ఆర్‌.ఎస్‌.ఎస్‌., సైన్యం మధ్య ఉన్నది పరస్పర విశ్వాసమే ..

అవసరమైనప్పుడు, రాజ్యాంగం అనుమతిస్తే  సైన్యం ఎవరికైనా సైనిక శిక్షణ ఇవ్వవచ్చని, అయితే సాధారణ ప్రజానీకం కంటే క్రమశిక్షణాయుతమైన నిత్య కార్యక్రమాలలో పాల్గొనే స్వయంసేవకులకు శిక్షణ ఇవ్వడం సులభమని ఇటీవల ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ సంఘచాలక్‌ అన్న మాటలను పలువురు వక్రీకరించి పెడర్ధాలు తీశారు. ఇంతకీ సంఘ్‌కి, సైన్యానికి ఉన్న సంబంధం ఏమిటి?

జాతీయ విపత్తు వచ్చినప్పుడు సహాయ పడేందుకు సంఘం ఎప్పుడు సంసిద్దంగా ఉంటుందనే భాగవత్‌ జీ చెప్పిన విషయాన్ని ఋజువుచేసే సమాచారం చాలానే ఉంది. 1948లో కాశ్మీర్‌పై పాకిస్తాన్‌ దాడి చేసినప్పుడు చాలామంది ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలకు సైన్యం శిక్షణ ఇచ్చింది. వారిని చాలా త్వరితంగా విధులకు సిద్దం చేసింది. అలాగే 1962 యుద్ద సమయంలో స్వయంసేవకులు పౌర, సైనిక విధులను నిర్వర్తించారు. అప్పుడు స్వయంసేవకుల అద్భుతమైన పని చూసిన జవాహర్‌ లాల్‌ నెహ్రూ సంఘ్‌ పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకుని 1963 రిపబ్లిక్‌ దినోత్సవంలో పాల్గొనాల్సిందిగా స్వయంసేవకులను ఆహ్వానించారు. 

అలాగే 1965లో 22 రోజులపాటు జరిగిన భారత-పాకిస్తాన్‌ యుద్దంలో కూడా స్వయం సేవకులు అమోఘమైన పద్దతిలో విధులు నిర్వహించారు. దేశ రాజధానిలో నీరు, విద్యుత్‌ సరఫరా, ట్రాఫిక్‌ నియంత్రణ మొదలైన పనులతో పాటు సైన్యానికి సహాయం అందించారు. సంఘ స్వయంసేవకులు, సైన్యం మధ్య పరస్పర విశ్వాసం, గౌరవం కనిపిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో పని చేసినప్పుడు, ప్రకతి వైపరీత్యాల సమయంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్వయంసేవకులు పనిచేసిన తీరు సైన్యానికి తెలుసు. అన్నింటికంటే మించి మానవహక్కుల పేరుతో బూటకపు సెక్యులరిస్టులు సైన్యంపై చేసే దుష్ప్రచారాన్ని, ఆరోపణలను ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఎప్పుడు వ్యతిరేకించడమే కాక సైన్యానికి మద్దతుగా నిలిచింది. 

సచార్‌ కమిటీ సిఫార్సులను అనుసరించి సైన్యంలో మతప్రాతిపదికన సంఖ్యా వివరాలు సేకరించాలన్న ప్రయత్నాన్ని సమర్ధించడం ఈ బూటకపు సెక్యులరిస్టులు సైన్యంపై సాగించిన అతిపెద్ద దాడి అని చెప్పవచ్చును. ఈ విషయంలో సచార్‌ కమిటీ సభ్య - కార్యదర్శి అబూసలే షరీఫ్‌కు మేజర్‌ కె.పి.డి. శర్మ ఇచ్చిన సమాధానం చక్కగా ఉంది. అందులో శర్మ ''భారతీయ సైన్యానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో అన్నీ కులాలు, మతాలకు చెందినవాళ్లు ఉన్నారు. దేశం మొత్తం నుంచి, అన్ని వర్గాల నుంచి సైనికులు ఉన్నారు. ఇది ఎంతో గర్వించదగిన, ప్రత్యేకమైన విషయం. ఇలా కులం, మతం, జాతి భేదాలు ఏవి లేకుండా సైనికులంతా ఒక్కటిగా, సోదరభావంతో మెలగడం, పనిచేయడమే అతి ముఖ్యమైన విషయం'' అని అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు ''కనుక కులం, మతం ఆధారంగా సైన్యంలో ఎలాంటి వివరాలు ఉండవు. ఇప్పుడు అలాంటి వివరాలు సేకరించాలనుకోవడం మంచిది కాదు''.  సచార్‌ కమిటీని సైన్యం తిరస్కరించడాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌., బి.జె.పి. పూర్తిగా సమర్ధించాయి. 

మాతభూమి కోసం అత్యున్నతమైన త్యాగానికి కూడా ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలని భాగవత్‌ జీ చెప్పడం కొత్తేమీకాదు. అలాగే ప్రపంచంలో అనేకమంది నాయకులు తమ కార్యకర్తలకు బోధించారు. 1860 నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ 40 వేల మంది కార్యకర్తలకు కనీసం మూడేళ్లపాటు సైన్యంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముజఫర్‌ నగర్‌లో భాగవత్‌ జీ అదే పని చేశారు. 'అవసరమైతే మేమున్నాం' అని హామీ ఇచ్చారు. 

స్వయంసేవక్‌ బలిదానం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని రాయిగంజ్‌ జిల్లా అప్పటి తూర్పు పాకిస్తాన్‌ (నేటి బంగ్లాదేశ్‌) సరిహద్దు ప్రాంతం. 1971 లో భారత్‌ పాకిస్తాన్‌ యుద్ధం ప్రారంభ సమయంలో శత్రు సైన్యాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని రావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని సరిహద్దులో చక్రం గ్రామంలో ఉండే చుర్ఖా ముర్ము అనే 9వ తరగతి చదువుతున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. శాఖ ముఖ్యశిక్షక్‌ గుర్తించాడు. శత్రువుల కదలికలను దగ్గరలో ఉన్న బిఎస్‌ఎఫ్‌ స్థావరానికి  తెలియచేసాడు.

దానితో అప్రమత్తమైన బిఎస్‌ఎఫ్‌ జవాన్లు కొంత మందుగుండు సామగ్రిని  తాము వచ్చే లోపే సరిహద్దుకు చేర్చమని కోరడంతో  చుర్ఖా ముర్ము దాన్ని స్వయంగా అక్కడికి మోసుకెళ్ళి శత్రువులతో పోరాటం చేస్తూనే వీర మరణం పొందాడు.

స్వయంసేవక్‌ బలిదానానికి గుర్తుగా చక్రం గ్రామంలో ఒక స్మారక చిహ్నాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది.

- రాకేశ్‌ సిన్హా