విభజనవాదాలతో దేశానికి చేటు


మార్చి 25, 2018 నాడు మన ప్రధాని మన్‌కీబాత్‌లో మా|| అంబేడ్కర్‌ దార్శనికతను కొనియాడారు. దేశవిభజన, రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం గురించి మాట్లాడు తున్నపుడు, టీంఇండియా స్ఫూర్తికి పునాదులు వేసి ఫెడరల్‌ స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అంబేడ్కర్‌ చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. పాలనలోని అనేక అంశాల్లో పోటీతత్వ సహకార ఫెడరలిజాన్ని కేంద్రం పాటిస్తున్నదన్నారు.

ప్రధాని చెప్పిన ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వక్రీకరిస్తున్నాయి. పోటీతత్వం అంటే పోట్లాటలు పెట్టడమంటూ వ్యాఖ్యా నిస్తున్నాయి. 30 సంవత్సరాల తర్వాత కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడడం కొందరు నేతలకు రుచించడం లేదు. ఎ.పి. ముఖ్యమంత్రి ప్రత్యేక ¬దా పేరుతో ఎన్‌.డి.ఎ.కూటమి నుంచి బయటకువచ్చారు. కేంద్రం సహకరిస్తామంటున్నా ఓట్లకోసం, పదవులకోసం ఘర్షణవైఖరినవలంబి స్తున్నారు. ఇచ్చిన నిధుల్ని పూర్తిగా వినియోగం చేయమని, ఖర్చులకు లెక్కలు చెప్పమని కేంద్రం అడుగుతుంటే దాన్ని కేంద్రం పెత్తనం చేస్తోందంటు న్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ మోడీని 'గాడు' అనే వరకూ వెళ్ళారు. ముస్లింలకు రిజర్వేషన్‌లివ్వాలంటూ దేశ సమైక్యతా స్ఫూర్తిని దెబ్బతీస్తూ, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పార్లమెంటులో తమ ఎం.పి.లతో రభస సృష్టిస్తున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు ఘర్షణవైఖరిని అవలంబిస్తున్నాయి. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ప్రజల ఆశలు వమ్ముచేస్తూ రజాకార్ల నుంచి వచ్చిన పార్టీ మజ్లిస్‌కు అనుకూలంగా కెసిఆర్‌ నిర్ణయాలు చేస్తున్నారు. థర్డ్‌ఫ్రంట్‌, ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కేకలు పెడ్తున్నారు.

మరో పక్క కొందరు నేతలు ఉత్తరభారతం దక్షిణ భారతం తేడా చూపిస్తూ మాట్లాడుతున్నారు. కేంద్రం దక్షిణ భారతాన్ని ఉపేక్షిస్తున్నదంటున్నారు. కేరళలో మార్కిస్టు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం గురించి ప్రస్తావిస్తూ కేంద్రం పెత్తనం మరింత పెరుగుతుందని అంటున్నది. నిజానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకర్షక విధానాలు అవలంబిస్తే ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందన్న హెచ్చరికను చేస్తున్నది. అది కందరికి నచ్చడం లేదు. అందువల్ల దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు కేరళలో ఓ సమావేశం నిర్వహిస్తున్నారు.

కర్ణాటకకు ప్రస్తుతం మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెసుకు మిగిలిన మూడు రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడ అధికారం నిలపుకోవాలని కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నివిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆయన లింగాయత్‌లను మైనారిటీలుగా ప్రకటించి, హిందువులను విభజించేందుకు సైతం సిద్ధపడ్డారు. లింగాయత్‌, వీరశైవులు శివభక్తులు. హిందూ సమాజంలోని దురాచారాలపై ఉద్యమించారు బసవన్న. కనుక వారు హిందూ మతం నుంచి భిన్నమైనవారు కాదు. రాష్ట్రంలో 17 శాతం జనాభా లింగాయత్‌లదే. 1991లోనే కర్ణాటక హైకోర్టు లింగాయత్‌లను ఓ మతంగా గుర్తించడాన్ని వ్యతిరేకించింది. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సైతం దీన్ని వ్యతిరేకించారు. 2013లో సిద్ధరామయ్య కూడా దీన్ని వ్యతిరేకించిన వారే.

లింగాయత్‌లు వైదిక కర్మకాండలకు వ్యతిరేకమైనంత మాత్రాన వారు హిందువులు కాకుండా పోతారా? నాస్తికులు సైతం హిందువులే. హిందువులను విభజించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సాహసించింది. బ్రిటిషువారు విభజించు, పాలించు విధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తోంది. అందరినీ ఆదరించేందుకు అనుభవమంటపం ఏర్పాటుచేసిన బసవన్న ఆలోచనలకు భిన్నంగా సిద్ధరామయ్య చేస్తున్న ప్రయత్నం వమ్ముచేసేందుకు హిందువులు ఉద్యమించాలి.

- హనుమత్‌ ప్రసాద్‌