సమాచారభారతి ఆధ్వర్యంలో నారద జయంతి ఉత్సవాలు


మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా నారదజయంతి ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలో సమాచారభారతి ఆధ్వర్యంలో నల్గొండ, హైదరబాద్‌, మెదక్‌, వరంగల్‌, కరినగర్‌ లలో నారదజయంతి ఉత్సవాలు జరిగాయి.హైదరాబాద్‌ :  ''వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగంలో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది. దానితోపాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది'' అని రిలయన్స్‌ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్‌ శ్రీ ఉమేష్‌ ఉపాధ్యాయ తెలిపారు.

హైదరాబాద్‌లోని మేకాస్టార్‌ ఆడిటోరియంలో నిర్వహించిన దేవర్షి నారద జయంతి మరియు పాత్రికేయ సన్మాన సభలో శ్రీ ఉమేష్‌ ఉపాధ్యాయ ముఖ్య వక్తగా పాల్గొని ''ది ఫ్యూచర్‌ అఫ్‌ మీడియా'' అనే అంశంపై ప్రసంగించారు.

శరీరంలోని ఒక అవయవం చెడిపోతే వైద్యుడు కత్తితో శస్త్ర చికిత్స చేసి ఆ అవయవాన్ని తొలగించి శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతారని, అదేవిధంగా పాత్రికేయులు తమ కలం ద్వారా సమాజంలో ఉన్న అనర్థాలను దూరం చేసేందుకు తోడ్పాటునందించాలని ఉమేష్‌ ఉపాధ్యాయ సూచించారు.

 ఒక చిన్న ట్వీట్‌ అనేక మార్పులకు దారి తీస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు పాత్రికేయునిగా మారిపోయి కలం శక్తిని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. పాత్రికేయులకు విశ్వసనీయత చాలా అవసరమని ఉమేశ్‌ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. లోక కళ్యాణం కోసమే పనిచేసిన నారదుడిని పాత్రికే యులు స్ఫూర్తి గా తీసుకొని పని చేయాలనీ కోరారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ శ్రీ టి పాపిరెడ్డి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో సమాచార రంగం కీలకంగా మారిందని, ఈ నేపథ్యంలో సమాజ శ్రేయస్సును దష్టిలో పెట్టుకుని ప్రజలకు వాస్తవాలు తెలియచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

నారద జయంతి సందర్బంగా సమాచార భారతి నలుగురు పాత్రికేయులను సన్మానించింది. 


వరంగల్‌ :
మే 2న వరంగల్‌ లోని సామాజగన్మోహన్‌ భవనంలో నారద జయంతి కార్యక్రమం జరిగింది. సీనియర్‌ పాత్రికేయులు రాకా సుధాకర్‌ ప్రధాన ఉపన్యాసం చేశారు.నిరంకుశ ప్రభుత్వాలు కూడా మీడియా చైతన్యం కారణంగా కుప్పకూలాయని,సోషల్‌మీడియా రాకతో సిటిజన్‌ జర్నలిజం కొత్తపుంతలు తొక్కుతోందని ఆయన అన్నారు. దీనివల్ల మొబైల్‌ ఫోన్‌ ఉన్న ప్రతిఒక్కరూ పాత్రికేయుడిగా మారారని అన్నారు. కార్యక్రమ సందర్భంగా సమాచారభారతి వరంగల్‌ శాఖ నలుగురు పాత్రికేయుల్ని సన్మానించింది.


నల్గొండ : దేశ నిర్మాణంలో పత్రిక రంగం వారు పాలు పంచుకోవాలని, ప్రజాస్వామ్యం లో వారికి నాలగవ స్థంబం అనే ఒక విశిష్ట గుర్తింపు కలదని, అందులో పని చేసే వారు సమాజ బాద్యత జాతీయ భావాలూ కలిగి ఉండడం అత్యంత అవసరమని  శ్రీ అన్నదానం సుబ్రమణ్యం  గారు, ఆర్‌ ఎస్‌ ఎస్‌ తెలంగాణ ప్రాంత కర్యవాహ, నల్గొండలో జరిగిన  దేవర్షి నారద జయంత్‌ ఉత్సవం లో కోరారు. సమాచార భారతి నల్లగొండ జిల్లా వారు  లయన్స్‌ క్లబ్‌ లో 24 ఏప్రిల్‌ నాడు నిర్వహించిన దేవర్షి నారద జయంతి ఉత్సవంలో ముఖ్యవక్తగా పాల్గొన్నారు. తెలంగాణ ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కర్నాటి విజయ్‌ కుమార్‌ ముఖ్య అతిదిగా హాజరయ్యారు.


మెదక్‌ :
మే 1న శ్రీ నారద జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా మొత్తం కలిపి సంగారెడ్డి నగరంలో బికెఎస్‌ భవన్‌ లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లికార్జున్‌ రెడ్డి సాక్షి బ్యూరో ఇంచార్జి మరియు ముఖ్యవక్త గా శ్రీ వేదుల నర్సింహం గారు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ నారద మునిని ప్రపంచంలోనే మొట్ట మొదటి పాత్రికేయుడు(విలేఖరి)గా అభివర్ణించారు. సమాజ హితం కోసం ధర్మ రక్షణ కోసం సమస్యల పరిష్కారం కోసమే వారధిలా పని చేసారని కొనియాడారు.కావున ఇప్పటి విలేఖరులందరు కూడా సమాజ శ్రేయస్సు కోసం నారదుడిలా పనిచేయాలని కోరారు. 


కరీంనగర్‌ :
మే 2న కరినగర్‌(కరీంనగర్‌)లోని స్థానిక ఫిలింభవన్‌లో నారద జయంతి కార్యక్రమం జరిగింది. శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం నియంత్రణాధికారి ఆచార్య వన్నాల రమేష్‌ ముఖ్యఅతిథిగా, ప్రముఖసాహితీవేత్త గండ్ర లక్ష్మణ్‌రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. లోకహితం మాసపత్రిక సంపాదకులు రాంపల్లి మల్లికార్జునరావు ప్రధాన వక్తగా నారద జయంతి విశిష్టతను వివరించారు.నేడు పత్రికలు విదేశీభావజాలంలో కొట్టుకుపోతున్నాయని, అది మంచిదికాదని అన్నారు.