ధర్మో రక్షతి రక్షితః


ఆగస్ట్‌ 15, 1947 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కంచి పరమాచార్య పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి సందేశం

మన భారతదేశం స్వాతంత్య్రం పొందిన ఈ సంతోష సమయంలో, ఈ ప్రాచీన దేశానికి చెందిన ప్రజానీకమంతా హృదయపూర్వకంగా భగవంతుడిని ప్రార్ధించాలి. అధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించ డానికి అవసరమైన శక్తిని, బుద్ధిని ఇవ్వమని భగవంతుని అందరం ప్రార్ధిద్దాం. భగవంతుని దయ ఉన్నప్పుడే మనం సాధించుకున్న ఈ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోగలం, అలాగే ఈ భూమిపై ఉన్న సర్వ జీవకోటి సుఖసంతోషాలతో ఉండేందుకు సహాయ పడగలం.

ధర్మానికి మూలమైన భగవంతుని చేతిలోని చక్రమే అదృష్టవశాత్తు మన జాతీయపతాకం మధ్యలోకి వచ్చిచేరింది. ఈ చక్రమే ఉన్నత నైతిక విలువలను పాటించిన, దేవనంప్రియః అని పేరుపొందిన అశోక చక్రవర్తిని కూడా గుర్తుచేస్తుంది. అలాగే ఇది భగవద్గీత ద్వారా కృష్ణ పరమాత్మ చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి మనల్ని ఆలోచింపచేస్తుంది. ఈ చక్రాన్ని గురించే భగవద్గీతలో శ్రీకృష్ణుడు - ఏవం ప్రవర్తితమ్‌ చక్రం' (3వ అధ్యాయం, 16శ్లోకం) అని చెప్పాడు.  అదే అధ్యాయంలోని 14, 15 శ్లోకాల్లో ''మానవశరీరం ఆహారం నుండి పుడుతోంది. వర్షం వల్ల పంటలు పండుతున్నాయి. యజ్ఞం (వైదిక కార్యకలాపాలు) వల్ల వర్షం వస్తోంది. ఈ యజ్ఞాల గురించి వేదం చెపుతోంది. అక్షర(నాశనం కానిది) రూపంలో ఉన్న పరబ్రహ్మమే వేదం'' అని ఉంది. దీనినిబట్టి పరమాత్మ వైదిక కర్మల ద్వారా మనకు సాక్షాత్క రిస్తాడని ధర్మ చక్రం చెపుతోంది. ఈ స్వాతంత్య్ర శుభవేళ భగవంతుని దయవల్ల  ధర్మబద్ధంగా (అరం) ఉంటూ సంపదలు(పొరుల్‌), సంతోషాలు (ఇంబమ్‌), చివరికి మోక్షాన్ని (వీడు) సాధించు కోవాలని మనమంతా కోరుకుందాం.

మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి. అవి ముదురు ఆకుపచ్చ, తెలుపు, కాషాయం. ఈ రంగులు శత్రువులను, చెడును జయించేందుకు సైనిక శక్తి, సంక్షేమం కోసం సంపద, సరిగా దేశాన్ని పరిపాలించుకోవడానికి తగిన జ్ఞానం అవసరం అనే విషయాలను మనకు తెలియ జేస్తున్నాయి. అన్ని లోకాలను రక్షించే పరాశక్తి అయిన దుర్గాదేవికి ప్రతీక ముదురు ఆకుపచ్చ. సంపదలకు తల్లి అయిన లక్ష్మీదేవికి గుర్తు కాషాయం. సర్వ జ్ఞానానికి నెలవైన సరస్వతీదేవి రంగు తెలుపు. ఇలా ముగ్గురు మహాశక్తులను గుర్తుచేసే మూడు రంగులే మన జాతీయ పతాకంలో ఉండడం మన అదృష్టం.

స్వాతంత్య్రం సంపాందించుకునేందుకు ఈ దేశం సుదీర్ఘ కాలం పోరాడవలసివచ్చింది. భగవంతుని దయ, మహాపురుషుల ఆశీస్సులు, ప్రజానీకపు త్యాగాల మూలంగా స్వాతంత్య్రం వచ్చింది. ఇలా కష్టపడి సంపాదించుకున్న స్వేచ్చా స్వాతంత్య్రాలతో మన దేశం కరువుకాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని, సామాజిక అలజడులు లేకుండా ప్రజలంతా సద్భావంతో కలిసిమెలసి ఉండాలని సర్వేశ్వరుడైన భగవంతుని ప్రార్ధిద్దాం.

దేశానికైతే స్వాతంత్య్రం వచ్చింది. ఇప్పుడు మనమంతా కూడా వ్యక్తిగత స్వేచ్ఛను పొందగల గాలి. అంటే మనను మనం అర్ధం చేసుకోవాలన్న మాట. మన ఇంద్రియాలు మన అదుపులో ఉండవు. కోరికల్ని, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. అవి ఎప్పుడు మనల్ని పీడిస్తూనే ఉన్నాయి. దేనినైనా, ఎంత సంపాదించినా, అనుభవించినా తృప్తి కలగడం లేదు. ప్రాపంచిక కష్టాలు మనల్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. వీటి వల్ల మనస్సు ఎప్పుడు కలత చెందుతూనే ఉంటుంది.

ప్రతి రోజు కొంతసేపైనా ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి భగవంతునిపైనే ధ్యాస నిలిపే ప్రయత్నం చేయాలి. అలా క్రమంగా అలవాటు చేస్తే కొంతకాలానికి మనస్సు నిశ్చలమై కోపాన్ని, కోరికలను అదుపుచేయగలిగే శక్తి వస్తుంది. ఇలాంటి సాధన చేసే వారికి ఆధ్యాతిక జ్ఞానం త్వరగా పట్టుబడుతుంది. అలాంటి నిజమైన అధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగినవారే నిజమైన స్వతంత్ర పౌరులు.

పరస్త్రీని తల్లిగా భావించాలి. మన గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో ఇతర జీవాల పట్ల కూడా అలాగే ఉండాలి. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సత్యాన్నే పలకాలి. సంకుచితమైన ప్రయోజనాలకోసం సమాజంలో కలతలు సృష్టించ కూడదు. ప్రతిఒక్కరు తమ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సాధనను పెంచుకోవాలి. ఇతరులతో ప్రేమపూర్వ కంగానే వ్యవహరించాలి. అందరూ సుఖశాంతు లతో జీవించాలని  మనసారా కోరుకోవాలి.