. క్రమశిక్షణ, ఋజువర్తనలతో మెలుగుతూ పరిధిలకు లోబడి పనిచేస్తున్న వారితో ఆ వ్యవస్థ ఉండాలి. వ్యక్తులకన్న వ్యవస్థ పెద్దది. ఈ వ్యవస్థలన్ని ప్రజలకు ట్రస్టీలుగా ఉండాలని చెప్పారు. 3) భావ ప్రకటన స్వేచ్ఛను పాతరేసే శక్తులు నడివీధులలో వీరంగం చేశాయి. రాజ్యాం గాన్ని ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే శక్తులను నిలవరించి శక్తివంతంగా ప్రజాస్వామ్య శక్తులుగా ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే శక్తులపట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 4) లాభాపేక్ష వదులుకొని భారతదేశపు అత్యున్నత దాతృత్వ సంస్కృతి అలవరచుకోవాలని పిలుపు నిచ్చారు. నిమ్నవర్గాల అభ్యున్నతికి  గట్టి కృషి చేయాలని; పేదరిక నిర్మూలన వేగంగా తక్కువకాలంలో జరిగిపోవాలని ఒక రిపబ్లిక్‌గా ఇది మన కర్తవ్యమని అన్నారు; ఇందుకోసం లాభాలు; అధికారాలు వదులుకొని దాతృత్వ స్ఫూర్తి అవలరచుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటికీ చాలామంది ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారందరికి మన సాయం అవసరమని గుర్తుచేశారు. ఈ రకంగా రాష్ట్రపతి కోవింద్‌ తన తొలి ప్రసంగంలో తన భావాలు వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఏ కాలంలోనైన నిజాయితీ; ధర్మనిష్ట గలిగిన వ్యక్తుల మాటలను ప్రజలు ఆదరిస్తారు; అనుసరిస్తారు. అటువంటి నిజాయితీ; ధర్మనిష్ట ఈ ప్రభుత్వంలో ప్రజలకు కన్పించాలి. గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు దేశ ప్రజలు స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్యాస్‌సబ్బిడి వదులు కోవటం కావచ్చు; పెద్ద నోట్ల రద్దు సమయంలో కావచ్చు ప్రజలు పూర్తి సహకారం అందించారు. ఆ నిజాయితీని కాపాడుకోవటం పాలకుల బాధ్యత. దేశంలో మంచి మార్పు తెచ్చేందుకు రాష్ట్రపతి మాటలు ప్రజలపై ప్రభావం చూపిస్తాయని ఆశిద్దాం.