రాజ్యాంగం, సైన్యం, ఆర్‌ ఎస్‌ ఎస్‌ భారత్‌ ను సురక్షితంగా ఉంచుతున్నాయి - కెటి థామస్‌''భారత్‌ లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే - మొదట రాజ్యాంగం, రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్‌ఎస్‌ఎస్‌వల్ల అని సమాధానం చెపుతాను'' అని జస్టిస్‌ కెటి థామస్‌ అన్నారు. కేరళలోని కొట్టాయంలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రాథమిక శిక్షావర్గ (శిక్షణ కార్యక్రమం) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. జస్టిస్‌ థామస్‌ సుప్రీం కోర్ట్‌ న్యాయమూర్తిగా పనిచేశారు. 

ఆర్‌ ఎస్‌ ఎస్‌ తమ కార్యకర్తలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందిస్తోందని జస్టిస్‌ థామస్‌ ప్రశంసించారు. ''భారత్‌లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే - మొదట రాజ్యాంగం, రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్‌ఎస్‌ఎస్‌ వల్ల అని సమాధానం చెపుతాను. ఇలా చెప్పడానికి కారణం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న వ్యవస్థీకృతమైన, పటిష్టవంతమైన పని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టికి వెళ్లింది. ఎమర్జెన్సీని ఎక్కువకాలం పొడిగించ లేమని ఆమెకి అర్ధమైంది'' అని ఆయన అన్నారు. ''ఎమర్జన్సీ నుండి దేశాన్ని కాపాడిన ఘనత ఆర్‌ ఎస్‌ ఎస్‌ కే దక్కుతుంది'' అని ఆయన స్పష్టం చేశారు.


''హిందూ అనే మాట నిజానికి హిందూస్థాన్‌ లోని సంస్కృతిని చెపుతుంది. ఒకప్పుడు హిందూస్థాన్‌ అనే మాట అందరిలో స్ఫూర్తిని కలిగించేది. కానీ ఇప్పుడు దానిని కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలకే పరిమితం చేస్తున్నారు'' అని జస్టిస్‌ థామస్‌ అన్నారు. 

సెక్యులరిజం గురించి ప్రస్తావించిన ఆయన రాజ్యాంగంలో ఎక్కడ సెక్యులరిజం నిర్వచనం లేదని అన్నారు. ''సెక్యులరిజాన్ని మైనారిటీలు తమకోసం ఉపయోగించుకుంటున్నారు. కానీ దానికి మరింత విస్తృతమైన అర్ధం ఉంది. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడదమే సెక్యులరిజం అవుతుంది. సంకుచిత మైన ప్రయోజనాలు, కార్యకలాపాలకంటే ఇది ముఖ్యం'' అని ఆయన అన్నారు. మతాన్ని పరిరక్షించడం సెక్యులరిజం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.