దళితులపై 'దాడి'

అసత్యాలు, అపోహలు ప్రచారం చేయడం ద్వారా సమాజంలో కలతల్ని, కల్లోలాన్ని రేపేందుకు కొన్ని శక్తులు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన, దేశంలో మహిళల రక్షణకు గురించి ఒక విదేశీ సంస్థ వెలువరించిన నివేదిక, రాష్ట్రపతి పూరీ దేవాలయ సందర్శన పై వివాదం వంటివి అటువంటి దుష్ప్రచారానికి, కుట్రకు ఉదాహరణలు.
దళితులపై 'దాడి'

జూన్‌ 10న మహారాష్ట్ర జల్గావ్‌ జిల్లాలోని జంనీర్‌ తాలూకాకు చెందిన వాకాడి గ్రామంలో ఇద్దరు షెడ్యూల్‌ కులానికి చెందిన అబ్బాయిలపై దాడి జరిగింది. వారిని విపరీతంగా కొట్టారు. అయితే ఈ సంఘటనలో నిందితుడు (ఈశ్వర్‌ జోషి) నిజానికి సంచార జాతులకు (నోమాడిక్‌ ట్రైబ్‌) చెందినవాడు. మీడియాలో ప్రచారం జరిగిన విధంగా అతను బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు కాదు. ఇద్దరు అబ్బాయిలకు నిందితుడికి చెందిన బావిలో నగ్నంగా ఈత కొట్టడం అలవాటు. చుట్టుపక్కల నివసించే ప్రజలంతా ఆ బావి నీళ్లే తాగడానికి ఉపయోగిస్తారు. దానితో అలా బావిలో ఈత కొట్టవద్దని వారికి చాలాసార్లు హెచ్చరించారు. కానీ  వాళ్ళు మళ్ళీ అదే పని చేయడంతో ఈసారి బావి యజమాని (ఈశ్వర్‌ జోషి) వాళ్ళను పట్టుకుని బాగా కొట్టి పంపించాడు. వాళ్ళు అప్పటికే విప్పి బయటపెట్టిన బట్టలు తొడుక్కుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అంతేకాని కొందరు అనుకుంటున్నట్లుగా వారి బట్టలు ఊడదీసి కొట్టలేదు, నగ్నంగా ఊరేగించలేదు. ఈ ఉదంతాన్ని నిందితుడు వీడియో తీసి దానిని వాట్స్‌ అప్‌లో ఉంచాడు. వీడియో క్లిప్‌ చూసిన కొందరు ఉద్యమకారులు నిందితుడిపై కేసు పెట్టాలంటూ బాధిత అబ్బాయిల తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. నిందితుడిపై పోస్కో (వేధింపుల నిరోధక చట్టం) 323,504,506 సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. అయితే ఈ సంఘటనకు కుల వివక్షగానీ, దళిత వ్యతిరేక ధోరణిగాని కారణం కాదని స్పష్టమవుతోంది. ఇందులో ఏ 'అగ్ర కుల' వ్యక్తికి సంబంధం లేదని కూడా తేలింది.

మహిళా రక్షణపై విదేశీ నివేదిక

ఇటీవల థాంప్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ భారతదేశం మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా మారిందని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా వంటి కల్లోలిత ప్రాంతాల్లో కంటే ఇక్కడ మహిళల పరిస్థితి దారుణంగా ఉందని తమ సర్వేలో తెలినట్లు వెల్లడించింది. మహిళలకు ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 దేశాల్లో అమెరికా కూడా ఉన్నట్లు వివరించింది.

అసలు విషయం ఏమిటంటే థాంప్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సర్వే అసలు సర్వే కాదు. అది ఉత్తుత్తి సర్వే. దీని కోసం సంస్థ ప్రతినిధులు లేదా సర్వే చేసినవారు ఏ దేశానికి వెళ్లలేదు. ముఖ్యంగా పరిస్థితి దారుణంగా ఉందని తేల్చిన భారత్‌ కు ఎవరు రానేలేదు. కేవలం ఫోన్‌ ద్వారా, ఇంటర్‌ నెట్‌ ద్వారా ఈ సర్వే జరిపామని సంస్థ తీరిగ్గా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 548 మంది మేధావులు, నిపుణులు, విద్యావేత్తలను సంప్రదించి, వారి 'అభిప్రాయాలు' తెలుసుకున్నామని, వారు ఏమనుకుంటున్నారనే విషయం ఆధారంగా నివేదిక రూపొందించామని చెప్పింది.

అయితే ఈ ఉత్తుత్తి సర్వేను పట్టుకుని మన దేశంలో కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు యధాప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశాయి. విపక్షాలు కూడా ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోలేదు.

పూరీ దేవాలయ పూజారులపై రాష్ట్రపతి ఫిర్యాదు చేయనేలేదు

పూరీ దేవాలయంలో రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఆయన సతీమణి పట్ల పూజారులు అనుచితంగా వ్యవహరించారన్న మీడియా కధానాల్లో ఏమాత్రం నిజం లేదని తేలింది. అలాగే పూజారుల ప్రవర్తన గురించి రాష్ట్రపతి కార్యలయం నుండి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దేవాలయ ప్రధాన పూజారి స్పష్టం చేశారు.

కోవింద్‌ దంపతులు మూడు నెలల క్రితం పూరీ జగన్నాధ మందిరాన్ని దర్శించుకున్నారు. ఒరిస్సా పర్యటన పూర్తిచేసుకుని వాళ్ళు సజావుగా ఢిల్లీ చేరుకున్నారు కూడా. కానీ వారి పర్యటన గురించి మీడియాలో కొన్ని కధనాలు ప్రత్యక్ష మయ్యాయి. దేవాలయ సందర్శనకు వెళ్లినప్పుడు రాష్ట్రపతి కోవింద్‌, ఆయన సతీమణి సవితా కోవింద్‌ పట్ల కొందరు పూజారులు అనుచితంగా ప్రవర్తించారని, కులపరమైన వివక్ష చూపారన్నది ఆ కధనాల సారాంశం. పూజారుల అనుచిత ప్రవర్తన గురించి రాష్ట్రపతి కార్యాలయం స్థానిక అధికారులకు ఫిర్యాదు కూడా చేసిందని ప్రచారం జరిగింది. అయితే ఒక పత్రిక జరిపిన స్వతంత్ర విచారణలో ఇదంతా తప్పని తేలింది.