తెలుగు రాష్ట్రాలలో సంఘ కార్యం


అఖిలభారతీయ ప్రతినిధి సభలో నివేదిక

తెలంగాణాలో శాఖలు

గత 8 సంవత్సరాలలో తెలంగాణాలో శాఖలు 1000కి పైగా పెరిగాయి. ప్రస్తుతం 1608 ప్రదేశాలలో 2412 శాఖలు జరుగుతున్నాయి. అదే 2017లో 1495 ప్రదేశాలలో 2302 శాఖలు ఉండేవి.

తెలంగాణ :
విజయదశమి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రయత్నం - ప్రతి సంవత్సరం భాగ్యనగర్‌ మహానగర్‌లో జిల్లా వారీగా పథసంచలన్‌ (రూట్‌ మార్చ్‌) కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఈసారి రెండు విభాగ్‌ లు కలిపి 10 జిల్లాల స్వయంసేవకులతో ఒకే కార్యక్రమం జరిగింది. ఈ పెద్ద కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి బస్తీలో సంఘ కార్యాన్ని పరిచయం చేయడానికి ప్రత్యేక ప్రయత్నం జరిగింది. ఆయా బస్తీలలో స్వయంసేవకుల జాబితాను తయారుచేయడం, ప్రతి ఇంటికి ఆహ్వానాన్ని అందించడం వంటి విశేష ప్రయత్నం చేశారు.

 ప్రతి బస్తీ నుండి కనీసం 10మంది పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహానగరం లోని మొత్తం 765 బస్తీలలో 626(82%) బస్తీలనుంచి 11,000 మంది స్వయంసేవకులు విజయదశమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో 7397 మంది పూర్తి గణవేష్‌ (యూనిఫాం)లో పాల్గొన్నారు. అలాగే కార్యక్రమాన్ని తిలకించడానికి 900 మంది మహిళలు కూడా వచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్‌ :
కళాశాల విద్యార్థుల కార్యక్రమాలు - ఈ సంవత్సరం ప్రతి విభాగ్‌ లో కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. అలా జరిగిన 11 శిబిరాలలో మొత్తం 4,641మంది విద్యార్థులు 585 కళాశాలల నుండి పాల్గొన్నారు. వీరంతా పూర్తి గణవేష్‌ (యూనిఫాం) లో పాల్గొన్నారు. వీరిలో 48మంది అల్పకాలీన విస్తారక్‌ (పూర్తిసమయ కార్యకర్తలు)గా పనిచేయడానికి ముందుకు వచ్చారు.

ఈ ప్రయత్నం మూలంగా శాఖల సంఖ్య 98 నుండి 139కి, మిలన్‌ ల సంఖ్య 33 నుండి 136కు పెరిగింది. అలాగే నెలకి ఒకసారి జరిగే సమావేశాలు కొత్తగా 111 ప్రదేశాలలో ప్రారంభ మయ్యాయి. ప్రాథమిక శిక్షవర్గలో 808 కళాశాలలు, 68 వృత్తివిద్య సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.  

సమరసత - తెలంగాణ ప్రాంతంలో స్వయం సేవకులు, సాధుసంతుల సహాయ సహకారాలతో, ఎంపిక చేసుకున్న కొన్ని గ్రామాలలో సామాజిక సమరసతను తెచ్చేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం వల్ల 200 గ్రామాల్లో ఒకే స్మశానం వాడకం, అందరికీ దేవాలయ ప్రవేశం, హోటళ్లలో అందరూ ఉపయోగించడానికి ఒకే రకం గ్లాసులు వంటివి సాధ్యమయ్యాయి.