హిందూత్వం ఒక్కటే, వేరువేరుకాదు - ఆర్‌ ఎస్‌ ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌

ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారతీయ ప్రతినిధి సమావేశాలు నాగపూర్‌లో జరిగాయి. అందులో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది. 'భారతీయ భాషల పరిరక్షణ'గురించి తీర్మానం కూడా ఆమోదించారు. ఈ సందర్భంగా పరమ పూజనీయ సర్‌ సంఘచాలక్‌తో జరిపిన సంభాషణ -

ప్ర. ప్రస్తుతం సమాజంలో సంఘ కార్యానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. దీనిపట్ల మీ అభిప్రాయం ఏమిటి ?

జ. సంఘ స్వయంసేవకులు సమాజంలోని అన్ని రంగాలలో పనిచేస్తున్నారు. శాఖ నుండి మొదలుపెడితే వివిధ సంస్థలు, తమ కుటుంబాలలో కూడా స్వయంసేవకులు ఋజువర్తనను అలవరుస్తున్నారు. అందరినీ కలుపుకుపోవడం, పారదర్శకత, నిరాడంబరత, నిస్వార్ధత వంటి గుణాల వల్ల సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నారు. దీనివల్ల సంఘం పట్ల సమాజంలో విశ్వాసం పెరిగింది. సంఘలో జ్యేష్ట కార్యకర్తల వ్యవహార శైలిని చూసిన తరువాత సంఘం ఏం చెపితే అదే చేస్తుందనే నమ్మకం కలిగింది. స్వయంసేవకులు అందరి కోసం పనిచేస్తారని, నమ్మదగినవారని సాధారణ ప్రజానీకం కూడా భావిస్తున్నారు. కనుక సమాజపు విశ్వాసాన్ని నిలబెడుతూ, ఆ విశ్వాసం మరింత పెరిగే విధంగా వ్యవహరించాలి. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సమాజంలో ఉన్న ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చవచ్చును.

ప్ర. రాగల ఒకటిన్నర సంవత్సరాల్లో సామాజిక, రాజకీయ రంగాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనుకుంటున్నారు? ప్రస్తుతం మన సమాజంలో పెద్ద మార్పు వస్తున్నదని అనుకుంటున్నారా ?


జ. మార్పు అనేది నిరంతర ప్రక్రియ. భారత్‌తో సహా ప్రపంచమంతటా మార్పు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మన దేశపు ప్రతిష్ట, గౌరవం పెరిగాయి. దీనివల్ల దేశం లోపల, బయట కూడా మన వ్యవహారశైలిలో మార్పులు వస్తాయి. ఒకప్పుడు స్వాతంత్రోద్యమ సమయంలో యువతలో కనిపించిన జాతీయభావన ఇప్పుడు కనిపిస్తోంది. దేశం కోసం ప్రాణాలైనా అర్పించాలన్న నిష్ట కనిపిస్తోంది. తాము అనుకున్నది నీతిగా, నిజాయితీతో సాధించాలని ప్రయత్నిస్తున్నారు. బూటకత్వాన్ని నిరసిస్తున్నారు. సరైన దిశానిర్దేశం, పారదర్శకత, నిరాడంబరత ఎక్కడ ఉంటే ఆ కార్యంలో భాగస్వాములు అవుతున్నారు. అన్నింటికంటే మించి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచినందున ఒక సమాజంగా మన సామూహిక భావన, అనుభవం బాగా పరిపక్వమయ్యాయి. దీనివల్ల సహజంగానే కీలకమైన మార్పులు వస్తాయి. ఆశావాద దృక్పధం, సకారాత్మ ధోరణి పెరుగుతాయి. సమాజంలో నేడు సాగుతున్న మంథనంలో అమృతంతో పాటు కొంత విషం కూడా వస్తుంది. సమాజ హితం కోసం ఎవరైనా ఆ విషాన్ని మింగాలి. పరమశివుడు గరళాన్ని మింగాడు. సంఘ స్వయంసేవకులు అలాంటి పాత్ర నిర్వహించడానికి సిద్దంగా ఉన్నారు.

ప్ర. నేటి రాజకీయ వాతావరణంలో రెండు రకాల హిందూత్వాలు ఉన్నాయని కొందరు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రకారం ఒక రకం అసలైన హిందుత్వమైతే, మరొకటి తీవ్రమైన, పిడివాద హిందూత్వం. ఈ వాదాన్ని గురించి మీరేమంటారు?

