పర్యావరణాన్ని కాపాడుకుందాం


జూన్‌ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణం మానవుని శ్రేయస్సుకుపకరించే అంశం. అభివృద్ధి పేరుతో జల, వాయు, భూ కాలుష్యం కల్గిస్తున్న ప్రపంచ దేశాలు రాబోయే ముప్పును గురించి కూడా ఆలోచించాల్సివుంది. భారతీయ చింతనలో ప్రకృతిని తల్లిగా భావించాం. ప్రకృతితో సమన్వయం, సహకారం మన స్వభావం. కాని పాశ్చాత్యదేశాలు ప్రకృతిని కేవలం ఓ భోగ వస్తువుగానే భావించాయి. అందువలన మానవ సౌఖ్యం కోసం ప్రకృతి శోషణ మొదలు పెట్టారు. 
వాయు కాలుష్యంవల్ల భూమి ఉష్ణోగ్రత 2099 వరకు 60 సెంటీగ్రేడు పెరుగుతుందని, దాన్ని 20 సెంటీగ్రేడుకు పరిమితం చేయాలని గతసారి ప్రపంచ ధరిత్రీ సదస్సు పారిస్‌లో జరిగిన సందర్భంగా భారత్‌ చొరవతో 196 దేశాలు నిర్ణయించాయి.కాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దీన్ని బుట్ట దాఖలు చేశారు. దీనిపై ప్రపంచ దేశాలన్నీ కన్నెర్ర చేశాయి. తరువాత ఆయన దూకుడు తగ్గింది. అనేక దేశాల అమలు చేసిన ఊష్ణ తీవ్రతను తగ్గించే చర్యలవల్ల ఓజోన్‌పొర కొంత బలపడిందని కూడా ఆమధ్య వార్తలు వచ్చాయి. ఓజోన్‌పొర మనకు గొడుగులాంటిది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలవల్ల మనకు కలిగే ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది. వాతావారణ మార్పుల ప్రభావం విషయమై భారత్‌లో తీవ్రమైన కృషి జరుగుతోంది. కార్పొరేట్‌ కంపెనీలు ఓజోన్‌పొరను విచ్ఛిన్నం చేసే వాయువు లకు ప్రత్యామ్నాయ వాయువులను వాడుతుంటే, సంప్రదాయ ఇంధన వనరుల వాడకం నుంచి భారత్‌ క్రమంగా సూర్యశక్తి, గాలిమరల నుంచి వచ్చే శక్తికి ప్రాధాన్యమిస్తున్నది. ప్రధాని మోదీ 102 గిగావాట్ల సూర్యశక్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా ఉంచారు. సూర్యశక్తి వినియోగంలోకి తెచ్చేందుకు అనేక సబ్సిడీలను కూడా ప్రకటించారు. భూటాన్‌లో మాదిరిగా ఇక్కడ కూడా బ్యాటరీ కార్లు, వాహనాలు వాడకంలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతున్నాయి. అపుడు పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించవచ్చు. ఇక ఘన వ్యర్థాల విషయానికి వస్తే ఒక్క సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 13 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌తో కూడిన చెత్తను సముద్రంలోకి వదులుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం జరుగనున్నదని అంతర్జాతీయ పర్యావరణ సంస్థ పేర్కొంటోంది.
పోలిథిన్‌ సంచులు, ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలయినంత వరకు తగ్గించాలి. మార్కెట్‌కు వెళ్ళినపుడు ప్రతి ఒక్కరు  బట్ట సంచులను తీసుకెళ్ళాలి. ఘన పదార్థాలతో కూడిన చెత్తను  పొడి, తడి చెత్తలుగా లేదా భూమిలో కలిసే, కలవని చెత్తలుగా విభజించి విసర్జించగలిగితే చెత్తనుంచి కూడా ఎంతోలాభం చేకూరుతుంది. కూరగాయలు, ఆహారపదార్థాలు, పళ్ళు తాలూకు వ్యర్థాలను కంపోస్టు ఎరువుగా తయారు చేయవచ్చు. ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా సమ్మతి కూడగట్టేపనిలో పర్యావరణనిపుణులున్నారు. ఒక చెట్టును నాటడం, మురుగు నీటిని సరియైన రీతిలో వదలడం, నీరు నిలువలేకుండా చూడడం, నీటిని, విద్యుత్తును, వాహన ఇంధనాన్ని పొదుపుగా వాడడం, వీలయినంతవరకు ఆర్‌టిసి, మెట్రోరైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించడం ప్రతి సామాన్యుడూ ప్రతి గ్రామంలో, నగరంలోని బస్తీలో చేయదగిన పనులు. పర్యావరణ దినోత్సవాన్ని ఈసారి భారతదేశపు నేతృత్వంలో ప్రపంచం జరుపుకోవడం భారతీయ సాంస్కృతిక మూల్యాలకు పట్టంకట్టడమే.

- హనుమత్‌ ప్రసాద్‌