గ్రామాల్లో విద్యుత్‌ వెలుగులు


దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్‌ సరఫరా అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నం సఫలమైంది. మధ్య మణిపూర్‌ సేనాపతి జిల్లాలో లాయ్‌సాంగ్‌ గ్రామానికి కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వడం పూర్తయింది. దీనితో దేశంలోని వందశాతం గ్రామాలు విద్యుత్‌ పొందడానికి అవకాశం ఏర్పడింది. ఇక ఈ గ్రామా లకు విద్యుత్‌ను సరఫరా చేసే పని మిగిలింది.

విద్యుత్‌ సౌకర్యం సాధారణ జనజీవనాన్ని మెరుగుపరచడమేకాక, ఆర్థికాభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడుతుంది. ప్రస్తుతం దేశంలో కేవలం ఆరురాష్ట్రాలు మాత్రమే 24గంటల విద్యుత్‌ను అందించగలుగుతున్నాయి.అది కూడా అందుకోలేని గ్రామాలు ఆ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అందుకనే 1969లోనే గ్రామీణవిద్యుదీకరణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేశారు. 1990కల్లా దేశంలో అన్ని గ్రామాలకు కరెంటు అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ప్రకటించింది కూడా. కానీ 2005 నాటికి ఇంకా లక్షాపాతికవేల గ్రామాలు ఆ సదుపాయానికి దూరంగానే ఉండిపోయాయి. విద్యుత్‌ప్రాజెక్ట్‌ల కేటాయింపులో అవకతవకలు, నిధుల మళ్ళింపు మొదలైనవాటితో కోట్లాది ప్రజాధనం దుర్వినియోగమైందితప్ప లక్ష్యం నెరవేరలేదు.అయితే వెయ్యిరోజుల్లో అన్ని గ్రామాలకు విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటుచేస్తామని 2015 స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ ప్రకారమే అనుకున్న గడువుకంటే ముందుగానే మిగిలిన 20 వేల గ్రామాలకు కరెంట్‌కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఏడురాష్ట్రాల్లో నూరుశాతం ఇళ్ళకు విద్యుత్‌ ఇచ్చామని, 2018డిసెంబర్‌ 31కి మిగతారాష్ట్రాల్లో అన్ని ఇళ్ళకు కల్పిస్తామని విద్యుత్‌శాఖ సహాయమంత్రి ప్రకటించారు. 'సౌభాగ్య' పథకం కింద డిసెంబర్‌నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి విద్యుత్‌ సరఫరా అందిస్తామని ఆయన చెప్పారు. ఇది కూడా అనుకున్న గడువుకంటే ముందుగానే పూర్తిచేస్తామని ధీమా వ్యక్తంచేశారు.