హైదరాబాద్‌లో పెరుగుతున్న రోహింగ్యాల సంఖ్య

యన్మార్‌ అంతర్యుద్ధం కారణంగా అక్కడి రోహింగ్యాలు పెద్ద ఎత్తున దేశంలోకి ప్రవేశిస్తు న్నారు. అయితే, వారిని శరణార్థులుగా గుర్తించేది లేదని స్పష్టం చేసిన కేంద్రం, ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన వారిని పంపించి వేస్తామని కేంద్రం పలుమార్లు ప్రకటించింది.

అయితే, హైదరాబాద్‌లో వేల సంఖ్యలో రోహింగ్యాలు మకాం వేసినట్లు అధికారిక లెక్కలే ఘోషిస్తున్నాయి. శరణార్థులుగా వచ్చినవారు శాశ్వతంగా ఉండేందుకుగాను భారత పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వారికి పాస్‌పోర్టు సహా అన్ని గుర్తింపు కార్డులు అంగట్లో సరుకుగా మారాయి. ఏజెంట్లకు రూ.20వేలు చెల్లించి పాస్‌పోర్టును సంపాదిస్తు న్నారు. ఏజెంట్లు నకిలీ రెంటల్‌ అగ్రిమెంట్‌తో గుర్తింపు కార్డులు సష్టించారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్‌ పహాడీషరీఫ్‌, బాలాపూర్‌ ఠాణా పరిధిలో 35 మంది రోహింగ్యాలను అరెస్ట్‌ చేశారు. వారిలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసినవారూ ఉండటం గమనార్హం. వారి నుంచి అక్రమంగా పొందిన పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు రోహింగ్యాలకు స్థానికులు సహకరిస్తున్నారు. మహ్మద్‌ ఆజముద్దీన్‌ (19) ఏడాది క్రితం మయన్మార్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. బాలాపూర్‌కు చెందిన మొల్ల రియాజూద్దీన్‌ మొల్ల.. అజముద్దీన్‌ను తన కుమారుడిగా పేర్కొంటూ ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేశాడు. అధికారులు ఏమాత్రం పరిశీలించకుండా కార్డును మంజూరు చేశారు. పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. అజముద్దీన్‌ను అతడికి సహకరించిన రియాజూద్దీన్‌నును నిరుడు అక్టోబరులో రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాగా రోహింగ్యాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే, కొంతమంది బంగ్లాదేశ్‌కు వెళ్లి రోహింగ్యాలను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలా వచ్చేవారిని గుట్టుచప్పుడు కాకుండా బంగ్లాదేశ్‌ సరిహద్దులో వదిలేసి వస్తున్నారు. ఈ ఏడాదిలో 10 మందిని తిప్పి పంపించారు. వారికి సహకరించిన నలుగురు రోహింగ్యాలను అరెస్ట్‌ చేశారు.

ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్‌ లెక్కల ప్రకారం నగరంలో 3900 మంది రోహింగ్యాలు ఉన్నారు. పోలీసులు మాత్రం 5వేల దాకా ఉంటారని అంచనా వేస్తున్నారు. రోహింగ్యాలు హైదరాబాద్‌కు రావడం 2012 నుంచి ఎక్కువైంది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్‌ నాలుగు నెలకోసారి రోహింగ్యాల క్యాంపులను పరిశీలించి వారికి గుర్తింపు కార్డులను ఇస్తోంది. ఆ కార్డులు ఉన్నవారినే పోలీసులు హైదరాబాద్‌లో ఉంచుతున్నారు. అక్రమంగా వచ్చిన రోహింగ్యాలను చొరబాటుదారులుగా గుర్తించి అరెస్ట్‌ చేస్తున్నారు. శరణార్థులు కావడం వల్ల శాశ్వత గుర్తింపు పొందే హక్కు రోహింగ్యాలకు లేదు.