సజీవంగా ఉన్న ముస్లిం వేర్పాటు వాద దోరణి


ఇటీవలే ఆల్‌-ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో షరియా న్యాయస్థానాలు నెలకొల్పుతామని ముస్లింలకు సంబంధించిన చట్టాలు, తీర్పులను ఖురాన్‌, హదీస్‌ ఆధారంగా ఈ షరియా కోర్టులు నిర్ణయిస్తాయని   బహిరంగంగా ప్రకటించారు. మీడియా కథనాల ప్రకారం ఇప్పటికే ఇలాంటివి 40 వరకు కోర్టులు ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది ముస్లిం మహిళలు మూడుసార్లు తలాఖ్‌ అని చెప్పి విడాకులు ఇచ్చే పద్ధతి అన్యాయం అంటూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. 


దీనిపై సుప్రీంకోర్టు తన తీర్పులో తలాఖ్‌ పద్ధతి చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. కానీ అది ఇంకా పార్లమెంటు ఆమోదం పొందలేదు. ముస్లిం హిళలను పట్టిపీడిస్తున్న మరో మత ప్రక్రియ నిఖా షరియా. దీని ప్రకారం భార్యా భర్తలు విడిపోయిన తర్వాత తిరిగి కలవాలనుకుంటే భార్య వేరోక వ్యక్తిని వివాహం చేసుకొని ఆ వ్యక్తికి విడాకులు ఇచ్చిన తర్వాతనే మొదటి భర్తని వివాహం చేసుకోవడానికి వీలవుతుంది. ఇది అమానుషమైన పద్ధతి అంటూ కొందరూ ముస్లిం మహిళలను కోర్టుకి మొరపెట్టుకున్నారు.

ఇలా కొంతమంది చైతన్యవంతులైన ముస్లిం మహిళలు తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించడంతో ముస్లిం సమాజ పరిరక్షకులు, ప్రతినిధులమని చెప్పుకునేవారి ద్వంద్వ నీతి, మహిళల పట్ల చూపుతున్న వివక్ష అందరికీ తెలిశాయి. ఈ పరిణామాలను పసిగట్టిన ముస్లిం మత పెద్దలు మతం ఆధారంగానే తమ వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. అవే షరియా కోర్టులు. రాజ్యాంగ బద్ధంగా జరుగుతున్న పరిపాలన ముస్లిం సమాజానికి వ్యతిరేకమనే భావన కల్పించడం కూడా వీటి లక్ష్యం. ఆ విధంగా ముస్లిమేతరులు ముస్లింలను వివక్షకు గురిచేస్తున్నారని, అణచివేస్తున్నారని చెప్పి దీనికి పరిష్కారం ప్రత్యేక ముస్లిం ప్రాంతాల ఏర్పాటేనని చెప్పాలను కుంటున్నారు.

మన దేశంలో ముస్లిం లీగ్‌ చరిత్ర చూస్తే ఇటువంటి వేర్పాటువాద ధోరణి ఎలా పనిచేస్తుందో, ఎలాంటి విషపరిణామాలకు దారితీస్తుందో తెలుస్తుంది. ముస్లింలకు  ప్రత్యేక నియోజకవర్గాలు కోరుతూ లీగ్‌ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం బ్రిటీష్‌ వారు ముస్లిం వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక నియోజకవర్గాల్ని కేటాయించారు. చివరికి ఈ వేర్పాటువాదమే దేశ విభజనకు దారితీసింది. ఇదే వేర్పాటు ధోరణి రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం కల్పించాలనడంలోనూ, బంగ్లాదేశీ చొరబాటు దారులను వెనక్కి తిప్పి పంపకూడదనడంలోనూ బయటపడుతోంది. 40 లక్షల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను మానవతా దృక్పథంతో దేశంలోనే ఉండనివ్వాలని కోరుతున్నవారెవరూ సొంత దేశంలోనే శరణార్థులుగా కాలం వెళ్ళదీస్తున్న కాశ్మీరీ పండిట్‌ల గురించి మాత్రం నోరు విప్పరు. బంగ్లాదేశీ చొరబాటుదారులను గుర్తించడానికి అసోంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి)ను తయారు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరికి సెక్యులర్‌ మేధావులు, ఓటుబ్యాంకు రాజకీయ నాయకులు వంతపాడుతు న్నారు. చొరబాటు దారులను తిప్పిపంపే ప్రయత్నం చేస్తే దేశంలో రక్తపాతం జరుగుతుందని బెదిరి స్తున్నారు. ఒకప్పుడు దేశ విభజనకు దారితీసిన ఈ ధోరణి మరోసారి దేశానికి నష్టం కలిగించ కుండా ప్రజానీకం అప్రమత్తంగా వ్యవహరించాలి.

- సురేందర్ కుంటి