వెల్లివిరిసిన సమరసత


సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తెలంగాణా, ఆంధ్రప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి వరకూ జరిగిన ఈ కార్యక్రమాల సంక్షిప్త నివేదిక ఇలా ఉంది -

భారత రాజ్యాంగదినోత్సవం సందర్భంగా సింద్రాబాద్‌, హైదరాబాద్‌లలో 11చోట్ల కార్యక్ర మాలు జరిగాయి. అలాగే 11జిల్లాల్లోని 14 ప్రదేశాలలో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. వీటిలో మొత్తం 1250మంది పాల్గొన్నారు.

కులం అంటే వృత్తిఅని, శాస్త్రమని, కళ అని భావించి, అన్ని కులాలవారు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ సమైక్యంగా జీవనం గడపడం ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. కానీ ఈ కులాల మధ్య కొందరు చిచ్చుపెట్టి, విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలను వమ్ముచేసి గ్రామాలలో సద్భావనను పెంచేందుకు సమరసతావేదిక కృషి చేస్తోంది. అందులో భాగంగా వివిధ కులవృత్తులవారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది.భువనగిరిజిల్లా నెమిల గ్రామంలో 18కులాలవారిని సన్మానించారు. అలాగే మెట్‌పల్లి నగరంలో యోగాచార్య, ప్రతి నిత్యం గ్రామంలో జాతీయగీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను, ఎస్‌సి వర్గానికి చెందిన పంచాంగకర్త, భగవద్గీత ప్రచారకర్తలను సత్కరించారు.ఇలాగే ఖమ్మం, మెదక్‌, సిరిసిల్ల, జగిత్యాల మొదలైనచోట్ల కూడా సన్మాన కార్యక్రమాలు జరిగాయి.

ఖమ్మజిల్లాలో మూడుఏళ్ళుగా సమరసతా సమ్మేళనం జరుగుతోంది. ఈసారి సమ్మేళనంలో 2వేలమంది పాల్గొన్నారు. వీరిలో లంబాడా, కోయ, సంచారజాతులు, ఎస్‌.సి వర్గానికి చెందినవారు ఉన్నారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో అదే జిల్లాలో మరికొన్ని గ్రామాల్లో కూడా సమరసతా సమ్మేళనాలు జరిగాయి. అలాగే జగిత్యాలలో జరిగిన సమ్మేళనంలో 12మండలాల కు చెందిన 45 గ్రామాల నుండి 350మంది పాల్గొన్నారు.

అందె గ్రామంలో శివరాత్రి సంబరాలు

సిద్దిపేటజిల్లా మిరుదొడ్డిమండలం అందె గ్రామంలో నాలుగేళ్ళక్రితం కులపరమైన ఘర్షణలు జరిగాయి. గ్రామస్థులంతా రెండువర్గాలుగా చీలిపోయి చిన్నచిన్న విషయాలకే గొడవపడడంతో పరిస్థితి ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండేది. కానీ సామాజిక సమరసత వేదిక మూడు సంవత్సరాలుగా ఇక్కడ రెండువర్గాల మధ్య సయోధ్యను కలిగించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. ఫిబ్రవరి 13 శివరాత్రి సందర్భంగా 1000మందికి పైగా గ్రామస్థులు అంతా కలిసి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ఊరేగింపు, తడ్కపల్లి ఆవాస, అందె పాఠశాల విద్యార్థుల భజన, కోలాటం, బతుకమ్మపాటల నృత్యాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగానే పాఠశాల విద్యార్థులకు 'భారతదేశం నా మాతృభూమి' అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. 10వ తరగతిలో 80శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేశారు.

సామాజిక సమరసత వేదిక కార్యకర్తలు వివిధ జిల్లాల్లో తలెత్తిన కులపరమైన సమస్యలను పరిష్కరించడానికి కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. మెట్‌పల్లి మండలం కుస్తాపూర్‌ గ్రామంలో ఎస్‌సి లను సామాజిక బహిష్కరణ చేశారని తెలిసి, అక్కడకు వెళ్ళిన కార్యకర్తలు ప్రజలందరినీ సమావేశపరచి సమస్యను పరిష్కరించారు. ఆ తరువాత ఎస్‌సి వర్గం నిర్మించుకున్న రామాల యాన్ని పూర్తి చేయడానికి తమ సహకారం అందించి గ్రామస్థులంతా అండగా నిలిచారు.