సంఘశిక్షా వర్గలు


ప్రథమ వర్ష
హైదరాబాద్‌ అన్నోజీ గూడాలో మే 4 నుండి 25 వరకూ జరిగిన ప్రథమవర్ష సంఘశిక్షావర్గలో తెలంగాణా ప్రాంతానికి చెందిన 419మంది స్వయంసేవకులు శిక్షణ పొందారు. 25న జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, ముఖ్యవక్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్‌ లింగం శ్రీధర్‌ పాల్గొన్నారు.

ముఖ్యఅతిథి లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ 'దేశ ప్రగతిలో, మంచి భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్ర ఎంతో ఉన్నది. కనుక అటువంటి యువతలో దేశభక్తిని, క్రమశిక్షణను, సమాజం పట్ల సేవా భావనను నింపుతున్నటు ఆర్‌.ఎస్‌.ఎస్‌. గత 90 సంవత్సరాలుపైగా చేస్తున్న కృషి అభినందనీయ' మన్నారు. ముఖ్యవక్త లింగం శ్రీధర్‌ మాట్లాడుతూ 'హైందవ చైతన్యమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని, హిందూ సమాజంలో ఉన్న అనైక్యతలను - భేదభావనలను తొలగించి సంఘటితమైన, శక్తివంతమైన హిందూసమాజాన్ని నిర్మించడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. కృషి చేస్తున్నద'ని అన్నారు.

 

ద్వితీయ వర్ష

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ దగ్గర ఒయాసిస్‌ పాఠశాలలో మే 5 నుండి 24వ తేదీ వరకు జరిగిన 20 రోజుల ఆర్‌.ఎస్‌.ఎస్‌.ద్వితీయవర్ష సంఘశిక్షా వర్గలో తెలంగాణ (122) ఆంధ్రప్రదేశ్‌ (75)ల నుండి 197 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. మే 24 సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ్‌ అప్పాల ప్రసాద్‌ మాట్లాడుతూ 'కుల, మత, వర్గ, ప్రాంత, భాష పేరుతో ఘర్షణలని నివారించి హిందువుల్లో కుటుంబ భావనని, సేవా భావాన్ని పెంపొందించుటకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలను నిర్మాణం చేస్తుందని అన్నారు. వైదికధర్మం అందించిన మానవత్వాన్ని, భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలని పెంపొందించుటకు సంఘం పనిచేస్తున్న దని వివరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు దాసోజు శ్రీధర్‌ పాల్గొన్నారు.