ఆశించకుండా సేవించాలి

మనం ప్రాణివర్గం నుండే కాదు, అప్రాణి వర్గం నుండి లాభాన్ని పొందుతున్నాం. అందువల్లనే వీటి ఋణం తీర్చడం కోసం కొన్ని వైదిక క్రియలను చేస్తున్నాం. జడంగా భావింపబడే భూమికి, నీటికి, అగ్నికి ఋణం తీర్చుకోవాలి.

మొక్కలలో ప్రాణం ఉంటుందని, అంతేకాదు, వాటికీ సుఖదుఃఖాలుంటాయిని పూర్వులు గ్రహించి చెట్లను పూజించారు. మట్టికి సంబంధించిన మృత్తికాస్తూకం, దూర్వలకు సంబంధించి దుర్వాసూక్తం ఉంది. నిత్యం చేయవలసిన బ్రహ్మయజ్ఞంలో తర్పణాలుంటాయి. దేవ, ఋషి, పితృ తర్పణాలవి.

ఒక కాకి ఎక్కడో ఏదో తిని రెట్ట వేస్తే ఒక మొక్క మొలుస్తోంది. అది పెద్ద చెట్టై మనకు ఉపయోగించడం లేదా? కుక్క కాపలా కాస్తోంది, గుఱ్ఱం బండి లాగుతోంది. భౌతిక, ఆధ్యాత్మిక సుఖాలందిస్తోంది గోమాత. ఇల్లా మనకు అన్నీ ఉపకరిస్తూ ఉంటే మనం తిరిగి ఋణం తీర్చుకోవద్దా?

పశువులకై చెఱువులను త్రవ్వేవారు. ఎక్కడికి వెళ్ళి మేసినా వాటికి నీటి కొరత ఉండకూడదని తహతహలాడేవారు. వాటి ఒంటికి దురద పుడుతుందని మధ్యలో స్తంభాలను, రాళ్ళను పాతేవారు. ఈ పనులన్నిటినీ ధర్మాలన్నారు. ధర్మపు సారం చిత్తశుద్ధియేనని తిరువళ్ళువర్‌ అంటారు.

లోపలి పవిత్రత ముఖ్యం


ధర్మం అంటే మనస్సులో పవిత్రంగా ఉండటం, దుర్భావాలు రాకుండా చేయడమే అని తిరువళ్ళువర్‌ అంటారు. వైదికమైన సంప్రదాయాన్ని పాటిస్తూ, కర్మనుష్ఠానం చేయడమే ధర్మమంటారు. కర్మను చేయడానికి ముందు చిత్తం పవిత్రంగా ఉండాలి గదా! ఇది లేకుండా సంఘసేవ చేయడం నిష్ప్రయోజనమే.

పవిత్రంగా ఉండటమంటే అది స్వార్థం అని భావించకూడదు. అది ప్రపంచ వ్యవహారాలలోని స్వార్థపరత్వం కాదు. మామూలు స్వార్థం ఇంద్రియాల వెంటబడేది, ఇతరులను బాధించియైనా నెరవేర్చుకొనేది. మనం బాధపడైనా ఇతరులకు సాయం చేయడమే అసలైన స్వార్థం

ఉపాకారం చేయాలన్నారు. ఇతరులకే చేస్తే సరిపోతుందా? భగవానుడు మనకు ప్రాణాన్ని, మనస్సును ఇచ్చాడు. జీవుడుంటాడు, ఆ జీవాత్మకు సాయం చేయవద్దా! ఆ జీవాత్మకు ఆనందం కల్గించవద్దా? కనుక సంకుచితమైన స్వార్థపరత్వం కంటె ఉన్నతిని తీసుకొని వచ్చే స్వార్థానికై ప్రయత్నించాలి.

మన మనస్సు పవిత్రంగా ఉంటే ఇతరులకు చేసే సాయం ఫలిస్తుందని అంటున్నాం. అయితే పరోపకారం చేయడం వల్ల మన మనస్సు పవిత్రమౌతుందని అనడం పరస్పర విరుద్దంగా లేదా? అయితే సంఘర్షణకు తావులేదు.

బాహ్య ప్రపంచపు బాధలను పోగట్టడం మన చేతిలో లేదు. ఇతరుల కర్మలను మనం తొలగించలేకపోయినా సేవవల్ల మనకు కర్మ క్షయమవుతుంది. నీవు చేసే సేవ ఫలించిందా, లేదా అని చూడకు, నీ సేవ వల్ల నీ మురికి పోయిందా లేదా అని చూడు.

వైదిక మతం - సంఘసేవ


ప్రతివర్ణం వారు పాటించవలసిన ఆత్మగుణాల నెనిమిదింటిని ఏనాడో చెప్పారు. వాటిని సామాన్య ధర్మాలన్నారు. అందులో మొదటిది అహింస. తరువాత సత్యం వస్తుంది. 'సత్యం భూతహితేరతం' అని ఉంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం సత్యం కాదని, సర్వప్రాణులకు హితాన్ని కల్గించేది సత్యమని అన్నారు. ఈ ఎనిమిదింటిని 40 సంస్కారాల ముందుంచారు.

తెల్లదొరల పాలన వచ్చిన తరువాత ఇది ప్రాచీనాచారమని, ఇది సేవయని చెప్పడం కన్పించింది. అంతకుముందు ఆచారంలో ఆరితేరినవారూ, ఇతరులు చూపే గౌరవ ఆదరాలకు పాత్రులై యుండేవారు. వారూ సేవ చేసినవారే. అప్పయ్య దీక్షిత, గోవింద దీక్షిత, తిరువసనల్లార్‌, అయ్యనార్‌ వంటి మహాత్ములు సంఘసేవలో సిద్ధహస్తులే.

(కంచిపరమాచార్య అమృతవాణి నుంచి..)