దేశమంతటా గోజప మహాయజ్ఞం


'గావో విశ్వస్య మాతరః'....ఆవు అఖిల ప్రపంచానికి తల్లి. 'అమ్మ' అనే మధురానుభూతికి పర్యాయమే 'గోమాత'. భారతీయ సంస్కృతి గోసంస్కృతి. గోమాత నివాసమున్న ఇల్లు, పాఠశాల, కార్యాలయం, వ్యవసాయక్షేత్రం, గ్రామం, దేశంలోని ఏ ప్రదేశమైనా సుభిక్షంగా, శుభంగా, శాంతి యుతంగా ఉంటుంది.

మూపురం, గంగడోలు ఉన్న దేశవాళీ ఆవు ఎంతో పవిత్రమైనది. జీవకోటి మనుగడకు, పాడిపంటలకు, పర్యావరణ సంరక్షణకు, ఇంధనశక్తి ఉత్పాదనకు ఆధారం ఈ ఆవు.

'ఒక ఆవు వల్ల 1980మందికి పుష్కలంగా పాలు అందుతాయి. కానీ ఒక ఆవును చంపితే కేవలం 80మందికి మాత్రమే మాంసం లభిస్తుంది. కనుక కొందరి కోసం ఎంతో మందికి మేలు చేసే ఆవుల్ని చంపడం ఎంతో ఘోరం,పాపం' అని స్వామీ దయానంద సరస్వతి అన్నారు.

'ఆవును సేవించేవారికి అతిదుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలను తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది'అని మహాభారతం అనుశాసనపర్వం చెపుతోంది.

ఇలాంటి గోవును సంరక్షించడానికి గోవధనిషేధ చట్టం తేవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ దేశవ్యాప్తంగా గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. 1952లో ఇలాంటి చట్టం తేవాలంటూ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రెండుకోట్లమంది ప్రజల సంతకాలను సేకరించి రాష్ట్రపతికి అందజేశారు.ఆ తరువాత చాలా రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలు వచ్చాయి. కేరళ, పశ్చిమబెంగాల్‌, ఈశాన్యరాష్ట్రాలు తప్పించి మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు వచ్చినా, వాటి అమలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.

గో మహత్యాన్ని అందరికీ వివరించడానికి, తెలియజేయడానికి గోసేవా విభాగం దేశమంతటా గోజప మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించింది. గోవు గొప్పదనాన్ని చెప్పడంతోపాటు గో ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమ ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమం హనుమత్‌జయంతి రోజున సామూహిక సంకల్పంతో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది గోసంరక్షణ కోసం గోజప యజ్ఞ సంకల్పాన్ని స్వీకరించారు. 15 రోజుల పాటు సామూహికంగా లేదా వ్యక్తిగతంగా ప్రతిరోజూ 'శ్రీసురభ్యై నమః' అనే మంత్రాన్ని 864సార్లు జపం చేసే కార్యక్రమం జరిగింది. ఇందులో కూడా లక్షలాదిమంది గోభక్తులు పాల్గొన్నారు.