పర్యావరణ 'భక్తి'- ప్లాస్టిక్‌కు స్వస్తి


 
మహారాష్ట్రలోని ఆళంది గ్రామం నుండి తొలి ఏకాదశినాడు పాండురంగడిని దర్శించడం కోసం ప్రతి సంవత్సరం పాద యాత్ర చేయడం ఆనవాయితి. కొన్నిసంవత్సరాలుగా ఐటి ఉద్యోగులు గ్రామ ప్రజలతో కలిసి సామాజిక సమస్యలపై ప్రజలను జాగృతపరుస్తున్నారు.

ప్రతి ఏడాదీ ఒక్కొక్క విషయంతో ఈ యాత్ర జరుగుతుంది.ఈ సంవత్సరం ''ప్లాస్టిక్‌ వాడకానికి స్వస్తి చెపుదాం'' అనే సందేశంతో యాత్ర సాగించాలని సంకల్పించారు. స్వామి కార్యంతో పాటు సామజిక కార్యం సాగింది. పండరీపురానికి పయనమైన ఈ మూడు లక్షల మంది భక్తులు విఠలుని దర్శనం తరువాత బయిటికి వచ్చి - ప్లాస్టిక్‌ వాడం' అంటూ ప్రతిజ్ఞ చేశారు.

2017లో ''సైనికులను గౌరవించండి ''అంటూ యాత్ర సాగింది. ఐదు లక్షల రూపాయలకు పైగా సేకరించి దానిని చనిపోయిన సైనికుల కుటుంబా లకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక పెద్ద సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క కుటుంబానికి 15,251 రూపాయిల చొప్పున 15 కుటుంబాలకు ధన సహాయం అందజేశారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న సంవత్సరంలో '' రైతులు దేశానికి వెన్నుముక, వారికి మేము అండ ''అంటూ రైతులకు ధైర్యం చెపుతూ ముందుకు నడిచారు.

సముద్ర జీవాలకు ప్లాస్టిక్‌ తో ముప్పు ఉందని గుర్తించి ఈ సంవత్సరం ''ప్లాస్టిక్‌ వాడకానికి స్వస్తి పలుకుదాం'' అనే నినాదంతో యాత్ర ప్రారంభిం చారు. దీని కోసం తెల్ల టోపీల మీద '' విఠోబాచి యాత్ర ప్లాస్టికలా కాత్రి''(విఠోబా యాత్రలో ప్లాస్టిక్‌ హారతి) అని ముద్రించి వాటిని ధరించి పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ ను వదిలిపెట్టాలన్న సంకల్పంతో దర్శనం చేసుకున్న భక్తులను చూసి విఠలుడు ప్రసన్నుడై ఉంటాడు. ఎందుకంటే ఈ భక్తులు తన భార్య అయిన భూదేవిని ప్లాస్టిక్‌ నుంచి రక్షిస్తున్నారు కదా!