జ. మా ప్రకారం హిందూత్వం అంటే ఒకేఒక్కటి ఉన్నది. మనం విశ్వసించే కొన్ని విలువలే హిందూత్వం. సత్యం, అహింస, అస్తేయం (దొంగతనం చేయకపోవడం), అపరిగ్రహం (ఏది దాచుకోకపోవడం), బ్రహ్మచర్యం, తపం, శౌచం(పరిశుభ్రత), సంతోషం(సంతృప్తి), ఈశ్వర ప్రణీధానం(భగవంతుని ముందు మోకరిల్లడం) వంటి గుణాలను అనుసరిస్తాం. 'నిరంతర సత్యాన్వేషణ' చేయాలని గాంధీజీ చెప్పేవారు. ఆ సత్యమే హిందూత్వం. అది ఎప్పుడు ఒక్కటే. మర్యాద పురుషోత్తముడు రాముడి కాలంలో 'హిందూ' అనే పదం వాడుకలో లేకపోవచ్చును. కానీ రాముడు హిందువుల ఆరాధ్యపురుషుడు. ఆయన ఆచరించి చూపిన విలువలు అందరికీ ఆదర్శప్రాయాలు. వాటినే హిందూత్వం అంటున్నాము. ఆయుధం పట్టిన పరశురాముడిని, కరుణావతారమైన బుద్దుదిని కూడా హిందూత్వంలో భాగంగానే భావిస్తాము.

కాబట్టి హిందూత్వం ఒకటే. మనం వేరువేరు కోణాల నుంచి చూసినా అది ఒకటే. నేను సత్యం, అహింస అనే విలువలను నమ్మి, ఆచరించే వ్యక్తిని అనుకోండి. ఎవరైనా నాపై దాడిచేసి, తద్వారా సత్యాన్ని, అహింసను నాశనం చేయాలనుకున్నారను కోండి. అప్పుడు నేను ఆ విలువలను రక్షించడానికి పోరాడాలి. పోరాటం చేయడం లేదా అహింస పాటించడం మాత్రమే హిందూత్వం కాదు. సత్యాన్ని ఆచరించడం, దానిని కాపాడేందుకు పోరాటం చేయడం హిందూత్వం. సత్యాన్ని, అహింసను పాటించడం హిందూత్వం. ఎప్పుడు సహనం వహించాలి, ఎప్పుడు పోరాడాలన్నది వ్యక్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం ఒకసారి తప్పుకావచ్చు, ఒకసారి ఒప్పుకావచ్చును. స్వార్ధ ప్రయోజనం కోసం పోరాడితే అది హిందూత్వం కాదు. ఏదైనా తప్పు జరిగితే మనకెందుకులే అని మౌనం వహిస్తాం. అది కూడా హిందూత్వం కాదు. వివేకానందుని హిందూత్వం, సంఘ హిందూత్వం, తీవ్ర హిందూత్వం అంటూ వేరువేరుగా లేవు. స్థిరంగా ఉండడం లేదా లేకపోవడం మొదలైనవి మానవ స్వభావానికి సంబంధించిన విషయాలు. అది హిందూత్వం కాదు.

హిందూత్వం పట్ల సర్వత్ర గౌరవం, ఆకర్షణ పెరుగుతుండడంతో కొందరు ఇలాంటి దుర్వ్యాఖ్యలు చేస్తారు. అపోహలు సృష్టిస్తుంటారు. హిందూత్వం పట్ల కేవలం భారత్‌ లోనే కాదు ప్రపంచమంతటా గౌరవం పెరుగుతోంది. దీనివల్ల హిందుత్వ వాదులకు సహజంగానే ప్రయోజనం చేకూరు తుంది. అటువంటి ప్రయోజనం పొందకుండా అడ్డుకునేందుకు సమాజంలో చీలికలు సృష్టించ డానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. హిందువులుగా మనం ఎవరినీ శత్రువులుగా, పరాయివారుగా చూడం. కానీ ఆ హిందూ లక్షణాన్ని నిలుపుకునేం దుకు హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, సమాజాన్ని కాపాడుకోవాల్సిందే.ఏ ప్రాధమిక విలువల ఆధారంగా మనం పని చేస్తామో అది హిందూత్వం. అది ఒక్కటే ఉంది. కానీ నా హిందూత్వం వేరు నీ హిందూత్వం వేరని మాత్రం అనలేము. ఏది సరైన ఆచరణ అని సమాజం మొత్తం నిర్ణయిస్తుంది. ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది. ఇప్పుడు సమాజంలో ఎక్కువమందికి హిందూత్వం అంటే ఏమిటన్నది అర్ధమవుతోంది.