దేవుని దృష్టిలో అందరూ సమానమే


దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సి.యస్‌.రంగరాజన్‌ అన్నారు. జియాగూడలోని చారిత్రత్మకమైన శ్రీరంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవను ఆయన అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌ స్వయంగా ఓ దళిత భక్తుని తన భుజస్కందాలపై ఎత్తుకుని దేవాలయంలోకి మోసుకెళ్లి శ్రీ రంగనాథుని దివ్యదర్శనం చేయించారు. తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవుని ముందు ఎలాంటి భేదాలు, తారతమ్యాల్లేవని, మనుషులంతా సమానమేనని ఆయన అన్నారు.. దళితులను దేవాలయంలోకి అనుమతించరాదంటూ శాస్త్రాల్లో ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

ఓ యూనివర్శిటీలో జరిగిన చర్చలో దేశంలో జరుగుతున్న దాడుల గురించి దళిత మేధావులు, నాయకులు ప్రస్తావించారని, అప్పుడు తాను లోక సారంగ-తిరుప్పాణాళ్వార్‌ వృత్తాంతాన్ని వినిపించా నని, కాని ఎప్పుడో జరిగిందని చెప్పడం కాదు.. ఇప్పుడు అలా చేయగలరా అని వాళ్లు ప్రశ్నించటం వల్లే 2700 క్రితం నాటి ఆ పద్దతిని తిరిగి పాటించి చూపామని తెలిపారు. శుచి, శుభ్రత, మంచి మనస్సు ఉంటే ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చునని తెలిపారు. ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందనేది తమ సంకల్పమని రంగరాజన్‌ పేర్కొన్నారు.

అనంతరం చిల్కూరు దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందర్య రంగరాజన్‌ మాట్లాడుతూ దళితులకు ఆలయ ప్రవేశంలో మునివాహన సేవ అనేది కీలక ఘట్టమని తెలిపారు.

క్రీ.పూ. 2700 యేళ్ల క్రితం తమిళనాడులోని శ్రీరంగ ఆలయంలో దళితున్ని ఆలయంలోకి రామానుజాచార్యులు వారు స్వయంగా భుజస్కంధాలపై మోసుకెళ్లి స్వామి వారి దర్శనం చేయించారని గుర్తుచేశారు. ఇదే మునివాహన సేవ కార్యక్రమాన్ని జియాగూడలోని శ్రీ రంగనాథ్‌ స్వామి దేవాలయంలో నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవ సేవ సంఘం సలహాదారులు సిహెచ్‌. లక్ష్మీనాధ్‌ చార్యులు, యాదాద్రి ప్రధాన అర్చకులు కారంపూడి నర్మింహా చార్యులు, తిరువై కోకిలా మంజులశ్రీ, తిరుపతి భగవత్‌గీత ప్రచారకులు రాధా మనోహర్‌దాస్‌, తెలంగాణ సామజిక సమరసత వేదిక అధ్యక్షులు డాక్టర్‌ వంశతిలక్‌, ఆలయ చైర్మన్‌ ఎస్‌టీ. చార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు, వేద పండితులు పాల్గొన్నారు.