హిందూ ధర్మ పరిరక్షకులు, సమాజ పరివర్తకులు జయేంద్ర సరస్వతి స్వామి

సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారం కోసం, సామాజిక వ్యవస్థల ఉద్ధరణ కోసం ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాలతో పాటు కంచి మఠం కూడా ఆ అపూర్వమైన కార్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చింది. ఎన్నో విపత్కర, వ్యతిరేక పరిస్థితులను కూడా ఎదుర్కొంది. మఠాలు కొద్దిమంది సన్యాసులకు ఆశ్రయం కల్పించే కేంద్రాలని, మఠాధిపతులకు సాధారణ సమాజంతో సంబంధం లేదని, వాళ్ళు తమ మఠాలను వదిలి బయటకురారని, ప్రజల కష్టనష్టాల్లో పాలుపంచు కోరని... ఇలా అనేకానేక ఆరోపణలు, అసత్య ప్రచారాలు సాగాయి. 
ఇలాంటి ఆరోపణలు, ప్రచారాల వెనుక ఆయా మఠాల లక్ష్యాలు, పనితీరు గురించి తెలియకపోవడం కొంతైతే, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న శక్తులు చేసిన ప్రయత్నం మరికొంత. కాలానుగుణంగా ధర్మ శాస్త్రాలను వ్యాఖ్యానించడం, వాటిని మారిన కాలంలో ఎలా అనుసరించాలో వివరించడం ధర్మాచార్యులు చేసే పని. దీనిని అందరు ధర్మా చార్యులు నిర్వర్తిస్తూనే వచ్చారు. అందుకనే హిందూసమాజం ఎన్నో దాడులు, ఆటుపోటులను తట్టుకుని నేటికీ సజీవంగా నిలబడగలిగింది. అలా హిందూ సమాజానికేకాక, యావత్‌ ప్రపంచానికి ధార్మిక మార్గదర్శనం చేసిన మహాపురుషుల్లో ఒకరు శ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి.

తమిళనాడు తిరువారూర్‌ జిల్లాలోని ఇరుల్‌నేకి గ్రామంలో 1935 జూలై, 18న జన్మించిన జయేంద్రుల పూర్వనామం సుబ్రమణ్యం. ఆయన 1954 నుంచి కంచిపీఠపు 69వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

కంచిపీఠాధిపతిగా ఉన్నంతకాలం జయేంద్ర సరస్వతి స్వామి హిందూధర్మ ప్రచారంతోపాటు ఆ ధర్మప్రచారానికి ఆధారమైన హిందూసమాజపు బాగోగుల గురించి కూడా తీవ్రంగా ఆలోచించారు. హిందూ సమాజం అంతర్గతంగా, బాహ్యంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. హిందూసమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మతమార్పిడులు. వీటివల్ల హిందువులు సాంస్కృతికంగా, జనాభాపరంగా ఎంతో నష్టపోయారు, పోతున్నారు. ఈ మత మార్పిడులను అరికట్టేందుకు జయేంద్ర సరస్వతి స్వామి పోప్‌ ప్రతినిధి అయిన కార్డినల్‌ జీన్‌ లూయిస్‌ పియర్‌తో 2009 జూన్‌,12న చర్చలు జరిపారు. ఇలా క్రైస్తవ ప్రతినిధులతో మతమార్పిడుల విషయమై చర్చించిన మొదటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారే. జెరూసెలెంలో యూదు ప్రతినిధులతో జరిపిన చర్చలలో తాము ఇకమీదట యూదులను మతంమార్చబోమని హామీ ఇచ్చినట్లే హిందువులను కూడా మతంమార్చమని హామీ ఇవ్వాలని ఆయన క్రైస్తవప్రతినిధులను కోరారు. అలాగే ఆసియాను క్రైస్తవమయం చేయడమే తమ లక్ష్యమని పోప్‌ ప్రకటించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ పేరుతో వివిధ దేశాలలో మతస్వేచ్ఛ గురించి నివేదికలు వెలువరిస్తూ అమెరికా ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని కూడా స్వామి ప్రశ్నించారు. అలాగే చర్చ్‌లకు పెద్దఎత్తున వస్తున్న విదేశీ నిధుల విషయాన్ని కూడా ఆయన చర్చల్లో ప్రస్తావించారు. వీటిని మతమార్పిడులకు ఉపయోగించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.  హిందూ ధర్మానికి, సంప్రదాయాలకు చెందిన ఆచారాలు, మత చిహ్నాలు, పద్ధతులను క్రైస్తవ మిషనరీలు సొంతం చేసుకుని వాటి ద్వారా మతప్రచారం చేయడాన్ని ప్రశ్నించారు. ఇలా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు, విషయాలపట్ల క్రైస్తవ మిషనరీలు వివరణ ఇచ్చారు.  హిందూసమాజంలో కూడా ఈ విషయాలపట్ల అవగాహన కలిగాయి.

రామజన్మభూమి సమస్య పరిష్కారానికి కూడా జయేంద్రసరస్వతి స్వామి ప్రయత్నించారు. ముస్లింవర్గంతో ఆయన ప్రారంభించిన చర్చలు రామమందిర నిర్మాణానికి ముస్లిములలో అనుకూల మైన వైఖరి ఏర్పడటానికి దోహదం చేశాయి.

హిందూసమాజంలో బడుగు, బలహీన వర్గాలకు చేయూతనందించేందుకు ఆయన మార్గదర్శనంలో కంచిపీఠం అనేక సేవాకార్యక్ర మాలు ప్రారంభించింది. వందలాది పాఠశాలలు, ఆసుపత్రులు ప్రారంభమయ్యాయి. వేదాధ్యయనాన్ని ప్రోత్సహించడానికి వేదపాఠశాలలు వెలిశాయి. గోసంరక్షణ కోసం గోశాలలు ఏర్పాటయ్యాయి. ఇలా హిందూసమాజ ఉన్నతికోసం కృషి చేసిన జయేంద్ర సరస్వతి స్వామిపై హత్యారోపణలు మోపి ఆయన చేస్తున్న కార్యాన్నేకాక, పీఠాధిపతుల పట్ల యావత్‌ సమాజంలోనూ, ప్రపంచంలోనూ చెడ్డపేరు తేవడానికి కొన్నిశక్తులు ప్రయత్నించాయి. కానీ ఆ ఆరోపణలన్ని పూర్తి అసత్యాలని తరువాత తేలింది. ఇలా ధర్మాచార్యునిగా తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించిన జయేంద్ర సరస్వతి స్వామి మార్చ్‌ 1న శివసాయుజ్యం పొందారు.