కాశీ లో ఆవుపేడతో దహన సంస్కారాలు


గంగానది ప్రక్షాళన దిశగా అడుగులు..

కాశీకి పోతే కాటికి పోయినట్టే' అనే నానుడి భారతీయులకు తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని కోరుకోని హిందువు ఉండడు. అంతటి పుణ్య తీర్థాన్ని కాపాడేందుకు, అక్కడి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది.

కాశీకి వెళ్లినప్పుడు మనకు ఏదైనా ఇష్టమైనదాన్ని వదులుకోవాలనే సందేశం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇలా చేసినా, కాశీలో కర్మకాండలను జరిపినా, గంగలో అస్తికలను కలిపినా మోక్షం ప్రాప్తిస్తుందని అనాదిగా భారతీయుల ప్రగాఢ విశ్వాసం.

అందుకే మనదేశంలో చాలా మంది మరణించిన వారి దహన సంస్కారాలను కాశీలో నిర్వహిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా వారణాసిలో దహన సంస్కారాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కాలుష్యం కూడా పెరగడం ప్రారంభమైంది. గంగా నది కూడా కలుషితం అవ్వడం ఆరంభమైంది. కాలుష్యాన్ని నివారించ డానికి, పర్యావరణ పరిరక్షణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దేహ దహనానికి కలప స్థానంలో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని తీర్మానించింది.

ఇందుకు వారణాసి పాలక వర్గాలు తగిన ప్రణాళికలు రూపొందించాయి. పిడకల తయారీ ద్వారా ఉపాధి కల్పించడం, గోవులను రక్షించడం ఒక వైపు అయితే ఆ పిడకలను ఉపయోగించి చెట్లను రక్షించడం మరో కోణం. అంతేకాకుండా దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు. అయితే సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ధర్మ శాస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శాస్త్రాలకు అనుగుణంగా దహన సంస్కారాలను నిర్వహించాలని అనుకుంటారు. పిడకలతో మృత శరీరాన్ని దహనం చేయడం వల్ల ఎటువంటి దోషం ఉండదని పండితులు తెలపడంతో దేశీయ గోమయంతో తయారుచేసిన పిడకలను దహన సంస్కారాల నిర్వహణకు అందుబాటులోకి తెచ్చారు.ఈ ప్రయోగం మెల్లగా ఫలించింది.

దేశీయ ఆవు పేడతో చేసే పిడకలను దహన సంస్కారాలకు ఉపయోగించేలా అవగాహన కార్యక్రమాలను ప్రారంభించి మార్పు వైపు విజయవంతంగా అడుగులు వేస్తున్నారు. దేశీయ ఆవు పిడకల వినియోగానికి పర్యావరణవేత్తలు కూడా ఆమోదం తెలుపుతున్నారు.