దేశకార్యం, ధర్మకార్యం ముఖ్యం (స్ఫూర్తి)


ఒక గృహస్థు సమస్యలతో వేగలేక శ్రీరామకృష్ణ పరమ హంస దగ్గరకు వచ్చి ''స్వామీ! నాకు దీక్ష ఇవ్వండి, నేను సన్యాసం స్వీకరిస్తాను'' అని అడిగాడు. అప్పుడు శ్రీ రామ కృష్ణులు ''నాయనా! జీవితమంటే మంచి, చెడుల మధ్య జరిగే సంగ్రామం. సన్యాసి అయినా, గృహస్థు అయినా చేయవలసినది ధర్మయుద్ధమే. సాధించవలసింది చెడుపై విజయమే. సన్యాసి అయినవాడు మైదానంలో శత్రువు మీద బహిరంగ యుద్ధం చేస్తాడు.

అలా చేయడానికి ఎంతో ధైర్యసాహసాలు, బలపరాక్రమాలు కావాలి. అందరూ అలా చేయలేరు. గృహస్థు కోటలో ఉండి శత్రువులతో పోరాడుతాడు. సంసారమే ఆ కోట. రోజులో 16 గంటలు దైవంపైన, సమాజంపైన తప్ప మరొక ఆలోచన లేనివాడే సన్యాసానికి అర్హుడు. అతడు సర్వస్వం సమాజకార్యానికి, దైవకార్యానికి అర్పిస్తాడు. మిగిలినవారంతా గృహస్థులుగా ఉండి అదే సమాజకార్యాన్ని, దైవకార్యాన్ని చేయాలి. దుర్గుణాలపై సమరం సాగించాలి'' అని సమాధానపరచి పంపారు.