కొరేగావ్‌ కథ ఏమిటి?


మహారాష్ట్రలో పూనాకు దగ్గర కొరేగావ్‌ అనేచోట 1818లో బ్రిటిష్‌ వారికి, మరాఠాలకు మధ్య జరిగిన యుద్ధం. ఇలాంటి యుద్ధాలు ఇంకా కొన్ని జరిగాయి. కానీ హఠాత్తుగా కొరేగావ్‌ మాత్రమే వార్తల్లోకి వచ్చింది. చరిత్రలో అంతగా ప్రాధాన్యత లేని ఈ యుద్ధం ఇలా వార్తలకు ఎక్కడానికి కారణం ఏమిటి? దళితులు, బ్రాహ్మణులపై చేసిన యుద్దం చరిత్రలో ఏదైనా ఉందా అని మీడియా చాలాకాలంగా వెతుకుతోంది. 
ఇప్పటి వరకు వారికి అలాంటి యుద్దం ఏది కనిపించలేదు. కొరేగావ్‌ యుద్దం అలాంటిది కాకపోయినా అది అలాంటి పోరాటమేనని చిత్రీకరించేందుకు, ఒక వర్గానికి (దళితులు) అన్యాయం జరిగిందని, మరొక వర్గం (బ్రాహ్మణులు) అందుకు కారణమని ప్రచారం చేసేందుకు అవకాశం మాత్రం లభించింది.

'యువ' నేతలు జిగ్నేశ్‌ మెవాని, రాహుల్‌ గాంధీ వంటి వారు, కొంతవరకు మీడియా వర్గం కుల రాజకీయాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిం చారు. దీనంతటికంటే మించి 'బ్రేకింగ్‌ వార్తల' కోసం ఎల్లప్పుడు అర్రులుచాచే మన మీడియా అగ్నికి ఆజ్యం పోస్తూ మొత్తం సంఘటనను 'దళితులు' 'హిందువు'ల మధ్య ఘర్షణగా చిత్రీకరించింది.  

నిజానికి కొరేగావ్‌ 'దళితులు', 'ఉన్నత కులాల' వారికి మధ్య జరిగిన యుద్దం కాదు. అలాగే బ్రిటిష్‌ వాళ్ళు ఈ యుద్దంలో గెలవనూ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా హిందూత్వం అసమానతలను ప్రోత్స హిస్తుందని చూపేందుకు 'దళిత', 'దళితేతర' వర్గాల మధ్య వైరం ఉందని, ఒక వర్గం అణచి వేతకు గురైనది, మరొకటి అణచివేసినదనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. 

బ్రిటిష్‌ వాళ్ళు దళితులకు ఎప్పుడు అలాంటి పదవులు, స్థానాలు ఇవ్వలేదు. ఒకవేళ బ్రిటిష్‌ సైన్యంలో దళితులు ఉన్నారు కాబట్టి అది దళితుల విజయమని అంటే అప్పుడు రెండు ప్రపంచ యుద్దల్లో విజయం భారతీయులదనే చెప్పాల్సి ఉంటుంది. (ఎందుకంటే బ్రిటిష్‌ సైన్యంలో భారతీయులు ఉన్నారుకాబట్టి). కానీ అలాగని ఎవరు అనరు. ఇక తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు పై తర్కాన్నే మరింత పొడిగించి 1857 ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రాహ్మణులపై దళితులు విజయం సాధించారని కూడా అనవచ్చును. ఎందుకంటే మంగల్‌ పాండే, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, తాత్య తోపే, పీష్వా నానాసాహెబ్‌ మొదలైన బ్రాహ్మణులు నాయకత్వం వహించిన జాతీయ సైన్యాన్ని ముంబై మహర్‌, మఝబి దళిత సిక్కు రెజిమెంట్లు ఉన్న బ్రిటిష్‌ సైన్యం ఓడించింది. కానీ కల్పనకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. 

విజయం మాట అటుంచి బ్రిటిష్‌ సైన్యం పూర్తిగా విఫలమైంది. 1818 జనవరి 1న పీష్వాకు చెందిన రాజధానిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్‌ అధికారులు తమ సేనలను సెరూర్‌ నుండి పూనాకు తరలించాలనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా ఆ సేనాల్ని కొరేగావ్‌ దగ్గర మరాఠా సైన్యం అడ్డగించింది. అపారమైన మరాఠా సైన్యం ముందు బ్రిటిష్‌ సేనలు నిలువలేకపోయాయి. అయినా బ్రిటిష్‌ సైనికులు, అలాగే భారతీయ సిపాయిలు (అందులో దళితులూ ఉన్నారు, దళితేతరులూ ఉన్నారు) ధైర్యంగా మరాఠా సేనల్ని ఎదుర్కొన్నారు. కానీ చాలా ప్రాణనష్టం చవి చూడాల్సి వచ్చింది. దానితో పూనాకు వెళ్లాలనుకున్న వ్యూహాన్ని కట్టిపెట్టిన బ్రిటిష్‌ సైన్యం తిరిగి సెరూర్‌ వైపుకు తోకముడిచింది. 

ఇక కొరేగావ్‌ యుద్దంలో వీరోచితంగా పోరాడిన దళిత సైనికుల పట్ల బ్రిటిష్‌ వాళ్ళు చూపించిన 'కృతజ్ఞత' ఏమిటి? వాళ్ళు 'వీరోచిత జాతి కాదు, నిమ్న అంటరాని కులం' అంటూ 1892లో దళితులను సైన్యంలోకి తీసుకోవడం ఆపేశారు. అంతేకాదు చాలామటుకు గిరిజన, 'అంటరాని కులాల' వారిని 'నేర జాతులు'గా బ్రిటిష్‌ ప్రభుత్వం ముద్ర వేసింది. వీరిలో 'నేరప్రవృత్తి' ఎక్కువని, వాళ్ళంతా నేరస్తులని ప్రకటించి ఆ జాతులపై అమానుషమైన ఆంక్షలు విధించింది. ఈ జాతులకు చెందిన పురుషులు ప్రతివారం పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి హాజరు వేయించుకోవాలని నిబంధన విధించింది. భారత్‌ను పూర్తిగా ఆక్రమించు కున్న వెంటనే బ్రిటిష్‌ వాళ్ళు 'అంటరానివారిని' 'పనికిమాలిన సైనికులు'గా ముద్రవేసి విధుల నుంచి తొలగించారని స్టీఫన్‌ కొహెన్‌ వ్రాశాడు. 'ఉన్నత కులాలకు చెందిన అందమైన వారిని' మాత్రమే సైన్యంలో చేర్చుకునేవారని వ్రాశాడు.  

ఈ విషయాలను ఎవరూ ఇప్పటివరకు కాదనలేదు. పైగా ఈ విషయాలన్నీ బయటకు వస్తే ఉద్రిక్తతలను రెచ్చగొట్టి అల్లర్లు చేయించాలనుకునేవారి ప్రయత్నాలు సాగవు. అందుకే వాటిని బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడుతుంటారు.