ఆ గ్రామంలో పాలు ఉచితంగా ఇస్తారు

మన గ్రామాల్లో మంచి నీళ్ళడిగితే మజ్జిగ ఇచ్చేవారు. ఏ ఇంటికి వెళ్ళినా లేదనకుండా అన్నం పెట్టేవారు. అలా తమకు ఉన్నది ఇతరులకు పెట్టడం తమ కర్తవ్యమని భావించేవారు. ఆధునికత పెరిగిన తరువాత, ప్రతి విషయాన్ని లాభనష్టాల రూపంలో కొలవడం అలవాటైనప్పటి నుంచి ఈ భావన తగ్గింది. అయినా ఇప్పటికీ గ్రామాల్లో ఇలాంటి సద్భావన అక్కడక్కడ కనిపిస్తునే ఉంటుంది.
అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లి, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామాల వారు పూర్వీకులు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. తాతముత్తాతలు చెప్పిన మాటను తుచ తప్పకుండా పాటిస్తూ నేటికి ఈ రెండు ఊర్లు పాలు అమ్మని పల్లెలుగా కొనసాగుతున్నాయి. ఎవరికైనా అవసరమైతే ఉచితంగా ఇస్తారు తప్ప విక్రయించరు.

మనకు మనంగా తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడమే కొద్ది రోజుల తరువాత ఎంతో కష్టంగా మారుతుంది. అలాంటిది వరస కరవులు,సాగు సాగని ప్రతికూల పరిస్థితులున్నా ఈ ప్రాంతంలో చుట్టు పక్క గ్రామాల్లో రైతులు పాడినే ప్రధాన జీవనాధారంగా మార్చుకున్నారు. ఇలాంటి కష్టాల్లోనూ వెరవకుండా వారు మాత్రం పెద్దలు చెప్పిన మాట మరవకుండా సాగుతున్నారు.

గంజహళ్లిలో కొన్ని శతాబ్దాల క్రితం ఒక ఆధ్యాత్మికవేత్త ఉండేవారు. ఓ రోజు ఆయన గ్రామంలో గోవధ వద్దని, పాలు అమ్మకూడదని ప్రజలకు చెప్పారు. ఆయన మాట మీరకుండా నాటి నుంచి నేటి వరకు వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఎవరూ పాలు అమ్మరు, పాడి ఉన్న వారు పిల్లల కోసం ఎవరైనా అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారని గ్రామస్థులు చెబుతారు.

కడిమెట్లలో పాలు విక్రయించవద్దని పూర్వీకుల చెప్పిన మాటను తరతరాలుగా పాటిస్తున్నారు. నాలుగువేల జనాభా ఉన్న గ్రామంలో 300కు పైగా కుటుంబాలు పశుపెంపకంలో ఉన్నాయి. వ్యవసాయమే ప్రధానాధారమైన వీరందరిళ్లలో పాడికి కొదవలేదు. అయితే ఏ ఒక్కరూ పాలు అమ్మరు. గ్రామంలో ఎవరైనా చిన్నారుల కోసం, వివాహాలు, పండగల సమయంలో అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారు.

రోజూ ఉదయం గ్రామస్థులకు చిక్కటి మజ్జిగ పంపిణీ చేస్తారు. గ్రామం మొత్తానికి పాలు పోసే వీరు మాత్రం ఆదివారం రోజు రాత్రి వేళ ఒక్కసారే వాటిని తాగుతారు. అదీ ప్రతి శనివారం గ్రామంలోని చెన్నకేశవస్వామికి తెల్లవారుజామునే దీపారాధన చేసిన తరువాతే. మజ్జిగ తయారీతో వచ్చే నెయ్యి ప్రతి ఆదివారం ఉదయం విక్రయిస్తారు.

 పూర్వీకులు మా తాత ముత్తాతలకు చెప్పారు వారు అనుసరించారు వారు చెప్పిన మాటను మేం పాటిస్తున్నామని యాదవులు చెబుతున్నారు. గ్రామంలోని ఇతర సామాజిక వర్గాలు, రైతుల్లో పశుపోషణ చేసేవారు చాలా తక్కువ. అలా చేసే వారూ ఇంటి అవసరాలకు వాడుకోవడం, ఇరుగుపొరుగు అడిగితే పాలను పోస్తారు తప్ప విక్రయించకపోవడం గమనార్హం.