భారతీయ భాషలను పరిరక్షించుకోవాలిరాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానం

భాష ఒక సంస్కృతి, వ్యక్తి, సమాజపు అస్తిత్వానికి, భావ వ్యక్తీకరణకు ప్రధాన వాహకమని అఖిలభారతీయ ప్రతినిధి సభ భావిస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాలు, అద్భుతమైన జ్ఞాన సంపద, అపారమైన సాహిత్యాన్ని పరిరక్షించుకోవడంలో, అలాగే సృజనాత్మక ఆలోచనను పెంపొందించడంలో దేశంలోని వివిధ భాషలు, మాండలీకాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనదేశంలో వివిధ భాషలలోని పాటలు, సామెతలు, గిరిజన గీతాలు మొదలైన మౌఖిక జ్ఞాన సంపద లిఖితపూర్వక సాహిత్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

కానీ భారతీయ భాషలను ఉపయోగించడం క్రమంగా తగ్గిపోవడం, అనేక పదాల స్థానంలో విదేశీ భాషా పదాలు వచ్చి చేరడం వంటివి ప్రమాదకరమైన సవాళ్ళుగా మారుతున్నాయి. నేడు అనేక భాషలు, మాండలీకాలు కనుమరుగయ్యాయి, మరికొన్ని అవసానదశలో ఉన్నాయి. కనుక దేశంలోని వివిధ భాషలు, మాండలీకాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు, సమాజం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని అఖిలభారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. ఈ విషయంలో క్రింది చర్యలు తీసుకుంటే బాగుంటుంది-

1. ప్రాథమిక విద్య మాతృభాష లేదా ఏదైనా భారతీయ భాషలోనే బోధింపబడాలి. దీనికోసం విద్యార్థుల తల్లిదండ్రులు మానసికంగా సిద్ధమవ్వాలి, అలాగే ప్రభుత్వాలు కూడా అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలి .

2. సాంకేతిక మరియు వైద్య విద్యతో సహా అన్ని రకాల విద్యలకు భారతీయ భాషలలొ ఉన్నతవిద్యాబోధన, వాచకాలు, పరీక్ష మాధ్యమాలు అందుబాటులో ఉండాలి.

3. యు.పి.ఎస్‌.సి. నిర్వహించే నీట్‌ పరీక్షను అన్ని భారతీయ భాషలలోనూ వ్రాసేందుకు వీలుకల్పించడం స్వాగతించదగ్గ పరిణామం. ఇలాగే మిగిలిన అన్ని పరీక్షలను కూడా ఇదే విధంగా భారతీయ భాషలన్నింటిలోనూ వ్రాసే ఏర్పాటు చెయ్యాలి.

4. అన్ని ప్రభుత్వ, న్యాయ సంబంధ వ్యవహారాల్లో భారతీయ భాషలకి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనితోపాటు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యకలాపాలలో ఆంగ్లానికి బదులు భారతీయ భాషల వాడకానికే ప్రాధాన్యతనివ్వాలి.

5. స్వయంసేవకులతో సహా సమస్త ప్రజానీకం తమ మాతృభాషకి ప్రాధాన్యత ఇవ్వాలి. మాతృభాష లోనే దైనందిన వ్యవహారాలు, సంభాషణలు జరిగేటట్లు శ్రద్ధ వహించాలి. ఈ భాషలలో సాహిత్యాన్ని సేకరించడం, చదవడం అలవరుచు కోవాలి. అలాగే స్థానిక కళలు, సంగీతం వంటి వాటిని ప్రోత్సహించాలి.

6. పరంపరాగతంగా మనదేశంలో భాష అనేది సమస్త సమాజాన్ని కలిపి ఉంచే బంధం కనుక తమ మాతృభాష పట్ల అభిమానాన్ని కలిగిఉంటూనే ఇతరభాషల పట్ల గౌరవం కలిగి ఉండాలి.

7. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని అన్ని భాషలు, మాండలీకాలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలి.

అఖిలభారతీయ ప్రతినిధి సభ, జ్ఞాన సముపార్జన కోసం ప్రపంచంలోని అన్ని భాషలను నేర్చుకోవడంలో తప్పులేదని భావిస్తోంది. అయితే బహుభాషా దేశమైన భారత్‌లో, సంస్కృతి వాహకమైన భాషలను కాపాడడం, ప్రోత్సహించడం నేటి అవశ్యకతగా అఖిలభారతీయ ప్రతినిధి సభ గుర్తిస్తోంది. అందుకోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, ప్రసారమాధ్యమాలు, విద్యా సంస్థలు, మేధావులు భారతీయ భాషల వాడకం ద్వారా వాటి ఉద్ధరణకి కృషి చేయాలని పిలుపునిస్తోంది.