సైనికుల పిల్లల విద్యకు సంపూర్ణ ఆర్థిక సాయం ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం

సాయుధ దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గట్టి అండగా నిలుస్తోంది. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన, దివ్యాంగులుగా మారిన సాయుధ దళాల సిబ్బంది పిల్లల చదువులకు సంపూర్ణ ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు గరిష్ఠంగా నెలకు రూ.10,000 వరకు మాత్రమే సాయం అందజేస్తోంది.

ఈ పరిమితిని తొలగిస్తూ గురువారం ఓ నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. విద్యా రాయితీ అనే ఈ పరిమితిని తొలగించినట్లు పేర్కొంది. సాయుధ దళాల్లో ఆఫీసర్‌ ర్యాంకు కన్నా తక్కువ స్థాయి అధికారులు అదృశ్యమైనపుడు, వికలాంగులైనపుడు, ప్రాణ త్యాగం చేసినపుడు వారి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది.

ప్రస్తుతం ఇటువంటి  పిల్లలు దాదాపు 3,400 మంది ఉన్నారు, వీరి కోసం సంవత్సరానికి రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివేవారికి ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివేవారికి, మిలిటరీ, సైనిక్‌ స్కూళ్ళలో చదివేవారికి కూడా వర్తిస్తుంది.