వరలక్ష్మీ వ్రతం - రక్షాబంధన్‌


హిందువులకు శ్రావణమాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో రెండు ప్రముఖ ఉత్సవాలు ఉంటాయి. ఒకటి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం. రెండవది  పౌర్ణమి రోజున జరుపుకొనే రక్షాబంధన్‌. ఐతిహాసికంగా ఈ రెండు పండుగలు లక్ష్మీ దేవి ఆరాధనకు సంబంధించినవి.

శ్రీ వరలక్ష్మీ వ్రతం : స్త్రీలు సౌభాగ్యాన్ని కాపాడుకోవటానికి తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడుని కోరింది. అప్పుడు పరమ శివుడు వరలక్ష్మీ వ్రతాన్ని గురించి ఉపదేశించాడు. ముత్తైదువలు అందరూ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇళ్ళు, వాకిళ్ళు శుభ్రపరిచి ముగ్గులు పెడతారు. తోరణాలతో అలంకరిస్తారు. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతారు. ఇంట్లో తూర్పున మంటపం ఏర్పరచుకొని, మంటపాన్ని అరటిపిలకలు, పువ్వులు, తోరణాలతో అలంకరిస్తారు. మంటపంలో లక్ష్మీదేవి చిత్రపటం, కలశం ఉంచి భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

రక్షాబంధన్‌ : ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మీ వెళ్ళి బలిచక్రవర్తికి రక్ష కట్టి, తన భర్తను విడిపించమని కోరి, విష్ణువును తిరిగి వైకుంఠానికి తీసుకొని పోతుంది.

యేనబద్దో బలీ రాజా దాన లేంద్రో మహా బలః

తేన త్వా మభిబద్నామి రక్షే మాచల మాచల
(ఓ రక్షాబంధమా మహా బలవంతుడు, రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని బంధించావు. కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను)

ఇతిహాసం ప్రకారం శిశుపాలుడిని శిక్షించే క్రమంలో కృష్ణుని వేలుకు గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగు చింపి కట్టు కట్టింది. కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. ఇది అన్నాచెల్లెళ్ళ అనుబంధం. సంఘ శాఖలలో భగవాధ్వజానికి రక్షకట్టి, స్వయం సేవకులు పరస్పరం రక్షలు కట్టుకొని రక్షాబంధన ఉత్సవం నిర్వహిస్తారు.అంతా ఈ దేశమాత పుత్రులమనే భావాన్ని గుర్తుచేసుకుంటారు.