హిందువులు లేనిదే ఈ దేశంలో సెక్యులరిజం లేదు - ఖురాన్‌ సొసైటీ కార్యదర్శి

ఈ దేశంలో హిందూ సంప్రదాయం ఉండడం వల్లనే సెక్యులరిజం బతికి ఉన్నదని కేరళ ఖురాన్‌ సున్నత్‌ సొసైటీ ప్రధానకార్యదర్శి జమీదా అన్నారు. కన్నూర్‌ జిల్లాలో జరిగిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్మృతి సభలో పాల్గొన్న జమీదా ఇటువంటి నిజాలను మాట్లాడుతున్నందుకు తనను వామపక్ష, మతఛాందసవాదులు బెదిరిస్తున్నారని కూడా వెల్లడించారు.

''మా ముస్లిం సమాజంలో సంస్కరణలు తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నందువల్ల అనేకమంది నన్ను వ్యతిరేకిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం చేయడంవల్లనే మా ఖురాన్‌ సొసైటీ వ్యవస్థాపకుడిని చంపేశారు. ఆయన్ని హత్యచేసిన దోషులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగు తున్నారు.'' అని జమీదా అన్నారు. తనపై ఇంతకుముందు దాడి జరిగిందని, ఆ దాడి చేసినది కూడా ముస్లిమే కావడంతో లెఫ్ట్‌ ప్రభుత్వంతోపాటు సెక్యులర్‌వాదులమని చెప్పుకునేవారేవరూ మాట్లాడటంలేదని, అదే మరెవరైనా అయితే ఈపాటికి ఎంతో 'ఆందోళన'వ్యక్తం చేసేవారని ఆమె అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కడా మతపరమైన వివక్ష కనిపించలేదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముమ్మారు తలాక్‌ పద్ధతిని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు హర్షణీయమని, దీనివల్ల ముస్లిం మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. హిందువులంతా ఏకమైతే విచ్ఛిన్నకర శక్తులు ఏమీ చేయలేవని జమీదా అన్నారు.