''దళిత్‌'' అనే పదం వాడొద్దు - రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన

అధికారిక లావాదేవీల్లో షెడ్యూల్డ్‌ కులాలకు సంబంధించినవారి గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు 'దళిత్‌' అనే పదాన్ని వాడొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. మార్చి 15న కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఈ లేఖలు పంపింది.
దళిత్‌ అనే పదానికి బదులు ఆంగ్లంలో షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ అనిగానీ (లేదా) దానికి సమానార్థక మైన ప్రాంతీయ భాషా పదాలనుగానీ వాడాలని ఆ లేఖల్లో పేర్కొంది.

రాజ్యాంగంలో 'దళిత్‌' అనే పదం లేదని 2018జనవరిలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు గ్వాలియర్‌ బెంచ్‌ ఒక తీర్పులో పేర్కొన్న విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది.

ఈ మేరకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, విభాగాలు ఆ పదం వాడకుండా ఉండాలని అందులో పేర్కొంది. 1982, ఫిబ్రవరి 10న నాటి కేంద్ర ప్రభుత్వం 'హరిజన్‌' అనే పదాన్ని వాడకూడదని.. బదులుగా సంబంధిత కులాన్ని పేర్కొనాలని రాసిన లేఖల గురించీ ప్రస్తావించింది.

అలాగే గతంలో  షెడ్యూల్‌ కులాల జాతీయ సంఘం(నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్‌ కాస్ట్స్‌) కూడా ఇలాంటి ఆదేశాలే జారీచేసింది. జనవరి, 2008లో రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన లేఖలో 'దళిత్‌' అనే పదం రాజ్యాంగ విరుద్దమైనదని, దానిని అధికారిక పత్రాలు వేటిలోనూ ఉపయోగించవద్దని స్పష్టం చేసింది.